తరచుగా తలనొప్పి సమస్య వస్తోందా? బ్రెయిన్ ట్యూమర్ కి సంకేతం కావచ్చు..!
posted on Dec 28, 2024 @ 10:24AM
చాలా మంది తరచుగా తలనొప్పి, సాధారణ జ్వరం వంటి సమస్యలను చాలా లైట్ గా తీసుకుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో వీటి వల్ల తీవ్రమైన ఆరోగ్య దుష్ప్రభావాలు కూడా కలిగి ఉంటాయని తెలుసా..? అకారణంగా జ్వరం రావడం, తలనొప్పి రావడం.. ఉన్నట్టుండి సుస్తీ చేయడం వంటి సమస్యలు అంతర్లీన వ్యాధుల సంకేతాలు కావచ్చు. కొన్నిసార్లు ఇది ప్రాణాంతకమైన సమస్య కూడా కావచ్చు. అలాంటి సమస్యలలో బ్రెయిన్ ట్యూమర్ ఒకటి. బ్రెయిన్ ట్యూమర్ ప్రమాదాలు పెరుగుతున్నాయని ఆరోగ్య నిపుణులు ప్రపంచవ్యాప్తంగా ప్రజలను హెచ్చరిస్తున్నారు. ప్రతి సంవత్సరం బ్రెయిన్ ట్యూమర్ వల్ల రెండున్నర లక్షల మందికి పైగా మరణిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఇంతకీ బ్రెయిన్ ట్యూమర్ ఎందుకు వస్తుంది? దీనికి గల కారణాలేంటి? తెలుసుకుంటే..
2020లో బ్రెయిన్ ట్యూమర్ క్యాన్సర్ కారణంగా 2.46 లక్షల మంది చనిపోయారు. బ్రెయిన్ ట్యూమర్ ఉన్నప్పటికీ.. చాలా ఏళ్ల వరకు దాని గురించి ఎవరికీ తెలియదని, ఆ సమస్య అంత సులువుగా గుర్తించలేమని వైద్యులు చెబుతున్నారు. చాలా సందర్భాల్లో మెదడులో కణితి చాలా నెమ్మదిగా పెరుగుతుంది. ఈ కారణంగా దాని లక్షణాలు కనిపించవు. ఈ పరిస్థితిలోకొన్ని సాధారణ సంకేతాలను తెలుసుకోవడం, వీటిని గుర్తించడం ద్వారా బ్రెయిన్ ట్యూమర్ ఉందా లేదా అనే విషయం తెలుసుకోవచ్చు.
బ్రెయిన్ ట్యూమర్ లక్షణాల గురించి తెలుసుకునే ముందు బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏమిటో అర్థం చేసుకోవడం ముఖ్యం!
మెదడు కణితులు మెదడులో లేదా దాని చుట్టూ ఉన్న కణాల అనియంత్రిత పెరుగుదల కారణంగా ఏర్పడతాయి. ఇది క్యాన్సర్‌కు కూడా కారణం కావచ్చు. మెదడులో 120 కంటే ఎక్కువ రకాల కణితులు అభివృద్ధి చెందుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కుటుంబంలో ఎవరికైనా బ్రెయిన్ ట్యూమర్ ఉంటే ఇతర వ్యక్తులు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇది కాకుండా ప్లాస్టిక్, రసాయన పరిశ్రమలో పనిచేసే వ్యక్తులు కూడా ప్రమాదంలో పడవచ్చు.
జన్యుశాస్త్రం, జీవనశైలి-ఆహారం మొదలైనవాటితో పాటు అనేక రకాల పర్యావరణ పరిస్థితుల కారణంగా బ్రెయిన్ ట్యూమర్ బాధితులుగా మారే అవకాశం ఉంది.
తలనొప్పి..
బ్రెయిన్ ట్యూమర్ ఉన్నప్పుడు చాలా రకాల సమస్యలు ఎదుర్కుంటారు. తలనొప్పి దాని అత్యంత సాధారణ లక్షణం. ఉదయం వేళలో తలలో నొప్పి లేదా ఒత్తిడి పెరగడం లేదా నిరంతర తలనొప్పి చాలా సందర్భాలలో బ్రెయిన్ ట్యూమర్‌కి సంకేతం అని వైద్యులు చెబుతున్నారు. మీకు కూడా ఇలాంటి సమస్య ఉంటే తప్పకుండా వైద్యుల సలహా తీసుకోవాలి. మెదడు కణితి లక్షణాలు దాని పరిమాణం, అది పెరిగే ప్రదేశంపై ఆధారపడి ఉంటాయి. అనేక సందర్భాల్లో మెదడు కణితి ఎంత వేగంగా పెరుగుతుందనే దానిపై కూడా లక్షణాలు ఆధారపడి ఉంటాయి. తలనొప్పి దాని ప్రారంభ సంకేతంగా పరిగణించబడుతుంది. అందుకే దానిని విస్మరించవద్దు.
ఈ లక్షణాలు కూడా..
మెదడులో కణితితో బాధపడుతున్న వ్యక్తులు అనేక రకాల ఆరోగ్య సమస్యలకు గురవుతారు. ఇది అనేక రకాల లక్షణాలను కలిగి ఉంటుంది.
ఉదయం సమయంలో తలనొప్పి లేదా ఒత్తిడి చాలా దారుణంగా ఉంటాయి. ఎక్కువసార్లు చాలా తీవ్రమైన తలనొప్పి వస్తుంటుంది.
వికారం లేదా వాంతులు వచ్చినట్టు అనిపిస్తుంది.
కంటిచూపు సరిగా లేకపోవడం, ఒక వస్తువు రెండుగా కనిపిండం వంటి లక్షణాలు కూడా ఉంటాయి.
చేతులు లేదా కాళ్ళలో సంచలనం లేదా కదలిక తగ్గడం జరుగుతుంది.
శారీరక సమతుల్యత, మాట్లాడటంలో ఇబ్బందిగా అనిపిస్తుంది. కాలక్రమేణా జ్ఞాపకశక్తి సమస్యలు ఉన్నాయ
తరచుగా తల తిరగడం లేదా ప్రపంచం తిరుగుతున్నట్లు అనిపిస్తుంది.
అనుమాలు వద్దు..
సకాలంలో చికిత్స తీసుకుంటే బ్రెయిన్ ట్యూమర్ తీవ్రమైన సమస్యగా మారే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. పెద్దవారు, స్థూలకాయులు లేదా రసాయనాలకు ఎక్కువగా గురయ్యేవారు మెదడు కణితి సంకేతాలపై తీవ్రమైన శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. వ్యాధిని సకాలంలో గుర్తించినట్లయితే, దాని చికిత్స, కోలుకునే అవకాశాలు కూడా పెరుగుతాయి. అయితే మెదడులో పెరిగే అన్ని కణుతులు బ్రెయిన్ క్యాన్సర్ కాదని గుర్తుపెట్టుకోవాలి.
*రూపశ్రీ