గుజరాత్ ఎన్నికలు ఎవరి భవితవ్యం తెల్చబోతున్నాయి? మోడీ, రాహుల్ గాంధీ ?
posted on Dec 11, 2012 @ 2:57PM
మరొక మూడు రోజుల్లో గుజరాత్ శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. ఒక వైపు గుజరాత్ ముఖ్య మంత్రి నరేంద్రమోడీ ఒక్కడే ‘వన్ మ్యాన్ షో’ తో ఎన్నికలలో అవలీలగా దూసుకుపోతుండగా, మరో వైపు కాబోయే ‘భావి భారత ప్రధాని’ రాహుల్ గాంధీ నాయకత్వంలో యావత్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల ప్రచారానికి నడుం బిగించాల్సి వచ్చింది.
రాహుల్ గాందీయే స్వయంగా ఏర్చికూర్చిన అభ్యర్ధుల కోసం ప్రధాని మన్మోహన్ సింగు మొదలుకొని గుజరాత్ లో గల్లీస్తాయి నాయకులవరకూ అందరూ చమటోడుస్తున్నారు. ఆ అభ్యరుల విజయం అంటే రాహుల్ గాంధీ విజయమే అనంతగా కష్ట పడుతున్నారు. త్వరలో జరుగబోయే సాధారణ ఎన్నికలకి నేతృత్వం వహించనున్న రాహుల్ గాంధీకి ఇవి ‘సెమి ఫైనల్స్’ వంటివని రాజకీయ విశ్లేషకులు కూడా తీర్మానిన్చేయడంతో ఈ ఎన్నికలు అతనికి, అతని పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి.
ఇప్పటికే ఉత్తరాన్న రెండు ఎదురు దెబ్బలుతినోచ్చిన రాహుల్ గాంధీకి, మళ్ళీ ఇక్కడ ఎదురు దెబ్బ తగిలితే తేరుకోవడం చాల కష్టమే. గనుకనే, కాంగ్రేసు తన యావద్ శక్తియుక్తులను దార పోసి మరీ విజయం కోసం తీవ్ర ప్రయత్నిస్తోంది. ఇక్కడ గనుక ఓడిపోతే, అది రాహుల్ గాంధీ నేతృత్వం మీద నమ్మకం సడలిం జేయడమే గాక, ‘వరుస అపజయాల సారధి’ అనే ఒక ముద్ర కూడా అతని పై పడక మానదు. ఆ ముద్ర అతని భావి కాలాలకు అడ్డంకిగా మారినా ఆశ్చర్య పోనక్కరలేదు. వరుసగా మూడోసారి కూడా విజయం తన ఖాతాలో వేసుకోగలిగితే నరేంద్రమోడీ రేపు డిల్లీ వరకు కూడా వచ్చి అక్కడా అతనికి పోటీగా తయారవుతాడు. మోడీకి జాతీయ స్తాయి నేతగా ఎదిగేందుకు బిజెపి అంగీకరిస్తుందా లేదా అనేది వేరే విషయం. ఒక వేళ ఒప్పుకొన్న దేశ వ్యాప్తంగా అతను తన ఇదే ప్రభావంచూపగలడా లేదా అనేది కూడా అప్రస్తుతం. గాని, ప్రస్తుత పరిస్తితుల్లో అతనే బిజెపికి పెద్ద దిక్కుగా కనిపిస్తున్న ఈ తరుణంలో వరుసగా మూడోసారిగానీ గెలిస్తే గనుక, మోడిని తన ప్రధాని అభ్యర్దిగా బిజెపి ప్రకటించిన ఆశ్చర్య పోనక్కరలేదు. ఇప్పటికే ‘భావి భారత్ ప్రధాని’గా అభివర్ణింపబడుతున్న రాహుల్ గాంధీకి ఇప్పుడు గుజరాత్ లో మోడీ చేతిలో ఓడిపోయి, మళ్ళీ రేపు అతనితోనే ప్రధానమంత్రి పదవికోసం పోటీ పడవలసి వస్తే అంతకంటే ఇబ్బందికరమయిన విషయం మరొకటి ఉండదు. అందువల్ల, కాంగ్రేసు ఈ ఎన్నికలలో ఎలాగయినా గెలిచి తీరాలి.
కానీ, గుజరాత్ లో పరిస్తితులు గమనిస్తే, కాంగ్రేసుకు సానుకూలంగా ఒక్కటీ కనిపించట్లేదు. ఇప్పటికే నరేంద్ర మోడీ విజయం దాదాపు ఖాయం చేసేస్తూ వెలువడుతున్న సర్వే రిపోర్టులు, మోడీ ప్రభంజనం అంటూ హోరెత్తుతున్న మీడియా వార్తలు, గుజరాత్ వంటి అభివృద్ధి దేశంలో మరెక్కడా మేము చూడ లేదంటూ పారిశ్రామిక వేత్తలు ఇచ్చే శభాషీలు, అన్నీనరేంద్ర మోడికి అనుకూలంగానే ఉన్నాయి. చివరాకరిగా వచ్చిన బాలివుడ్ అందాలభామ ఐస్వర్య బచ్చన్ ‘గుజరాత్ కి నా సల్యుట్’ అంటూ ఆకాశానికి ఎత్తేయడం ఆమె అభిమానులను మోడీ వైపు మరల్చక మానదు.
ఈ నేపధ్యంలో ఎన్నికలను మోడీ పూర్తీ ఆత్మా విశ్వాసంతో అవలీలగా ఎదుర్కొంటుండగా, కాంగ్రేసు కేవలం అతని వైఫల్యాల పైనే ఆధార పడి అతనిని డ్డీ కొనవలసిరావడం నిజంగా యెంత దురదృష్టం. తానూ ఏమి సాదిమ్చిందో చెప్పుకోవలసిన ఈతరుణంలో, అతను ఏమి సాధించలేక పోయాడో చెప్పుకొంటూ అతనినిని డ్డీ కొనవలసి రావడం మరో దురదృష్టం. ఒక విధంగా అక్కడ కూడా మోడీ విజయం సాధించినట్లే. తన విజయాల గురించి తన ప్రత్యర్డులు పదేపదే చెప్పుకోవలసి వచ్చేలాగ చేయడంలోనే అతను సగం విజయం సాధించేడు. ఇక మిగిలినది కేవలం ఒక సాంకేతిక విజయ ప్రకటన మాత్రమె.
మరప్పుడు కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో కూడా ఇప్పుడే ఉహించవచ్చు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకి వీరవిదేయులయిన కాంగ్రేసు వాదులందరూ, వారి మీద ఈగ కూడా వాలనీయకుండా వారికంటే ముందే పత్రికలకి ఎక్కి ‘మోడీ అనైతిక విజయం’ గురించి, ‘బిజెపి నాయకత్వం’ గురించీ మాట్లాడుతూ, ఆత్మ విమర్శకు బదులుగా ఎదురుదాడికి దిగి తమ ఓటమిని కప్పి పుచ్చుకొనే ప్రయత్నం చేయవచ్చు. అయితే, ఆ ప్రయత్నాలు మరో అగ్ని పరీక్షకి ఎంత మాత్రం పనికొచ్చేవి అయ్యిఉండవు.