పుదీనా..... సేద తీర్చేనా
posted on Dec 10, 2020 @ 9:30AM
ఆకుకూరల్లో ఘుమఘుమలాడేది ఏది అంటే వెంటనే వచ్చే సమాదానం పుదీనా. నిజమే కదా ఏ వంటకానికైనా మంచి రుచిని వాసనను తీసుకురావాలంటే ఖచ్చితంగా పుదీనాను వాడాల్సిందే. అందులో ఎండాకాలం ఎండల నుంచి ఉపశమనం కావాలనుకుంటే క్రమం తప్పకుండా పుదీనాను వాడతారు చాలామంది. దీనిని కేవలం వంటకాలకి మాత్రమే దీనిని ఉపయోగిస్తారు అనుకోకండి. వైద్యపరంగా కూడా పుదీనాకి మంచి గుర్తింపే ఉంది. ముఖ్యంగా ప్రాకృతిక వైద్యం, ఆయుర్వేదం మొదలైనవాటిలో దీనిని బాగా ఉపయోగిస్తారు. ఈ పుదీనా రక్తప్రసరణని క్రమబద్దీకరించటమే కాకుండా జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. గొంతు నొప్పికి, కడుపులో మంటకి ఇదొక మంచి మందు. పుదీనాతో ఎన్ని ఉపయోగాలున్నాయో చూద్దామా.
జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే పుదీనాను క్రమం తప్పకుండా వాడితే మంచిదని వెైద్యులు చెబుతున్నారు. పుదీనా ఆకుల రసంలో అల్లంరసం, కలబంద గుజ్జు, ఏలకు లు, దాల్చిన చెక్క కలిపి నూరి ప్రతి రోజూ 2-3 చెంచాలు సేవిస్తూవుంటే అరుగుదల పెరుగుతుంది. జీర్ణకోశ వ్యాధులకి, కడుపు నొప్పికి, పుదీనా గింజలు కొన్ని నమిలిన తరువాత ఒక గ్లాసుడు వేడినీళ్ళు తాగితే ఎంతో ఉపశమనం కలుగుతుంది.
పుదీనా కషాయం ఎలాంటి జ్వరాన్నైనా తగ్గిస్తుంది. అంతేకాదు ఈ కషాయం వల్ల కామెర్లు, ఛాతిమంట, కడుపులో మంట, మూత్ర సంబంధవ్యాధులు కూడా తగ్గుముఖం పడతాయి.
పుదీనా, మిరియాలు, ఇంగువ, ఉప్పు, జీలకర్ర, ఎండుద్రాక్ష, ఖర్జూరాలు కలిపి మొత్తం నూరుకుని లేహ్యంలా సేవిస్తే ఉదరసంబందిత వ్యాధులు నివారణ అవుతాయి. ఆకలి ఎక్కువగా లేని వారు, పుల్లత్రేనుపులతో బాధపడేవారు, కడుపులో గ్యాస్ పేరుకుపోయి ఇబ్బంది పడేవారు కూడా ఈ లేహ్యాన్ని తినవచ్చు. ఫలితాన్ని మీరే స్వయంగా చూడచ్చు.
ప్రెగ్నెన్సీ మొదటి రోజుల్లో కొంతమంది వాంతులతో బాధపడుతూ ఉంటారు అలాంటివారు చెంచాడు పుదీనా రసంలో అదే కొలతలో నిమ్మరసం, తేనే కలుపుకుని ఆరారా తాగుతూ ఉంటే వాంతులు తగ్గుతాయి. వికారం కూడా రాకుండా ఉంటుంది.
నిద్రలేమితో బాధపడేవారు రాత్రి పడుకోవటానికి ముందు ఈ ఆకుల్ని ఒక గ్లాసుడు నీళ్ళల్లో వేసి మూతపెట్టి అరగంట తర్వాత తాగితే మంచి నిద్ర పడుతుంది. మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది.
అరికాళ్ల మంటలకు పుదీనా ఆకులను మొత్తగా రుబ్బి పేస్టులా చేసుకుని ఫ్రిజ్‌లో కాసేపు ఉంచిన తరువాత బయటకు తీసి చల్లగా ఉన్నప్పుడు అరికాళ్లకు రాస్తూ ఉంటే మంటలు క్రమంగా తగ్గుముఖం పడతాయి.
పుదీనా ఆకుల్ని ఎండబెట్టి దానిని టీ పొడిలో కలిపి టీ చేసుకుని తాగితే గొంతునొప్పి తాగటమే కాకుండా గొంతులో మాధుర్యం కూడా పెరుగుతుంది.
చెవి, ముక్కుల్లో ఏర్పడే ఇన్‌ఫెక్షన్‌కి తాజా పుదీనా ఆకులు కొన్ని చేతితో రసంలా తీసి ఆ రసంలో దూదిని ముంచి ఆ డ్రాప్స్ చెవిలో, ముక్కులో ఆరారా వేస్తూ ఉంటే ఇన్ఫెక్షన్ క్రమంగా తగ్గిపోతుంది.
నోటి దుర్వాసనకి కూడా ఇది మంచి మందు. నోరు వాసన వచ్చేవారు పుదీనా ఆకుల్ని ఎండబెట్టి పొడిచేసి అందులో కాస్త ఉప్పు వేసుకుని ఆ పొడితో రోజూ పళ్ళు తోముకుంటే నోటి దుర్వాసన మాయం అవ్వటమే కాదు చిగుళ్ళు కూడా గట్టిపడతాయి.
ఎండాకాలంలో మజ్జిగలో పుదీనా ఆకులు వేసుకుని తాగితే చాలా చలవ చేస్తుంది. నిమ్మరసంలో పుదీనా కలుపుకుని తాగితే దాహం కూడా తీరుతుంది. వేసవికాలానికి పుదీనా ఒక మంచి నేస్తంలాంటిది.
ఈ రోజుల్లో ప్రతి వస్తువులోనూ పుదీనాని కలుపుతున్నారు. సబ్బులలో, పేస్టులలో, పేస్ క్రీమ్స్ లో, ఆఖరికి ఈ మధ్య సిగరెట్ తయారీలో కూడా పుదీనాని వాడుతున్నారు. ఈ పుదీనా సిగరెట్ వల్ల గొంతు నొప్పులు అలాగే గొంతు కాన్సర్ వచ్చే అవకాశాలు కూడా చాలా మటుకు తగ్గుతాయట. ఇన్ని ఉపయోగాలున్న పుదీనా ని మనం నిర్లక్షం చెయ్యకుండా క్రమం తప్పకుండా వాడదామా.
...కళ్యాణి