రాహుల్ బాటలోనే గెహ్లాట్.. అధ్యక్ష పదవి వద్దే వద్దు!
posted on Sep 8, 2022 @ 10:41AM
ఎంకి పెళ్లి సుబ్బి చావు కొచ్చిందని సామెత. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పరిస్థితి కూడా ఇంచుమించుగా అలాగే వుంది. ఒక వంక కాంగ్రెస్ పార్టీ, అధ్యక్ష ఎన్నికల షెడ్యూలు ఖరారైంది. సెప్టెంబర్ 17 న పార్టీ అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ ఎన్నికల కమిటీ నిర్ణయించింది. మరో వంక కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరో మారు అధ్యక్ష బాధ్యతలు తీసుకునేందుకు ససేమిరా అంటున్నారు. ఆయన మానాన ఆయన భారత్ జోడీ యాత్ర అంటూ, కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 3,570 కిలో మీటర్ల్ మహా పాదయాత్రకు బయలు దేరారు. ఇంచుమించుగా ఐదు నెలలలకు పైగానే ఆయన యాత్ర సాగుతుంది. ఈ లోగా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల క్రతువు పూర్తి కావలసి వుంది. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకునేందుకు ససేమిరా అంటున్న నేపధ్యంలో, సోనియా గాంధీ, గాంధీ కుటుంబం నమ్మిన బంటు గెహ్లాట్ కు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. నిజానికి, ఇప్పటికే సోనియా గాంధీ ఆవిషయాన్ని గెహ్లాట్ చెవిన వేయడమే కాకుండా, శిరసావహించి తీరాలని ఆదేశించారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే, ముఖ్యమంత్రి కుర్చీ వదిలి పార్టీ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించేందుకు ఆయన సిద్దంగా లేరని తెలుస్తోంది. దీంతో ఆయన కుడితిలో పడిన ఎలుకలా కొట్టుకుంటున్నారని అంటున్నారు. మరో వంక సుమారు నాలుగున్నర సంవత్సరాలకు పైగా, ఏదో విధంగా గెహ్లాట్ ను గద్దె దించి,రాజస్థాన్ ముఖ్యమత్రి కుర్చీలో కూర్చునేందుకు తహతహ లాడుతున్న, సచిన్ పైలట్ ఆయన వర్గం చక చకా పావులు కదుపుతోంది. గెహ్లాట్ కొత్త కొలువుకు సంబంధిచిన ఉహాగానాలు మొదలైనప్పటి నుంచే ఆయన అనుచరులు సచిన్ పైలట్ ను ముఖ్యమంత్రిని చేయాలనే డిమాండ్ ను మరింత గట్టిగా వినిపిస్తున్నారు.అదలా ఉంటే, పులి మీద పుట్రలా, మంగళ వారం(సెప్టెంబర్ 7) సచిన్ పైలట్ 48 పుట్టిన రోజును పురస్కరించుకుని, ఆయన అనుచరులు, జైపూర్ లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం, పైలట్ నివాసం వద్ద దీపాలు అలంకరించారు. సచిన్ పైలట్ కటౌట్లు, బ్యానర్లను ఏర్పాటు చేశారు. ధూమ్ ధామ్ గా సంబురాలు జరిపించారు. అంతేనా, అంటే, అంతే కాదు,, సచిన్ పైలట్ పుట్టిన రోజు వేడుకల్లో ఇంచు మించుగా30మందికి పైగా మంత్రులు,ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఆయనకి జై కొట్టారు. నిజానికి కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక ప్రకటన వెలువడినప్పటి నంచి పైలట్ వర్గంలో జోష్ పెరిగింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో సచిన్ పైలట్ కీలక భూమికను పోషించారు. ఆయన ఇంకెంత కాలం నిరీక్షించాలని ఆయన అనుచర ఎమ్మెల్యేలు అడుగుతున్నారు.
ఇది ముఖ్యమంత్రి గెహ్లాట్ ను పుండు మీద కారం చల్లిన విధంగా బాధిస్తోంది. అయితే , కాంగ్రెస్ రాజకీయాలను అవపోసన పట్టిన గెహ్లాట్ అంత తేలిగ్గా కుర్చీని, పైలట్ కు ఇచ్చేందుకు సిద్దంగా లేరని, అందుకే, ఢిల్లీలో పార్టీ అధ్యక్ష బాధ్యతలను నిర్వహించడంతో పాటుగా జైపూర్ లో ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు అనుమతించాలని, లేదంటే తాను సూచించిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయాలని సోనియా గాంధీకి షరతు విధించినట్లు చెపుతున్నారు. అయితే సోనియా నథింగ్ డూయింగ్ పూర్తి స్థాయిలో పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించాలని స్పష్టం చేసినట్లు చెపుతున్నారు.
ఈ నేపధ్యంలోనే, గెహ్లాట్ చివరి ప్రయత్నంగా కావచ్చును రాహుల్ గాంధీ భరత్ జోడో యాత్ర ప్రారంభానికి ముందు కూడా ఒక రాహుల్ గాంధీ నుంచి ఒక మాట తీసుకునే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీలో చిన్నా పెద్ద అందరూ కుడా రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడు కావాలని కోరుకుంటున్నారని మరో మారు గుర్తు చేశారు. యాత్ర ప్రారంభానికి ముందు విలేకరుల సమావేశంలో మాట్లాడిన గెహ్లాట్ ప్రస్తుతం దేశం ఎదుర్కుంటున్న సవాళ్లను సమర్ధ వంతంగా ఎదుర్కునేందుకు కాంగ్రెస్ పార్టీకి రాహుల్ జీ నాయకత్వం అవసరం. రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేందుకు మేమంతా సిద్దంగా ఉన్నాం అని అన్నారు.
మరోవంక కాంగ్రెస్ లోని గాంధీ కుటుంబ అభిమానులు, విశ్వాస పాత్రులు, పార్టీకి గాంధీ కుటుంబ సారధ్యమే శరణ్యమనే ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. అందులో భాగంగానే గెహ్లాట్ పదే పదే రాహుల్ గాంధీని పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే, గెహ్లాట్ వర్గానికి చెందిన రాజ్యసభ ఎంపీ, తివారీ గాంధీ కుటుంబ నాయకత్వం లేకుంటే పార్టీ చీలిపోతుందని, రాహుల్ కాకుంటే ప్రియాంక వాద్రా అధ్యక్ష పదవిని చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
కాగా, కన్యాకుమారిలో గెహ్లాట్, ఢిల్లీలో అయన వర్గానికి చెందిన రాజ్యసభ సభ్యుడు తివారీ చేసిన తాజా ప్రకటనలను గమనిస్తే, గెహ్లాట్ రాజస్థాన్ ముఖ్యమంత్రి కుర్చీ వదిలేందుకు సిద్డంగా లేరని స్పష్టమవుతోంది పరిశీలకులు భావిస్తున్నారు.అలాగే, పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే విషయంలో గెహ్లాట్ కూడా రాహుల్ గాంధీ బాటలోనే నడుస్తునట్లుందని, పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు అయన ఏమాత్రం సిద్దంగా లేరని పరిశీలకులు అంటున్నారు. మొరాయించిన గుర్రాన్ని రేవు వరకు ఎలాగైనా తీసుకు పోవచ్చును కానీ నీళ్ళు తాగించడం కుదరదని,. ఆలాగే గెహ్లాట్ ను జైపూర్ నుంఛి ఢిల్లీకి పంపినా, ఫలితం మాత్రం ఉందని పరిశీలకులు అంటున్నారు.