ఇక చాలు ...పీకే ఇక సెలవు ..పీకే
posted on Sep 27, 2022 @ 10:26AM
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ వరసగా మూడవసారి గెలిచింది. హ్యాట్రిక్ సాధించింది. నిజానికి మమతా బెనర్జీ వరస విజయాలకు ఇంకా చాలా కారణాలే ఉన్నా, బీజేపీ క్రియేట్ చేసిన హైప్ కారణంగాఆ క్రెడిట్ మొత్తం, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్(పీకే) ఖాతాలో చేరింది. పీకే వ్యూహాల కారణంగానే తృణమూల్ హ్యాట్రిక్ విజయం సాధించిందనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. ముఖ్యంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీకి 200లకు పైగా సీట్లు ఖాయమంటూ ప్రచారం సాగించినా, బీజేపీ సంఖ్యాబలం 100కు చేరదని ముందుగా చెప్పి మరీ, బీజేపీని 70 ప్లస్ వద్ద కట్టడి చేయడంతో పీకే పేరు దేశమంతా మారుమోగిపోయింది.
అయితే, అదే సమయంలో పీకేఎన్నికల వ్యూహకర్త రోల్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు, కానీ తప్పుకోలేదు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలతో డీల్ కుదుర్చుకున్నారు. అప్పుడే ప్రత్యక్ష రాజకీయాలు తన వంటికి పడవని, ‘ఐయాం ఏ ఫెయిల్డ్ పోలిటిషియన్’.. విఫల రాజకీయ వేత్తను’ అని ప్రకటించుకున్నారు. కానీ మాట మీద నిలబడలేదు. ప్రత్యక్ష రాజకీయాల్లోనూ వేలు పెట్టారు. జోడు పడవల ప్రయాణం సాగిస్తున్నారు. అలాగే, తృణమూల్ తోనూ పరోక్ష బంధాలు కొనసాగించారు. తృణమూల్ జాతీయ ఆకాంక్షలను సొమ్ము చేసుకున్నారు. కమిషన్ వ్యాపారాలు మారు బేరానికి సరుకులు అమ్మినట్లు, గోవా తదితర రాష్ట్రాల కాంగ్రెస్ నాయకులను తృణమూల్ లో చేర్పించారు.
మరో వంక బీజేపీ యేతర పార్టీలను ఏకం చేసి, 2024 సార్వత్రిక ఎన్నికల్లో మోడీని ఓడించే వ్యూహంతో ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసే ప్రయత్నాలు చాలానే చేశారు. మమతా బెనర్జీ మొదలు కేసీఆర్ వరకు వాళ్ళను వీళ్ళను ముందు పెట్టి, కథ నడిపించారు. కానీ వర్కౌట్ కాలేదు. మధ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం జరిగింది. ఆ క్రమంలోనే కాంగ్రెస్ పునరుజ్జీవ ప్రణాలికను తయారు చేసి పార్టీ ముందుంచారు. అయితే ఏదైతే నేమి కానీ, పీటల దాకా వచ్చిన ప్రేమాయణం, పుటుక్కు మంది. పీకే కాంగ్రెస్ ఎంట్రీ పీటల మీదనే ఆగిపోయింది. అదలా ఉంటే. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పీకే వ్యూహాలు బెడిసి కొత్డుతున్నాయనే నిజాన్ని కొంచెం ఆలస్యంగానే అయినా గుర్తించినట్లున్నారు.అందుకే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ సీఎం జగన్మోహన రెడ్డి పీకేకు గుడ్బై చెప్పినట్లు తెలుస్తోంది.
నిజానికి, పీకే ఇంతవరకు ఏ రాష్ట్రంలోనూ ఐసీయులో ఉన్న పార్టీలను బతికించిన దాఖాలాలు లేవు. గెలుపు అంచున ఉన్న పార్టీలను ఆ గట్టుకు చేర్చడం వరకే పీకే వ్యూహాలు పనిచేశాయని ఆయన ట్రాక్ రికార్డే చెపుతోంది. అదీ కాక పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత, జరిగిన ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో పీకే ప్రత్యక్షంగా ఏ రాష్ట్రంలోనూ, ఏ పార్టీకి పనిచేయలేదు. గోవాలో మాత్రం పరోక్షంగా తృణమూల్ కాంగ్రీస్ కు పనిచేశారు. కానీ, గోవాలో మమతా బెనర్జీ పార్టీకి చేతి చమురు వదిలిందే కానీ,ఫలితం మాత్రం దక్కలేదు. బీజేపీ కంటే ఇంచు మించుగా మూడు రెట్లు ఎక్కువగా చేసినా, తృణమూల్ కు సున్నా సీట్లే వచ్చాయి. కేంద్ర ఎన్నికల సంఘానికి రాజకీయ పార్టీలు సమర్పించిన లెక్కల ప్రకారం, బీజేపీ రూ.17 కోట్లు ఖర్చు చేస్తే, తృణమూల్ ఏకంగా రూ. 47 కోట్లు ఖర్చు చేసింది. అయినా, ఒక్క సీటు కూడా దక్కలేదు. అందులో పదో వంతు కూడా చేయని ఆప్ కు రెండు సీట్లు వచ్చాయి.
అంతే కాకుండా, పీకే ఇటో కాలు అటో కాలు వేస్తున్నారు. ఓ వంక కేసీఆర్ ను జాతీయ నేతను చేసందుకు ఆయనతో డీల్ కుదుర్చుకున్నారు. అదే సమయంలో, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను పీఎం కాండిడేట్ గా ప్రొజెక్ట్ చేస్ డీల్ కుదురుచుకున్నట్లు తెలుస్తోంది. మరోవంక, తెలంగాణలో తెరాస పీకే తోక పట్టుకున్నప్పటి నుంచి, ఆ పార్టీకి అడుగడుగునా ఎదురు దెబ్బలే తగులు తున్నాయి. అందుకే, సెంటిమెంట్స్ కు ఎక్కువ ప్రధాన్యతను ఇచ్చే, కేసేఆర్ మొహమాటం లేకుండా ఇక చాలు ..పీకే ..అని ఆయనకు కటీఫ్ చెప్పారు. అయితే, ఇచ్చిన కోట్లు వెనక్కి తెచ్చుకునే వీలు లేక పీకే ఉచిత సేవలు అందిస్తున్నారని కేసీఆర్ బహిరంగంగా ప్రకటించారు.
సోషల్ మీడియా క్యాంపెయిన్ వరకు చాలని, సర్వేలు, వ్యూహాలకు చుక్క పెట్టేశారు. ఇక ఏపీ విషయానికొస్తే, గత ఎన్నికల్లో ప్రత్యక్షంగా రంగంలోకి దిగిన పీకే ఈసారి, ముందుగానే వైసేపీ ఓటమిని గుర్తించారో ఏమో కానీ, పీకే డైరెక్ట గా రంగంలోకి దిగలేదు. ఆయన బదులుగా ఐ ప్యాక్ టీము సభ్యుడు రిషి రాజ్ కు బాధ్యతలు అప్పగించారు. ఆ రిష్ రాజ్, చావుకు పెళ్ళికి ఒకే డప్పు అన్నట్లుగా, వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పీకే ప్లే ట్యూన్సే రీప్లే చేస్తున్నారు. ఆశించిన ఫలితాలు రావడం లేదు సరికదా రిష్ రాజ్ వ్యూహాలు ఎదురు తంతున్నాయి.
అందుకే పీకే టీమ్ పనితనం విషయంలో వైసీపీలో అసంతృప్తి మొదలైంది. అందుకే, జగన్ రెడ్డి కూడా ప్రత్యామ్నాయ ప్రయత్నాలలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఆల్రెడీ ఐసీయూలో ఉన్నా వైసేపీ సర్కార్ ను సేవ్ చేయడం, సెకండ్ టైమ్ గెలిపించడం ఒక పీకే కాదు, పది మంది పీకేలు వచ్చిన అయ్యే పనికాదని పరిశీలకులు అంటున్నారు. అదెలా ఉన్నా, 2014 నుంచి దేశ రాజకీయాల్లో సంచలనంగా, రాజకీయ, ప్రజాస్వామ్య వ్యవస్థలకు ఒక సవాలు మారిన పీకే .. దటీజ్ ప్రశాంత్ కిశోర్ అధ్యాయం ఇక ముగిసినట్లే కనిపిస్తోందని, అంటున్నారు.