ఏపీ ఆవిర్భావ దినోత్సవంపై వివాదం... నవంబర్ 1పై జగన్ సర్కార్ మొగ్గు..!

 

అవశేష ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవంపై మళ్లీ రగడ మొదలైంది. రాష్ట్ర విభజన తర్వాత తీవ్రంగా నష్టపోయిన నవ్యాంధ్రప్రదేశ్ లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు... ఆవిర్భావ దినోత్సవం నిర్వహించకుండా, నవ నిర్మాణ దీక్షలు చేపట్టారు. ఒక పద్ధతి లేకుండా ఇష్టానుసారంగా చేసిన విభజనతో ఆంధ్రులు తీవ్రంగా నష్టపోయారంటూ విభజన బాధలను ప్రజలు గుర్తుతెచ్చుకునేలా ఆరోజు కార్యక్రమాలు చేపట్టారు. అయితే, ఇఫ్పుడు ప్రభుత్వం మారింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. దాంతో మళ్లీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవంపై చర్చ మొదలైంది. అయితే, రాష్ట్ర విభజనతో జూన్ రెండు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. దాంతో ప్రతి ఏటా జూన్ రెండున తెలంగాణ రాష్ట్రం అంగరంగ వైభవంగా ఆనందోత్సవాల మధ్య ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. అయితే, ఆంధ్రప్రదేశ్ లో ఆవిర్భావ దినోత్సవాలకు ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం స్వస్తి పలికింది. కానీ కొత్తగా అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి సర్కారు... ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. అయితే, ఆంధ్రప్రదేశ్ కు మూడు తేదీలతో సంబంధముండటంతో ఏ రోజున నిర్వహించాలనేదానిపై తర్జనభర్జనలు పడింది. అలాగే విస్తృత చర్చలు జరిపింది. చివరికి, 1956లో తెలంగాణ-ఆంధ్ర రాష్ట్రం విలీనంతో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ నే ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయానికి వచ్చిందట. అంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరుపుకున్నట్లే... నవంబర్ 1న ఏపీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించాలని జగన్ సర్కారు నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు.

అయితే, నవంబర్ 1ని పలువురు వ్యతిరేకిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన దినాన్ని ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకోవడం అంత సరైనది కాకపోయినా... తెలంగాణ విలీనంతో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రోజుని ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకోవడం కూడా సరికాదంటున్నారు. ఈ రెండు తేదీలను కాకుండా, మద్రాస్ నుంచి వేరుపడి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన అక్టోబర్ 1న ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. మరి, జగన్ ప్రభుత్వం ఏ రోజున ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తుందో చూడాలి. అయితే, ఏ నిర్ణయం తీసుకున్నా... ముందుగా అన్ని వర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటే వివాదాలకు తావు లేకుండా ఉంటుందని అంటున్నారు.