రాగి పాత్రలో నీళ్లు తాగండి.. ఈ లాభాలన్నీ మీ సొంతం..!


 

వంటింట్లో చాలా వరకు స్టీల్ సామాన్లు ఉంటాయి.  స్టీల్ బిందెలు, స్టీల్ జోడాలలో తాగడానికి నీరు పోసి పెట్టుకుంటారు.  మరికొందరు మట్టి కుండలలో నీరు  తాగుతుంటారు. అయితే ఆరోగ్య స్పృహ ఎక్కువ ఉన్నవారు రాగి పాత్రలలో నీరు తాగుతుంటారు.  అసలు రాగి పాత్రలో నీరు ఎందుకంత శ్రేష్టం. రాగి పాత్రలలో నీరు తాగితే ఆరోగ్య కలిగే ప్రయోజనాలు ఏంటి? తెలుసుకుంటే..

రాగి పాత్రల వాడకం..

రాగిపాత్రలలో నీరు నిల్వ చేసి నీటిని తాగడం ఇప్పుడు కొత్తగా పుట్టిన అలవాటు ఏమీ కాదు..  దీనికి వేల ఏళ్ల చరిత్ర ఉంది. రాగి పాత్రలలో నీరు తాగడం ప్రజల జీవనశైలిలో భాగం. ముఖ్యంగా రాగి పాత్రల వినియోగం, రాగి పాత్రలలో నిల్వ చేసిన నీరు తాగడం  ఆయుర్వేదంలో ప్రాచుర్యం చెందింది.  రాగి పాత్రలను ఆహారం వండుకోవడానికి,  ఆహారం నిల్వ చేసుకోవడానికి కూడా ఉపయోగించేవారు

రాగి పాత్రలలో నిల్వ చేసిన నీరు తాగడం, రాగి పాత్రలో వండిన ఆహారం తినడం వల్ల ఆరోగ్యానికి చాలా లాభాలు ఉంటాయి.

శరీరానికి అవసరమైన ఖనిజాలలో రాగి ప్రధానమైనది.  ఇది శరీరానికి శక్తిని ఇవ్వడమే కాకుండా ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి కూడా సహాయపడుతుంది. రాగి పాత్రలలో నీరు తాగడం వల్ల శరీరంలో ఐరన్ లోపాన్ని భర్తీ చేయవచ్చు.

రక్తహీనత సమస్యతో ఇబ్బంది పడేవారు రాగి పాత్రలలో నీరు తాగితే రక్తహీనత సమస్య తగ్గుతుంది. రాగిలో ఉండే యాంటీ ఇన్ప్లమేటరీ,  యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు  మెరుగ్గా ఉంటాయి.  ఇవి చర్మ ఆరోగ్యానికి చాలా హెల్ప్ అవుతాయి. రాగి పాత్రలలో నీరు తాగితే శరీరం శుద్ది అవుతుంది.

చాలామంది ఉదయాన్నే రాగి పాత్రలలో నీటిని తాగుతుంటారు.  దీని వల్ల రోజంతా శరీరం ఉత్సాహంగా ఉంటుంది. అయితే రాగి పాత్రలలో నీటిని ఎక్కువ సేపు నిల్వ చేయకూడదు.  ఎనిమిది గంటల కంటే ఎక్కువ సేపు నీటిని నిల్వచేస్తే ఆ నీరు వేడి గుణం అధికంగా అవుతాయి.  అంతేకాదు.. రాగి పాత్రలలో నీరు ఆరోగ్యానికి మంచిది కదా అని అదే పనిగా తాగకూడదు. రోజుకు రెండు గ్లాసుల కంటే ఎక్కువ రాగి పాత్రలలో నీటిని తాగకూడదు.

శరీరంలో  రాగి ఎక్కువైనా హాని కలుగుతుంది. ముఖ్యంగా గర్భవతులు,  ఎసిడిటీ,  కిడ్నీ సమస్యలు ఉన్నవారు,  గుండె జబ్బులు ఉన్నవారు రాగి పాత్రలలో నీరు తాగాలంటే మొదట వైద్యుల సలహా తీసుకోవాలి. లేదంటే తీవ్ర నష్టాలు సంభవిస్తాయి.

                                                   *రూపశ్రీ.