దాగుడు మూతా దండా కోర్.. కుక్క వచ్చే పిల్లా భద్రం
posted on Dec 26, 2022 6:02AM
దాగుడు మూతా ఆడండీ
కళ్ళకు చేతులు తీసేశా
ఇదిగో దొంగను వదిలేశా
దొంగకు అందక రారండీ
తల్లిని వచ్చీ తాకండి
దాగుడుమూతా దండాకోర్
పిల్లీ వచ్చే ఎలుకా భద్రం
హైడ్ అండ్ సీక్.. దాగుడు మూతలు పిల్లలకు చాలా ఇష్టమైన ఆట. రోజంతా ఆడుకుంటూ గడిపేయమన్నా వారికీ ఆట బోర్ కొట్టదు. అయితే అంత కు మించిన కిక్ ఓ చిన్నారికి ఈ ఆటలో దొరుకుతోంది.
పూర్వ కాలంలో పిల్లలంతా కలిసి ఈ ఆట ఆడుకునే వారు. ఇంటి ఆవరణలో ఖాళీ స్థలం, పాఠశాల ప్రాంగణంలో విశాలమైన మైదానాలూ ఉండే రోజుల్లో పిల్లలకు ఆటపాటలతో ఆనందంగా గడపడానికి బోలెడంత సమయం ఉండేది. ఆట పాటలతో చదువు సాగేది. ఇప్పుడు సింగిల్ చైల్డ్ ఫ్యామిలీలు, పాఠశాలల్లో తరగతి గదులు తప్ప మైదానమే కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో పిల్లలకు ఆటపాటలన్నవి ఎండమావుల్లాగే మిగిలిపోయిన పరిస్థితి.
దీంతో పెంపుడు జంతువులే వారికి ఇంట్లో నేస్తాలయ్యాయి. అలా ఓ అమ్మాయి తన పెంపుడు కుక్కకు తనకు ఇష్టమైన ఆట నేర్పి దాంతోనే ఆనందంగా ఆడుకుంటున్న వీడియో ఒకటి తాజాగా నెట్టింట తెగ వైరల్ అయ్యింది. పెంపుడు కుక్కలు, పిల్లులతో చిన్నారుల సరదాల వీడియోలు గతంలో చాలా వచ్చాయి.
అయితే ఈ వీడియోలో అమ్మాయి ఆట ఎలా ఆడాలో కుక్కకు నేర్పుతుంటే.. ఆ కుక్క శ్రద్ధగా విని ఆ తరువాత ఆ ఆమ్మాయితో సమానంగా ఆటలో నిమగ్నం అవ్వడం విపరీతంగా ఆకట్టుకుంటోంది. నెటిజన్లు ఆ ఆటను చూసి ఫిదా అయిపోతున్నారు. ఈ వీడియోకు తెగ లైకులు, షేర్లు వస్తున్నాయి.