గుడ్లు తినే ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవలసిన విషయాలు ఇవీ..!
posted on Mar 3, 2025 @ 9:33AM
గుడ్లు పోషకాహారంలో ఒక భాగం. ఆరోగ్యంగా ఉండటానికి చిన్న పిల్లలు పెద్దలు వృద్దులు మహిళలు గర్భవతులు రోజుకు ఒక గుడ్డు అయినా తప్పనిసరిగా తినాలని చెబుతారు. గుడ్డులో పోషకాలు శరీరానికి చాలా మేలు చేకూరుస్తాయి. అయితే గుడ్లు తినేవారు కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే..
రోజుకు ఎన్ని గుడ్లు..
గుడ్లు ఆరోగ్యానికి మంచిదని చాలామంది గుడ్లను ఎక్కువగా ఆహారంలో తీసుకుంటూ ఉంటారు. మరికొందరు అయితే వారంలో ఓ రెండు సార్లు గుడ్లు తీసుకుంటూ ఉంటారు. కానీ అసలు రోజుకు ఎన్ని గుడ్లు తినడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి అనే విషయం చాలామందికి స్పష్టంగా తెలియదు. శారీరక శ్రమ ఎక్కువ చేస్తూ శరీర కండరాలకు ఎక్కువ పని కలిగే పనులు చేసేవారు రోజుకు ఒకటి నుండి మూడు గుడ్లు తీసుకోవచ్చు. జిమ్ కు వెళ్లేవారు, ఫిట్‌నెస్ ట్రైనింగ్ తీసుకునేవారు.. పోషకాల కొరతతో ఇబ్బంది పడేవారు ఇలా తీసుకోవచ్చు. సాధారణంగా ఆరోగ్యంగా బాగా ధృఢంగా ఉన్నవారు అయితే రోజుకు ఒకటి లేదా రెండు గుడ్లు తీసుకోవచ్చు. ఎక్కువ శారీరక శ్రమ చేయని వారు అయితే ఎక్కువ గుడ్లను వాటిలోని పచ్చ సొనతో కలిపి తీసుకోకూడదు.
గుడ్లలో ఎక్కువ నాణ్యత కలిగిన ప్రోటీన్ ఉంటుంది. ఇది కండరాల పెరుగుదలకు, కండరాల మరమ్మత్తుకు సహాయపడుతుంది. కండరాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. అందుకే రోజుకు ఒక గుడ్డు తింటూ ఉంటే శరీర కండరాలు బాగా బలంగా ఉంటాయి.
గుడ్లలో విటమిన్-ఎ, విటమిన్-డి, విటమిన్-బి12, భాస్వరం, సెలీనియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి మొత్తం ఆరోగ్యానికి చాలా అవసరం అవుతాయి.
గుడ్లు తినడం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉన్న ఫీల్ ఉంటుంది. దీని వల్ల ఆకలి అనే మాట చాలా సేపు అనిపించదు. ఈ కారణంగా రోజువారీ తీసుకునే కేలరీలు తగ్గుతాయి. ఇది బరువును నియంత్రించడంలో, బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
గుడ్లు కంటిచూపును మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి. ఇందులో లుటిన్ ఉంటుంది. జియాక్సంతిన్ కూడా ఉంటుంది. ఇవి కంటి చూపును మెరుగుపరుస్తాయి.
అయితే గుడ్లు ఆరోగ్యానికి మంచిదని అధికపరిమాణంలో తీసుకోకూడదు. గుడ్లలో ఉండే పచ్చ సొనలో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది. ఇది శరీరంలో కొలెస్ట్రాల్ ప్రమాదాన్ని పెంచుతుంది. కేలరీలు ఇందులోనే ఎక్కువ ఉంటాయి కాబట్టి పచ్చ సొనను ఎక్కువగా తినేవారు బరువు పెరిగే అవకాశం కూడా ఎక్కువ.
*రూపశ్రీ