నేతలకు గ్రామీణ ఉపాధిపథకం పండుగ!
posted on Apr 17, 2012 @ 12:45PM
వేసవి అవడంతో పాఠశాలలకి సెలవులు వస్తాయని విద్యార్థులకు ఎంతో సంతోషం. అదే విధంగా వేసవి వస్తుందంటే కొంతమంది అధికారపక్ష నేతలకు "గ్రామీణ ఉపాధి పథకం'' వస్తుందనే ఆనందం వెల్లివిరుస్తుంది. వేసవిలో ఏప్రిల్ నెల మొదలుకొని జూన్ నెలలో తొలకరి ప్రారంభమయ్యే వరకు గ్రామీణ ఉపాధి పథకం కింద పేద ప్రజలకు ప్రభుత్వం ఉపాథి కల్పిస్తుంది. ఈ పథకాన్ని స్వయం సహాయక బృందాల ద్వారా ఉపాథిపనులు అమలు చేస్తారు. ఉపాధి పనుల పర్యవేక్షణతో పాటు పని నిమిత్తం వచ్చే కార్మికులకు అవసరమైన మంచినీటి వసతి, మధ్యాహ్నం వేల పనిచేసే ప్రాంతంలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడానికి వీలుగా టెంట్ (పందిళ్ళు) వంటి సదుపాయాలూ కల్పించాల్సి వుంటుంది. ఇదుకుగాను సహాయక బృందాలకు ప్రత్యేకంగా నిధులు కూడా ఇస్తారు.
పేరుకి ఉపాధి పనులు స్వయం సహాయ బృందాల ద్వారా నిర్వహిస్తున్నట్టు రికార్డులలో రాసినా వాస్తవంలో వాటిని నిర్వహించేది అధికార పార్టీ నేతలే కాంట్రాక్టర్లుగా వ్యవహ రిస్తూ ఆ పనులను నిర్వహిస్తారు. కాంట్రాక్టరు తన సహజసిద్ధమైన రీతిలో బినామీ పేర్లతో ఎక్కువ పనిదినాలను రాసుకోవడమే కాకుండా వాస్తవంగా పనికివచ్చే కార్మికులకు కల్పించాల్సిన మంచినీరు, విశ్రాంతి పందిళ్ళు వంటి ఏర్పాటు చేయకుండా అందుకు సంబంధించిన డబ్బును కూడా నోక్కేస్తారు. అందుకే వారికి గ్రామీణ ఉపాధి పనులంటే పండుగ. పని ప్రాంతాలలో కనీస సదుపాయాలూ కూడా లేకపోవడం పట్ల ప్రస్తుతం ఉపాధి పనులు ప్రారంభమైన తెలంగాణా జిల్లాలోని కార్మికులు ఆందోళనలు చేస్తున్నారు.