రోహిత్ ఆత్మహత్య.. రోహిత్ తండ్రి ప్రశ్నలతో ఇంకా అనుమానాలు..!
posted on Jan 27, 2016 @ 11:48AM
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో రోహిత్ ఆత్మహత్య చేసుకన్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో ఇప్పటికే ఎన్నో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో రోహిత్ తండ్రి మాటలు వింటుంటే ఇప్పుడు ఇంకా అనుమానాలు రేకెత్తుతున్నాయి. రోహిత్ ఆత్మహత్యపై అతని తండ్రి వేముల మణికుమార్ మాట్లాడుతూ రోహిత్ ఆత్మహత్య చేసుకునేంత పరికివాడు కాదని అన్నారు. చదువుల్లో ఎంతో ఉన్నతంగా రాణిస్తున్న తన కుమారుడు రోహిత్‌ను ఉద్దేశపూర్వకంగా ఎవరో హతమార్చి ఉరివేసి ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు రోహిత్ ఆత్మహత్యపై పలు ప్రశ్నలు సంధించారు మణికుమార్. రోహిత్ తో పాటు నలుగురు విద్యార్ధులను సస్పెండ్ చేశారు.. వారి సమస్యను పరిష్కరించుకునేందుకు ఐదుగురు కలిసి నిరాహార దీక్ష చేస్తున్నారు.. అలాంటప్పుడు తన కుమారుడు ఒక్కడే శిబిరం నుంచి వెలుపలకు వెళ్లి గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏంటని .. ఒకవేళ తాను నిజంగా ఆత్మహత్య చేసుకోవాలని భావించినా పోరాట పటిమతో అందరి ముందు ఆత్మహత్య చేసుకొనే వాడు కాని ఇలా ఒంటరిగా ఆత్మహత్య చేసుకునేవాడు కాదని.. అయినా వేధింపులకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోదలిస్తే మొత్తం ఐదుగురూ కలిసి ఆత్మహత్య చేసుకుని ఉండేవారు కదా అని ప్రశ్నించారు. దీంతో ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ జరుగుతుంది.