వినాయకుని పత్ర పూజలో వైద్య విజ్ఞానం!
posted on Sep 12, 2018 @ 11:28AM
పత్ర పూజ లేకుండా వినాయక చవితి పూర్తికాదు. ఆ గణేశుని వివిధ పేర్లతో స్తుతిస్తూ ఏకవింశతి (21) పత్రాలతో పూజించడం సంప్రదాయం. ఆరోగ్యానికి సంబంధించి వినాయకచవితి వచ్చే సమయం చాలా కీలకమైంది. వర్షాకాలం ముగిసి అంటువ్యాధులు ప్రబలే కాలం ఇది. ఈ సమయంలో కనుక ఔషధులకు దగ్గరగా ఉంటే గాలి ద్వారా సోకే క్రిముల తాకిడి తక్కువయ్యే అవకాశం ఉంది. బహుశా అందుకనే మన పెద్దలు పత్రపూజను ఏర్పరిచి ఉంటారు. పల్లెల్లో రోజువారీ కనిపించే మొక్కలలోని ఔషధ గుణాలు ఉన్న మొక్కలను ఎంచుకుని వాటి పత్రాలతో పూజను చేయమని మనకు సూచించారు. అలా పూజించిన పత్రాలను కనీసం 3 నుంచి 9 రోజుల వరకూ ఇంట్లోనే ఉంచడం వల్ల వాటి నుంచి వెలువడే గాలి, చుట్టుపక్కల ఉన్న వాతావరణం మీద ప్రభావం చూపుతుంది. ఇక వినాయకునితో పాటుగా ఆ పత్రాలను కూడా నీటిలో విడువటం వల్ల నీటిలో కూడా ఔషధిగుణాలు చేకూరుతాయి. ఈ పత్రాలలో కొన్నింటిని నేరుగా ఆయుర్వేదంలో వాడతారు, మరికొన్నింటిలో పత్రాలను కాకుండా పళ్లనో, బెరడునో, కాయలనో, వేళ్లనో వాడతారు. కానీ ఇలా పూజలో సంబంధింత పత్రాలను వినియోగించడం వల్ల ఏ చెట్టుని ఏమంటారు, వాటిని గుర్తించడం ఎలా, వాటి ఉపయోగం ఏంటి అన్న వైద్య విజ్ఞానమన్నా మన పూర్వీకులు ఒక తరం నుంచి మరో తరానికి అందించేవారు. మరి ఆ పత్ర పూజలో దాగిన ఔషధాలను ఇప్పుడు చూద్దామా...
సుముఖాయనమః మాచీపత్రం పూజయామి!
మాచిపత్రి లేదా దవనం: కుష్టువ్యాధితో సహా ఎటువంటి చర్మవ్యాధినైనా
తగ్గించగల ఔషధి. తలనొప్పి మొదలుకొని తిమ్మిర్ల వరకూ నరాలకు
సంబంధించి చిన్నాచితకా సమస్యలన్నింటినీ దూరం చేస్తుంది.
గణాధిపాయ నమః బృహతీపత్రం పూజయామి!
వాకుడాకు: దగ్గు, ఉబ్బసం, క్షయలాంటి కఫ సంబంధమైన రుగ్మతలకు చక్కటి మందు.
ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి!
మారేడు: శివునికి ఎంతో ప్రీతిపాత్రమైన ఈ ఆకు నిజంగానే అందుకు
యోగ్యమైనది. ఆయుర్వేదంలోని ముఖ్య ఔషదాలలో బిల్వం ప్రముఖమైంది.
ఇప్పుడంటే పిల్లల్లో అతిసారాన్ని అరికట్టేందుకు రోటావైరస్‌లాంటి
టీకాలను వేయిస్తున్నారు. కానీ ఒకప్పుడు మారేడు పత్రాలు, కాయలతో
అతిసారాన్ని ఎదుర్కొనేవారు. జీర్ణాశయానికి సంబంధించిన మరెన్నో
సమస్యలకు కూడా మారేడు చక్కటి మందులా పనిచేస్తుంది.
గజాననాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!
గరికె: వినాయకునికి అత్యంత ప్రీతికరమైన పత్రం. తన ఒంటి మీద తాపం
భరిపరానిది అయినప్పుడు సాక్షాత్తూ ఆ గరికెనే మీద కప్పమన్నారట
ఆయన. నిజంగానే చర్మసంబంధమైన వ్యాధులన్నెంటికో ఔషధి ఈ గరికె.
ఏదన్నా దెబ్బ తగిలినప్పుడు వెంటనే గరికెని పిండి దెబ్బ మీద అద్దటం
ఇప్పటికీ మన పల్లెల్లో చూడవచ్చు.
హరసూనవే నమః దత్తూరపత్రం పూజయామి!
ఉమ్మెత్త: ఒంటిమీద ఏవైనా సెగ్గడ్డలు వచ్చినప్పుడు, ఉమ్మెత్త ఆకులకు
కాస్త సెగ చూపించి వాటి మీద వేసేవారు పెద్దలు. అప్పుడు గడ్డలలో ఉన్న
చీము త్వరగా బయటకు వచ్చేస్తుందట.
లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి!
రేగు: రేగు పళ్ల కాలం వచ్చిందంటే పెద్దలెవ్వరూ వాటిని వదులుకోరు.
జీర్ణకోశ వ్యాధులకు ఉపశమనంగానూ, రోగనిరోధక శక్తిని
పెంపొందించడంలోనూ రేగు పళ్లు, కాయలు అమిత ఫలితాన్ని అందిస్తాయి.
గుహాగ్రజాయ నమః అపామార్గపత్రం పూజయామి!
ఉత్తరేణి: ఇప్పటికీ పల్లెల్లో ఉత్తరేణిని పళ్లు తోముకునేందుకు వాడతారు.
చెవిపోటు, పిప్పిపన్నులాంటి ముఖసంబంధమైన వ్యాధులకి ఔషధిగా దీనిని
వాడతారు.
గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి!
తులసి: తులసి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే కదా! ఇంటింటా
దేవుళ్లతో సమానంగా పూజలందుకునే తులసి నిజంగానే అందుకు అర్హత
కలిగింది. క్రిమిసంహారిణిగా, చర్మవ్యాధులకు దివ్యౌషధంగా, కఫానికి
విరుగుడుగా తులసి ఓ ఇంటింటి ఔషధం.
ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి!
మామిడాకు: ఇంట్లో ఏ శుభకార్యం జరుగుతున్నా దానికి తొలి సూచనగా
మామిడాకుల తోరణాలను గుమ్మాలకు కడతారు. గుమ్మం దగ్గర మామిడాకు ఉంటే
ఇంట్లోకి ఏ క్రిమీ రాలేదని పెద్దల నమ్మకం.
వికటాయ నమః కరవీరపత్రం పూజయామి!
గన్నేరు: చర్మవ్యాధులకు ఔషధంగా పనిచేస్తుంది. తేలుతో సహా ఎన్నో
విషకీటకాలు కుట్టినప్పుడు దీనిని ఉపయోగిస్తారు.
భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి!
విష్ణుక్రాంతం: కఫం వల్ల ఏర్పడే దగ్గు, జలుబు, జ్వరం వంటి
సమస్యలను దూరం చేస్తుంది.
వటవేనమః దాడిమీపత్రం పూజయామి!
దానిమ్మ: జీర్ణకోశంలో ఉండే క్రిముల పనిపట్టేందుకు దీనిని వాడతారు.
రక్తహీనతను సైతం దూరం చేయగల శక్తి దీనికి ఉంది.
సర్వేశ్వరాయనమః దేవదారుపత్రం పూజయామి!
దేవదారు: కళ్లకు చలువచేసే గుణం ఈ దేవదారు పత్రాలతో కాచిన తైలానికి ఉంటుంది.
ఫాలచంద్రాయ నమః మరువకపత్రం పూజయామి!
మరువం: మల్లె వంటి పూలతో సమానంతో ఆడవారు ఈ ఆకులను పూలమాలలో
వాడతారు. అదేమీ వృథా పోదు. ఎందుకంటే మరువంలో ఉండే ఔషధ గుణాలు కేశాలకి
ఎంతో బలాన్ని అందిస్తాయట. ఈ ఆకుల నుంచి వచ్చే సువాసన మానసిక
ఒత్తిడిని సైతం తగ్గిస్తుంది. మరి వినాయకుడు చల్లదనం కోసం చంద్రుని
తలమీద ధరించినట్లు, ఆడవారు మరువాన్ని తల మీద పెట్టుకోవడం
తప్పేమీ కాదుగా!
హేరంబాయ నమః సింధువారపత్రం పూజయామి!
వావిలాకు: కీళ్లకు సంబంధించిన నొప్పులకు దీనిని ఔషధంగా వాడతారు.
శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి!
జాజి: చర్మవ్యాధులలోనే కాకుండా జాజిని నోటిపూత, నోటి దుర్వాసనన
నుంచి తక్షణం ఉపశమనం పెద్దలు వాడుతుంటారు.
సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి!
దేవకాంచనం: జీర్ణాశయంలో నులిపురుగులను సైతం పోగొట్టగలదీ దేవకాంచనం.
ఇభవక్త్రాయనమః శమీపత్రం పూజయామి!
జమ్మి: పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు ఈ చెట్టు మీదనే తమ
ఆయుధాలను దాచిపెట్టారు. దీని నుంచి వీచే గాలి సైతం ఎన్నో క్రిములను
సంహరించగలదని నమ్మకం. అందుకనే దీనికి ప్రదక్షిణ చేసినా ఆరోగ్యం
చేకూరుతుందని చెబుతారు.
వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి!
రావి: బుద్ధునికి జ్ఞానోదయాన్ని కలిగించిన వృక్షమిది. .జీర్ణసంబంధమైన
ఇబ్బందులు ఉన్నవారి కోసం ఆయుర్వేదంలో రావిని విరివిగా వాడతారు.
సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి!
మద్ది: మద్దిలో రెండు రకాలున్నాయి. తెల్లమద్ది, నల్లమద్ది! మనం
పూజ కోసం సాధారణంగా తెల్లమద్ది పత్రాలను వాడతాము. వ్రణాల నుంచి
ఉపశమనం లభించేందుకు తెల్లమద్ది ఆకులు ఉపయోగపడతాయి.
కపిలాయ నమః అర్కపత్రం పూజయామి!
జిల్లేడు: చర్మవ్యాధులకే కాకుండా నరాలకు సంబంధించిన తిమ్మిర్లు,
పక్షవాతం వంటి రుగ్మతలను హరించడంలో జిల్లేడుది గొప్ప పాత్ర. అయితే
జిల్లేడుని కానీ, ఆ మాటకి వస్తే ఏ ఇతర ఔషధిని కానీ పూర్తి పరిజ్ఞానం
లేకుండా ఉపయోగించకూడదు.
-నిర్జర