బెండకాయలతో బోలెడంత ఆరోగ్యం..

చిన్నపిల్లలు బెండకాయలు తినమని మారాం చేస్తే చాలా మంది తల్లులు మాయ చేస్తారు.  బెండకాయలు తింటే లెక్కలు బాగా వస్తాయని, తెలివితేటలు పెరుగుతాయని చెప్పి ఏదో ఒక విధంగా తినిపిస్తారు. నిజానికి బెండకాయలో ఉండే జిగురు మెదడు ఆరోగ్యానికి మంచిది. ఇక బెండకాయలు తింటే లెక్కలు బాగా రావడం, బుద్దిగా చదువుకోవడం అనే మాట అటుంచితే బోలెడు లాభాలు మాత్రం చేకూరుస్తాయి. క్రమం తప్పకుండా బెండకాయలు తింటూ ఉంటే కింది ఆరోగ్య ఫలితాలుంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

బెండకాయలు ఎముకలు బలంగా ఉండటంలో సహాయపడతాయి. వీటిలో విటమిన్-కె ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. బోలు ఎముకల వ్యాధి, ఎముకల బలహీనత వంటి సమస్యలు ఆమడ దూరంలో ఉంటాయి.

బరువు తగ్గాలని అనుకునేవారికి బెండకాయలు ది బెస్ట్. ఎందుకంటే వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో కూడా రెండు రకాల ఫైబర్ లు ఉంటాయి. ఒకటి కరిగే ఫైబర్, రెండోది కరగని ఫైబర్. కరిగే ఫైబర్ జీర్ణాశయంలో జెల్ లాంటి పదార్థం ఏర్పరుస్తుంది. అది జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. తద్వారా ఆహారం నుండి చక్కెరలు కూడా నెమ్మదిగా విడుదల అవుతాయి. ఈ ప్రాసెస్ లో కేలరీలు బర్న్ అవుతాయి. దీంతో బరువు పెరగరు. ఇక కరగని ఫైబర్ వల్ల మలబద్దకం సమస్య దూరం అవుతుంది.

బెండకాయల్లో ఫోలెట్ సమృద్దిగా ఉంటాయి. ఈ కారణంగా ఇవి గర్భిణిలకు చాలా మంచివి. మహిళలో ఎక్కువగా ఎదురయ్యే ఎముక సంబంధ సమస్యలను ఇవి దూరం చేస్తాయి.

మధుమేహం ఉన్నవాళ్లకు బెండకాయ బెస్ట్ ఫుడ్. వీటిలో ఉండే పీచు పదార్థం చక్కెరలు నెమ్మదిగా విడుదల అయ్యేలా చేస్తుంది.  ఈ కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్ లో ఉంటాయి.

బెండకాయలలో ఉండే పైబర్, పోషకాలు కొలెస్ట్రాల్ ను నియంత్రణలో ఉంచుతాయి. క్రమం తప్పకుండా బెండకాయ తింటే కొలెస్ట్రాల్ లెవల్స్ ఊహించని విధంగా  తగ్గుతాయి. దీని వల్ల గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.

కంటి ఆరోగ్యానికి విటమిన్-ఎ చాలా అవసరం. ఈ విటమిన్-ఎ బెండకాయల్లో పుష్కలంగా ఉంటుంది. అందుకే బెండకాయలు రెగ్యులర్ గా తింటే కంటి చూపు మెరుగవుతుంది. పిల్లలకు ఇది చాలా మంచిది.

బెండకాయలలో ఉండే పీచు పదార్థం జీర్ణ సమస్యలను అన్నింటిని దూరం చేస్తుంది.

బెండకాయలలో విటమిన్-సి కూడా ఉంటుంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఈ కారణంగా జబ్బులను ఎదుర్కోనే శక్తి శరీరానికి లభిస్తుంది.

అన్నింటి కంటే ముఖ్యంగా బెండకాయలు తరచుగా తినేవారు యవ్వనంగా ఉంటారు.దీనికి కారణం బెండకాయలలో కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. శరీరానికి కొల్లాజెన్ బాగా అందుతుంటే చర్మం యవ్వనంగా ఉంటుంది. జుట్టు బాగా పెరుగుతుంది.

                                                  *నిశ్శబ్ద.