కాంగ్రెస్ కు కళ్లెం వేస్తున్న గ్రూపిజం.. అనైక్యతే అసలు రోగం
posted on Apr 25, 2023 @ 5:53PM
దేశాన్ని దశాబ్దాల పాటు ఏకచత్రాధిపత్యంగా ఏలిన కాంగ్రెస్ ఉనికి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఒక్క తెలంగాణలోనే కాదు.. జాతీయ స్థాయిలో ఆ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టునాగంభోట్లు అన్న చందంగా ఉంది. ప్రజలలో పార్టీ పట్ల సానుకూలత ఉన్నా.. అది ఎన్నికలలో విజయానికి ఎంత మాత్రం ధీమా ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఇందుకు ఒకే ఒక్కకారణం పార్టీలోని గ్రూపిజం. కాంగ్రెస్ కుటుంబం పట్ల విధేయత పాటించే నాయకులు.. రాష్ట్రాలలోకి వచ్చే సరికి ఎవరికి వారు అధినాయకులుగా భావించుకుంటూ ఎవరికి వారు ఆంధ్రలో పార్టీని త్యాగం చేసి మరీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో నాయకుల వైఫల్యం వలన అధికారంలోకి రావాల్సింది పోయి ఉనికి కోసం పాటుపడే దశకు చేరుకుంది.
మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కాంగ్రెస్ కు రాష్ట్రం ఇచ్చిన పార్టీగా ప్రజలలో అభిమానం ఉంది. అయితే నాయకుల తీరు, వైఖరి కారణంగా ఆ పార్టీ పరిస్థితి రాష్ట్రంలో రోజురోజుకూ దిగజారిపోతున్నదని పరిశీలకులు అంటున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సీనియర్లు జట్టుకట్టి పార్టీ ఒక అడుగు ముందుకు వేస్తే రెండడుగులు వెనక్కి లాగేస్తున్నారు. వాస్తవానికి పిసిసి చీఫ్‌గా రేవంత్ పగ్గాలు చేపట్టిన తరువాతనే తెలంగాణలో కాంగ్రెస్ కు క్షేత్ర స్థాయిలో ఒకింత జోష్ వచ్చింది. కానీ సీనియర్ల వైఖరి కారణంగా ఆ జోష్ కనుమరుగయ్యే పరిస్థితి దాపురించింది. పార్టీలో నాయకుల మధ్య ఆధిపత్య పోరు.. సీనియర్.. జూనియర్ రాజకీయం కారణంగా ఆ పార్టీ విజయావకాశాలను ‘చే’ జేతులా నాశనం చేసుకుంటున్న పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ బలహీనత అనైక్యత. ఆ అనైక్యత కారణంగానే రాష్ట్రంలో బీజేపీ బలపడింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదిగిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పుకోదగ్గ స్థాయిలో స్థానాలు పొందింది.
ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాను దక్కించుకున్నది. అనంతరం అధికార పార్టీ టీఆర్‌ఎస్ వ్యూహంలో చిక్కుకుని కాంగ్రెస్ తరఫున ఎన్నికైన వారంతగా మెల్లగా బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) గూటికి చేరిపోయారు. ఆ తరవాత ఏ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కనీస మాత్రపు విజయాలు సాధించలేకపోయింది. మునుగోడులో డిపాజిట్ కూడా దక్కలేదు.
ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ను గాడిన పెట్టేందుకు పార్టీ అధిష్ఠానం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఒకింత స్వేచ్ఛ ఇచ్చింది. అయితే జానారెడ్డి, , కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, వీహెచ్, జగ్గారెడ్డి, తదితర నాయకులు రేవంత్ స్వేచ్ఛగా పని చేయడానికి అవకాశం లేకుండా ఒకింత పెడసరంగా వ్యవహరిస్తున్నారు. అంతా బాగుంది అన్న వాతావరణాన్నితన వివాదాస్పద ప్రకటనలతో పాడు చేస్తున్నారు.