గుత్తా తనయుడు కాంగ్రెస్ వైపు అడుగులు
posted on Mar 12, 2024 @ 3:16PM
తెలంగాణలో బిఆర్ఎస్ ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొంది. పదేళ్లు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ లో ఎక్కువగా టిడిపి శ్రేణులున్నాయి. బిఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత ఈ శ్రేణులన్నీ పక్క చూపులు చూస్తున్నాయి. ఒకప్పుడు కెసీఆర్ కూడా టీడీపీ నేత. టిడిపి హాయంలో డిప్యూటి స్పీకర్ అధిరోహించి మంత్రి పదవి రాకపోవడంతో తెలంగాణ ఉద్యమం పేరిట బయటకొచ్చారు. సక్సెస్ అయ్యారు. అప్పటి వరకు ఉన్న తెలంగాణ ఉద్యమకారులతో బాటు టిడిపి శ్రేణులు బిఆర్ఎస్ లో కొనసాగాయి. మూడోసారి అధికారంలో వస్తానని కెసీఆర్ కలలు కని భంగపడ్డారు. దీంతో పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం చేజిక్కించుకుంది. బిఆర్ ఎస్ ముఖ్య నాయకులు కాంగ్రెస్ లో చేరి కెసీఆర్ కు ఖంగు తినిపించారు. తాజాగా కాంగ్రెస్ తో భేటీ అయిన వారిలో బిఆర్ ఎస్ నేత, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యసలహాదారు వేం నరేందర్ రెడ్డితో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి భేటీ అయ్యారు. మంగళవారం మధ్యాహ్నం వేం నరేందర్ రెడ్డిని ఆయన కలిశారు. గుత్తా అమిత్ రెడ్డి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున నల్గొండ లోక్ సభ లేదా భువనగిరి లోక్ సభ నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ తర్వాత బీఆర్ఎస్ నుంచి పోటీ చేయడంపై వెనక్కి తగ్గారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లుగా ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి భువనగిరి టిక్కెట్‌ను ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది.