ఉచిత మందులా...నమ్మాలా!
posted on Oct 5, 2012 8:54AM
ఆరోగ్య రక్షణను అందరికీ అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిత్యాసవర మందులను ఉచితంగా సరఫరా చేసే పథకం ప్రారంభించాలని ప్రభుత్వం సంకల్పించినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి గులాం నబీ ఆజాద్ చెప్పారు. ప్రభుత్వం తీసుకోబోయే ఈ చర్యవల్ల మందులకోసం ప్రజలు చేసే ఖర్చు తగ్గుతుందని, మందుల హేతుబద్ధ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు, అనవసరమైన, అశాస్త్రీయమైన, హానికరమైన మందుల వినియోగాన్ని అదుపు చేసేందుకు కూడా ఈ చర్య దోహదపడుతుందని అన్నారు. మంత్రిగారి ఆలోచన చాలా బాగుంది. అయితే ఆచరణే అనుమానస్పదం. ఎందుకంటే దేశంలో ప్రభుత్వ ఆసుపత్రులంటే ప్రజల్లో సంతృప్తికరమైన భావన లేదు. ప్రజలను పీడించే ఆసుపత్రులుగానే వాటిని చూస్తుంటారు. అంతేకాదు డాక్టర్లు ఉండరు, ఉన్నా సమయానికి అందుబాటులో ఉండరు. అలా వున్నా... రోగులను పరీక్షించి తమ తమ స్వంత ఆసుపత్రులను పంపించేస్తుంటారు. మందులు సైతం కాలం చెల్లినవే రోగులకు ఇస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడిన ఆసుపత్రులు ఎన్నో ఉన్నాయి. అటువంటి ఆసుపత్రుల్లో ఉచితంగా రోగులకు మందుల పంపిణీ... ఎంత హాస్యాస్పదం...! కొత్తగా పేషెంట్ ఆసుపత్రిలో జాయిన్ అయితే వార్డుబాయ్ దగ్గర నుండి అందరికి ఎంతో కొంత ముట్టచెప్పవలసిందే... రోగి బ్రతికితే సంతోషంగా వారే ఇస్తారు... ఆపరేషన్ సక్సెస్... పేషెంట్ డెడ్.. అన్న రీతిలో పేషెంట్ మరణిస్తే... అక్కడి నుండి పేషెంట్ బయటకు రావాలన్నా డబ్బులు ఇవ్వాల్సిందే... ఇప్పుడు ఉచితమందులంటున్నారు. ఇచ్చేందుకు ఉచితం.. అయినా మాకూ ఖర్చులుంటాయంటూ డబ్బులు వసూలు చేస్తారు... ఎంతోమంది వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు సేవలు చశారు. అలాగే ఎంతోమంది అక్కడే పనిచేస్తూ స్వంతంగా ఆసుపత్రులునడుపుతున్న దాఖలాలు గతంలో ఎన్నో వచ్చాయి. తాంబూలాలు ఇచ్చేశాం... తన్నుకుచావండి... అన్న రీతిలో ప్రకటనలు చేశాం. అయిపోయింది అన్నట్లుగా ఉంటాయి ప్రభుత్వ చేతలు... అంటూ ప్రభుత్వ ఆసుపత్రుల బారిన పడి బయటపడిన ఎంతోమంది సామాన్యులు పలుకుతున్న మాటలివి.