ఆనందయ్యా.. ఆ మందు మహత్యం ఏంటయ్యా? సర్కారు సైతం ఆసక్తి..
posted on May 21, 2021 @ 2:41PM
కరోనాకు ఆయుర్వేద మందు. ఆనందయ్య. కృష్ణపట్నం. ఈ మూడు పేర్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతున్నాయి. ఇన్నేళ్లూ సోదిలో కూడా లేని నెల్లూరు జిల్లా కృష్ణపట్నం గ్రామం.. సడెన్‌గా కరోనా నివారణ కేంద్రంగా మారింది. ఏ జాతరకో, తీర్థయాత్రకో వచ్చినట్టు.. జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఆనందయ్య ఉచితంగా ఇచ్చే కరోనా మందు కోసం ఆశగా, అత్రుతగా.. కిలోమీటర్ల మేర క్యూ లైన్లలో నిలుచుంటున్నారు.
ఆయుర్వేదమో, హస్తవాసో, నమ్మకమో.. కారణం ఏదైనా కానీ.. ఆనందయ్య మందు ఇప్పుడు కరోనా బాధితుల పాలిట అపర సంజీవనిగా మారుతోంది. కరోనా ముదిరి.. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తి కంట్లో ఆనందయ్య మందును వేశారు. అంతే. అంతలోనే అద్భుతం జరిగిపోయింది. పావు గంటలోనే ఆ కరోనా రోగి కోలుకున్నాడు. ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఇలాంటి మెరాకిల్స్ కృష్ణపట్నంలో చాలానే కనిపిస్తున్నాయి. ఆక్సిజన్ లెవెల్ 83 ఉన్న ఓ బాధితుడికి ఆనందయ్య మందు ఇస్తే గంటలోనే ఆక్సిజన్ స్థాయి 95కి పెరగటం జిల్లా అధికారులే స్వయంగా చూశారు. కృష్ణపట్నం గ్రామస్తులందరూ ఆనందయ్య మందు తీసుకోగా.. ఇప్పటి వరకూ ఆ గ్రామంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడం విశేషమే. అందుకే, ఆ మందుకు అంత క్రేజ్. అందులోనూ ఉచితంగా ఇస్తుండటంతో మరింత డిమాండ్. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి.. కృష్ణపట్నం అనే మారుమూల గ్రామంలో మందు ఉందని తెలిసి.. ఏపీలోని వివిధ జిల్లాలతో పాటు అనేక రాష్ట్రాల నుంచి ప్రజలు భారీగా తరలివస్తున్నారు.
విషయం ఉన్న చోట వివాదమూ ఉంటుంది. ఆనందయ్య ఇస్తున్న మందుకు శాస్త్రీయత లేదంటూ లోకాయుక్తకు ఫిర్యాదు అందింది. లోకాయుక్త ఆదేశాలతో అధికారులు మందు పంపిణీ నిలిపివేశారు. కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ కమిటీ పరిశీలన జరిపి.. ప్రాథమిక నివేదిక సైతం అందజేసింది. అంతా ఓకే అన్నట్టుగానే ఉంది ఆ రిపోర్ట్. మరింత పరిశోధన కోసం ఆయుశ్ శాఖకు నివేదించింది. ఆనందయ్య మందుపై ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేవని తేల్చడంతో.. శుక్రవారం మళ్లీ మందు పంపిణీ కార్యక్రమం మొదలైంది. స్థానిక ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి స్వయంగా ఆనందయ్య మందు పంపిణీని ప్రారంభించారు.
ఆనందయ్య మందు కోసం వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా జనం తరలిరావడంతో కృష్ణపట్నం రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. పంపిణీ కేంద్రం దగ్గర తోపులాట జరిగింది. పోలీసులు లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది. ఒక్కసారిగా వేల మంది రావడంతో గందరగోళం నెలకొంది. 3 కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనిపించాయి. పోలీసులు అతికష్టం మీద ప్రజలను కంట్రోల్ చేస్తున్నారు. అందరికీ సరిపడా మందు సిద్ధం కాకపోవడంతో పంపిణీని నిలిపివేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేర తదుపరి చర్యలు ఉంటాయని ప్రకటించారు.
ఆనందయ్య మందుపై సీఎం జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ మందు పంపిణీ చేయాలా? వద్దా? అనే అంశంపై ఉన్నతాధికారులతో చర్చించారు. ఆయుర్వేద మందు శాస్త్రీయత, పనిచేసే విధానంపై అధ్యయనం చేయించాలని సీఎం ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ విభాగాల అధికారులతో పరీక్షలు చేయించాలని వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు సూచించారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి ఐసీఎంఆర్ బృందాన్ని పంపాలని.. ఆయుర్వేద వైద్యంపై శాస్త్రీయ నిర్ధారణ చేయించాలని సీఎం జగన్ స్పష్టం చేశారు.
అయితే, ఇతర ప్రాంతాల నుంచి కరోనా పేషెంట్లు తమ గ్రామంలోకి వస్తుండటం వల్ల తమకు ప్రమాదంగా మారే అవకాశం ఉందంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంబులెన్సుల్లో వచ్చే వారిని గ్రామ సరిహద్దుల్లోనే అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు.. ఆనందయ్య మందును గ్రామంలో కాకుండా ఆ సమీపంలోనే ఖాళీగా ఉన్న ప్రభుత్వం స్థలంలో పంపిణీ చేయాలని గ్రామస్తులు సూచిస్తున్నారు.
ఎవరీ ఆనందయ్య? ఏమిటా మందు?
నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం, కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య డిగ్రీ వరకు చదువుకున్నారు. చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికత ఎక్కువ. భగవాన్ శ్రీ వెంకటయ్య స్వామి శిష్యుడు, గురవయ్య స్వామి దగ్గర శిష్యరికం కూడా చేశారు. ఆ సమయంలో ఆయుర్వేద మందులపై పట్టు సాధించారు. ఆయుర్వేదంలో తనకున్న అనుభవం.. ఇతర ఆయుర్వేద నిపుణుల సలహాలతో.. కరోనాను కట్టడి చేసే మందు తయారు చేసి ముందుగా కృష్ణపట్నం గ్రామ ప్రజలకు అందించారు. ఈ ఏడాది శ్రీరామనవమి నుంచి ఆనందయ్య కరోనాకు మందు పంపిణీ చేస్తున్నాడు. దీని కోసం మొదట్లో పదుల సంఖ్యలో జనం వచ్చేవారు. ఇప్పుడది రోజుకు 4-5వేలకు చేరింది. శుక్రవారం ఆ సంఖ్య మరింత పెరిగింది.
ఐదు రకాలుగా ఆనందయ్య మందు..
1.ఊపిరితిత్తుల కోసం:- ఈ మందు పాజిటివ్ ఉన్న వారు, లేనివారు వాడవచ్చు. దీన్ని వాడితే ఊపిరితిత్తులు శుభ్రమై శక్తి పుంజుకుంటాయి. తెల్లజిల్లేడు, మారేడు ఇగురు, నేరేడు ఇగురు, వేప ఇగురు, దేవర్‌దంగి (ఆడ, మగ) ఐదు వంతులు, నల్లజీలకర్ర, పట్టా, పసుపు, తోక మిరియాలు, పచ్చకర్పూరం, ఫిరంగి చెక్క, అన్నింటినీ కలిపి పొడిచేసి తేనెలో నాలుగు గంటలపాటు ఉడికించాలి. పాజిటివ్ రోగులకు దీన్ని రోజుకు రెండు సార్లు చొప్పున మూడు రోజులు ఇవ్వాలి. కరోనా సోకని వారు ఒక్క రోజు వాడితే చాలు.
2.పాజిటివ్ రోగులకోసం:- పుప్పింట ఆకు, మిరియాలు, నల్లజీలకర్ర, పట్టా, పసుపు, పిప్పిల్ల చెక్క, జాజికాయ, తేనె మిక్సీలో వేసి పొడిచేయాలి. దాన్ని తేనెలో 4 గంటల పాటు ఉడికించాలి. దీన్ని కరోనా రోగులకు భోజనంతోపాటు ఒకసారి చొప్పున రెండు రోజులు వాడాలి.
3.పాజిటివ్ రోగులకోసం:- నేల ఉసిరి, గుంటగరగరాకు, మిరియాలు, నల్ల జీలకర్ర, పట్టా, పసుపు, పిప్పిల్ల చెక్క, జాజికాయ, తేనె కలిపి పొడి చేసి 4 గంటల పాటు తేనెలో ఉడికించాలి. పాజిటివ్ రోగులకు పైన తెలిపిన రెండు మందులను ఇచ్చిన నాలుగు గంటల తరువాత ఒకసారి చొప్పున రెండు రోజులు ఇవ్వాలి.
4. పాజిటివ్ రోగులకోసం:- పెద్దపల్లేరు కాయ, మిరియాలు, నల్ల జీలకర్ర, పట్టా, పసుపు, పిప్పిల్ల చెక్క, జాజికాయ, తేనె అన్నీ కలిపి పొడిచేసిన మిశ్రమాన్ని తేనెలో 4 గంటు ఉడికించాలి. రోజుకు ఒకసారి చొప్పున రెండు రోజులు వాడాలి.
5. పాజిటివ్ రోగులకోసం:- ఒక కేజీ తేనె, 100 గ్రాముల తోక మిరియాలు, చారెడు ముళ్ల వంకాయ గుజ్జు. తయారీ విధానం. తేనె వేడి చేసి అందులో తోక మిరియాలు, ముళ్ల వంకాయ గుజ్జు వేయాలి. ఈ ద్రావణాన్ని ఆక్సిజన్ స్థాయిని బట్టి ఒక్కో కంటిలో ఒక్కో డ్రాప్ చొప్పున వేయాలి.
అయితే, పైన చెప్పిన ఐదు మందుల తయారీపై ఎలాంటి వివాదం లేకున్నా.. ఐదో రకం మందును కంటిలో వేయడంపై మాత్రం అభ్యంతరాలు ఉన్నాయి. కంట్లో వేయడం వల్ల దీర్ఘకాలంలో సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. మరోవైపు.. ఇవి అసలు ఆయుర్వేద మందులే కాదనేది మరో వాదన. ఆయుర్వేద ప్రమాణాల ప్రకారం ఈ మందుల తయారీ, మోతాదు లేదని ఆయుర్వేద నిపుణులు తప్పుబడుతున్నారు. వనమూలికలు, ఔషద వనరులు వాడినంత మాత్రన అది ఆయుర్వేద మందు కాదని.. అంతలా కావాలనుకుంటే ఏ నాటు మందనో, పసరు వైద్యమనో పేరు పెట్టుకోమంటూ ఎద్దేవా చేస్తున్నవాళ్లూ లేకపోలేదు. ఎవరి వాదన ఎలా ఉన్నా.. అది ఆయుర్వేదం అయినా, కాకపోయినా.. ఆనందయ్య మందులో మాత్రం ఏదో మహత్తు ఉండే ఉంటుంది. అందుకు తగ్గట్టు మందు తీసుకున్న వారి అనుభవాలూ ఉన్నాయి. నమ్మకమే దివ్యౌషదం అంటారుగా. అలానే అనుకున్నా.. ఆనందయ్య మందు కరోనా నుంచి కాపాడుతుందనే నమ్మకమే అంతమందిని కృష్ణపట్నం వచ్చేలా చేస్తోంది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఉచితంగా ఇస్తున్న.. ఎంతో ఫలితాన్ని అందిస్తున్న.. ఆనందయ్య మందుకు అంత పాపులారిటీ రావడం ఆశ్చర్యమేమీ కాకపోవచ్చు.