బిరియానీ బెంగళూరు టు ముంబై.. ఆర్డర్ ను ఒబే చేసిన జుమాటో
posted on Jan 24, 2023 @ 10:24AM
మత్తు తలకెక్కితే.. నింగిలోని చందమామను నేలకు దించేయాలనిపిస్తుంది. కొండ మీద కోతి చేత కల్లు తాగించాలనిపిస్తుంది.. ఇలా ఒకటేమిటి.. అసాధ్యమన్నదేదీ లేదన్న ధీమా పెరుగుతుంది. ముంబైకి చెందిన ఒక అమ్మాయి.. ఇంచుమించు అలాగే అనుకుంది. ఫుల్ గా మందు కొట్టేసిన తరువాత మంచి ఫుడ్ తినాలనుకుంది. అంతే వెంటనే తనకు బాగా ఇష్టమైన బిరియానీని జొమాటో ద్వారా ఆర్డర్ చేసేసింది.
ఇందులో వింతేముంది అనుకోకండి.. ఆమెకు బిర్యానీ చాలా చాలా ఇష్టం.. అంతే కాదు ఆమెకు బెంగళూరులోని ఓ ప్రముఖ హోటల్ బిరియానీ అంటే అంటే మరీ ఇష్టం. దీంతో ఆమె మంబై నుంచి బెంగళూరులోని ప్రసిద్ధ హోటల్ నుంచి బిరియానీ కావాలంటూ జొమాటోకు ఆర్డర్ చేసింది. జుమాటో కూడా చాలా సిన్సియర్ గా ఆమె ఆర్డర్ ను బుక్ చేసుకుని.. అంతే సిన్సియర్ గా డెలివరీ చేసింది.
అయితే చాలా చాలా దూరం కదా.. అందుకు ఆ డెలివరీ ఆ మరుసటి రోజు ఇచ్చింది. బిల్ కూడా పాతిక వందల రూపాయలు వేసింది. ఈ విషయాన్నంతా ఆ అమ్మాయి సామాజిక మాధ్యమంలో పోస్టు చేసింది. తాను చేసింది తప్పని తాను అనుకోవడం లేదనీ, బేంగళూరు నుంచి బిరియానీ తెప్పించుకుని తినడం చాలా సంతోషాన్నిచ్చిందని ఆమె ఆ పోస్టులో పేర్కొంది.