రుణం తీసుకుంటే ప్రాణ గండమే! యాప్ కాదు ఆన్ లైన్ కిల్లర్ ?
posted on Dec 18, 2020 @ 4:56PM
మీకు క్షణాల్లో అప్పు ఇస్తామంటూ నోటిఫికేషన్ వస్తుంది. చిల్లర ఖర్చులకు డబ్బులు ఇస్తామని సందేశం పంపిస్తారు. రుణం కోసం షూరిటీలు అవరసం లేదంటూ గాలం వేస్తారు. వారి ఉచ్చులో పడి యాప్ డౌన్ లోడ్ చేసుకున్నామంటే చాలు.. ఇన్ స్టంట్ లోనే పేరుతో ఉచ్చులోకి లాగుతారు. క్రిడెట్ యాప్ ద్వారా అప్పు తీసుకున్నామంటే ఇక ఊబిలో చిక్కుకున్నట్లే. ఇలా ఆన్‌లైన్ లో తీసుకున్న అప్పులు ఉసురు తీస్తున్నాయి. అవసరం కొరకు యాప్ ల ద్వారా రుణాలు తీసుకుంటున్న యువతి యువకులు.. వాళ్లు వసూల్ చేసే అధిక వడ్డీలు కట్టలేక చేతులెత్తేస్తున్నారు. డబ్బుల కోసం యాప్ నిర్వాహకులు చేస్తున్న వేధింపులు భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తెలుగు రాష్ట్ర్లాల్లో రెండు రోజుల్లోనూ నలుగురు ఆన్ లైన్ రుణం తీసుకుని మోసపోయి ప్రాణాలు తీసుకున్నారు. సిద్ధిపేట జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగి, హైదరాబాద్ లో యువ ఇంజనీర్.. విశాఖలో ఇద్దరు యువతులు రుణ పాశానికి తనువు చాలించారు. బయటికి వచ్చిన చావులు ఈ నాలుగని.. ఆన్ లైన్ యాప్ ఉచ్చుకు చిక్కి ఎవరికి తెలియకుండా ఇప్పటికే ఎంతో మంది విగత జీవులుగా మారిపోయారని తెలుస్తోంది.
విద్యార్థులు, నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకొని ఈ అనైతిక వ్యాపారం చేస్తున్నాయి ఆన్‌లైన్ క్రెడిట్ యాప్స్. సైబర్ నేరగాళ్లు, ఆర్థిక మోసాలకు పాల్పడే వారంతా యువతను ఇన్‌స్టంట్ లోన్ పేరుతో ముగ్గులోకి లాగుతున్నారు. ఆన్‌లైన్‌లో ఎక్కువగా గడిపే యువతను టార్గెట్ చేసి వారికి లింక్‌లు పంపిస్తున్నారు. గో క్యాష్, స్మాల్ వాలెట్, బబుల్ లోన్, బిలియన్ క్యాష్, లోన్ బజార్ వంటి వందలాది యాప్‌లు ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్‌లో దర్శనమిస్తున్నాయి. ఫోటో, ఆధార్ కార్డ్, సెల్‌ఫోన్‌లోని కాంటాక్ట్‌లే ష్యూరిటీగా ఇచ్చే ఈ రుణంలో… మళ్లీ పదిశాతం ప్రాసెసింగ్ ఛార్జీల కింత కోత విధిస్తారు. మిగిలిన మొత్తాన్ని గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం ద్వారా పంపిస్తారు. మూడు వేల నుంచి 2 లక్షల వరకు రుణాలను క్రిడెట్ యాప్స్ అందిస్తున్నాయి.
క్రెడిట్ యాప్స్ ఇచ్చే ఈ అప్పును పది నుంచి 15 రోజుల్లోనే తీర్చేయాలి. అప్పు సరైన సమయంలో చెల్లిస్తే సరి.. లేదంటే చుక్కలు చూడాల్సిందే. వాళ్లు చేసే వేధింపులు మాములుగా ఉండవు. ఫోన్లు, మెసేజ్ లతో వేధింపులకు దిగుతారు. తల్లిదండ్రులు, బంధువులు, ఫ్రెండ్స్‌కు ఫోన్లు చేస్తామంటూ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడతారు. అప్పు తీర్చలేని పక్షంలో అందరి చెప్పి పరువు తీస్తామంటూ బెదిరిస్తారు. క్రెడిట్ యాప్స్ వడ్డీ లెక్కలు దారుణంగా ఉంటాయి. రుణం ఇచ్చే ముందు చెప్పే లెక్క.. తర్వాత వసూల్ చేసే దానికి అసలు పొంతనే ఉండదు. ఎందుకిలా వసూల్ చేస్తున్నారని అడగడానికి వీలుండదు. దీంతో 3 వేల రూపాయలు అప్పు తీసుకుని లక్ష రూపాయలు చెల్లించిన వారు కూడా ఉన్నారంటే క్రిడెట్ యాప్స్ దారుణాలు ఎలా ఉన్నాయో ఊహించవచ్చు. దీంతో అవసరాలకు ఆన్‌లైన్‌లో అప్పులు తీసుకుని తిరిగి చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం రాజగోపాలపేట చెందిన 24 ఏండ్ల కిర్ని మౌనిక ఏఈవోగా పనిచేస్తోంది. మౌనిక తండ్రి భూపాణి వ్యాపార ప్రయత్నాల్లో డబ్బులు నష్టపోయారు. దీంతో కుటుంబ అవసరాల కోసం ‘స్నాప్ ఇట్ లోన్’ యాప్ నుంచి రెండు నెలల క్రితం రూ. 3 లక్షల రుణం తీసుకుంది. అయితే గడువు తీరినా ఆమె తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించలేకపోయింది. దీంతో యాప్ నిర్వాహకులు మౌనికపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఆమె ఫోన్‌లోని కాంటాక్ట్ నంబర్లన్నింటికీ మౌనికను రుణ ఎగవేతదారుగా పేర్కొంటూ వాట్సాప్ మెసేజ్‌లు పంపించారు. రుణ సంస్థ తీరుతో తీవ్ర మనస్తాపానికి గురైన మౌనిక ఈ నెల 14న ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం చనిపోయింది.
గుంటూరుకు చెందిన సునీల్ కొంతకాలంగా రాజేంద్రనగర్‌లోని కిస్మత్‌పూర్‌లో భార్యతో కలిసి నివసిస్తున్నాడు. ఏడాది కాలంగా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న పలు యాప్‌ల ద్వారా రుణాలు తీసుకుని సకాలంలో చెల్లిస్తున్న సునీల్.. లాక్‌డౌన్ ఇబ్బందుల కారణంగా ఇటీవల రుణాలు తిరిగి చెల్లించలేకపోయాడు. దీంతో రుణదాతలు అధిక వడ్డీలు వేస్తూ చెల్లించాలని ఒత్తిడి తీసుకొచ్చారు. అక్కడితో ఆగక అతడి సెల్‌లోని కాంటాక్ట్‌లకు వాట్సాప్ సందేశాలు పంపించారు. దీనిని అవమానంగా భావించిన సునీల్ బుధవారం రాత్రి ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విశాఖలో ఆన్ లైన్ లోన్ తీసుకుని 40 వేలు చెల్లించలేక ఓ యువతి సూసైడ్ చేసుకుంది. గత నవంబర్ లో విశాఖ జిల్లా గాజువాక సుందరయ్య కాలనీకి చెందిన ఆహ్లాద అనే యువతి. ఇంటి అవసరాల కోసం ఆహ్లాద రెండు ఇన్‌స్టంట్ లోన్ యాప్ ల నుంచి 40 వేల రూపాయల లోన్ తీసుకుంది. గడువులోగా తిరిగి చెల్లించే దారి లేక.. అప్పులు ఇచ్చిన వారి బెదిరింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు ఆహ్లాదకు అనేక బెదిరింపు కాల్స్, మెసేజ్ లు వచ్చాయని తేలింది.
యువతీ, యువకుల జీవితాలతో ఆడుకుంటున్న ఈ యాప్స్ కు ఎలాంటి అనుమతులు లేవు. ఆర్బీఐ నిబంధనలకు విరుద్దంగా మనీ డీల్స్ నిర్వహిస్తున్నారు. రిజిస్ట్రేషన్ లేకుండానే కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఆన్‌లైన్ క్రెడిట్ యాప్స్ రూపొందించి ఇన్‌స్టంట్ లోన్ పేరుతో రుణాలు ఇవ్వడం కూడా ఆర్బీఐ నిబంధనలకు విరుద్దం. అదే సమయంలో అప్పులు తిరిగి చెల్లించమని బ్లాక్ మెయిల్ చేయడం కూడా నిబంధనలకు విరుద్ధమంటున్నారు సైబర్ పోలీసులు. తమ దగ్గరకు ఇలాంటి కేసులు ఇటీవల ఎక్కువగా వస్తున్నాయని చెబుతున్నారు. ఈ కేసుల్లో క్రెడిట్ యాప్ నిర్వాహకులను పట్టుకోవడం తమకు కష్టమవుతుందని చెబుతున్నారు సైబర్ నిపుణులు. వాళ్ల దగ్గర ఫేక్ ఫోన్ నెంబర్లు ఉంటాయని, సిమ్ కార్డు అవసరం లేని వర్చువల్ ఫోన్ కాల్స్ చేస్తున్నారని అంటున్నారు. అయితే క్రెడిట్ యాప్స్ వాళ్లు చేసే బెదిరింపులకు భయపడవద్దని సూచిస్తున్నారు పోలీసులు. క్రెడిట్ యాప్స్ నిర్వాహకులు బెదిరింపులకు పాల్పడితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెబుతున్నారు.