ఈడీ సోదాలు.. రూ. 2 కోట్లు స్వాధీనం

ఖనిజాల అక్రమ తవ్వకాల ఆరోపణలపై ఈడీ అధికారులు సోదాలు జరిపి  రెండు కోట్ల రూపాయలు సీజ్ చేశారు. ఒడిశాలోని గంజాం జిల్లాలో పెద్ద ఎత్తున ఇసుక, నల్లరాయి వంటి వాటి అక్రమ తవ్వకాల ద్వారా భారీగా మనీలాండరింగ్ జరుగుతోందన్నఫిర్యాదుల నేపథ్యంలో ఈడీ అధికారులు ఈ సోదాలు నిర్వహించారు.

గంజాం జిల్లాలో దాదాపు 20 ప్రాంతాలలో ఏకకాలంలో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు  దాదాపు రెండు కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే నగదులో పాటు మైనింగ్ లీజులకు సంబంధించి కీలక పత్రాలను కూడా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  

ఛత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్.. మావోయిస్టు కీలక నేత పాపారావు హతం

ఛత్తీస్‌గఢ్ లోని  బీజాపూర్ జిల్లాలో  జరిగిన ఎన్ కౌంటర్ లో  మావోయిస్టు పార్టీ అగ్రనేత  పాపారావు హతమయ్యాడు. ఈ ఘటనతో   బస్తర్ ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్టైంది.  అత్యంత విశ్వసనీయంగా అందిన  సమాచారం మేరకు, గత కొన్ని రోజులుగా పాపారావు నేషనల్ పార్క్ పరిసర అటవీ ప్రాంతంలో దాక్కుని ఉన్నాడని తెలుసుకున్న భద్రతాదళాలు కూంబింగ్ చేపట్టాయి.   డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ , స్పెషల్ టాస్క్ ఫోర్స్, మరియు కోబ్రా ఫోర్స్ బృందాలు సంయుక్తంగా నిర్వహించిన ఈ కూబింగ్ లో తారసపడిన మావోయిస్టులు కాల్పులు జరపడంతో  ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో మావోయిస్టు కీలక నేత పాపారావు అక్కడికక్కడే  మరణించాడు.   సంఘటనా స్థలం నుంచి  రెండు ఏకే–47 తుపాకులు,  మందుగుండు సామగ్ర, మావోయిస్టు సాహిత్యాన్ని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.  పాపారావు మావోయిస్టు పార్టీలో  కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ, భద్రతా బలగాలపై దాడులు, ఆయుధాల సరఫరా, కొత్త క్యాడర్ నియామకం వంటి కార్యకలాపాల్లో ప్రధాన పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.  ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఎఇంకా మావోయిస్టులు అనుమానంతో  భద్రతా బలగాలు ఇంకా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.  

గ్రీన్ లాండ్ ను ఆక్రమిస్తాం.. వ్యతిరేకించే వారిపై అదనపు సుంకాలు విధిస్తాం!

అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ మరో సారి టారిఫ్ వార్ ప్రకటించారు. తమ ఆక్రమణలను అడ్డుకుంటే అదనపు సంకాలను విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు.  ఔను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మరోసారి టారిఫ్  హెచ్చరికలు చేశారు. గ్రీన్ లాండ్   విషయంలో తమతో విభేదించే దేశాలపై అదనపు సుంకాలు విధిస్తానని హుంకరించారు.   అమెరికా జాతీయ భద్రత విషయంలో గ్రీన్ లాండ్ అత్యంత కీలకమన్న ట్రంప్  ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుని తీరుతామని, ఈ విషయంలో తమను వ్యతిరేకించేవారెవరైనా సరే సహించేది లేదని ప్రపంచ దేశాలకు ట్రంప్ అల్టిమేటమ్ ఇచ్చారు.  అయితే టంప్ చేసిన ఈ వార్నింగ్ డెన్మార్క్ కు మాతర్మేనని పరిశీలకులు అంటున్నారు. ఎందుకంటే గ్రీన్ ల్యాండ్ ను ఆక్రిమించుకుంటామన్న ట్రంప్  తీరును డెన్మార్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.  డెన్మార్క్ ఎప్పటికీ తమ అధీనంలోని స్వతంత్రదేశాంగానే ఉంటుందని  డెన్మార్క్ అధ్యక్షుడు మెట్టె ఫ్రెడెరిక్సన్ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే ట్రంప్ వార్నింగ్ డెన్మార్క్ కేనని అంటున్నారు. 

స్పీకర్ అయ్యన్న పాత్రుడికి ఎన్టీఆర్ జీవన సాఫల్య పురస్కారం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి ఎన్డీఆర్ జీవన సాఫ్యల పురస్కారం దక్కింది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో  ఈ పురస్కారాన్ని శుక్రవారం (జనవరి 16) ప్రదానం చేశారు. అంతకు ముందు  నర్సీపట్నంలోని అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో    మకర జ్యోతి ఉత్సవాలు  శుక్రవారం (జనవరి 16) ముగిశాయి. ఈ సందర్భంగా పట్టణంలో నిర్వహించిన శోభాయాత్ర విశేషంగా ఆకట్టుకుంది. స్థానిక ఐదు రోడ్ల కూడలి నుంచి ప్రారంభమైన స్వామివారి రథోత్సవం కృష్ణ బజార్ , వేంకటేశ్వర స్వామి ఆలయం మీదుగా సాగింది.  ఈ సందర్భంగా వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీసమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభావేదికపై  స్పీకర్ అయ్యన్నపాత్రుడు కి  ఎన్టీఆర్ జీవన సాఫల్య పురస్కారం  ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. పరిషత్తు అధ్యక్షుడు, ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ ఈ అవార్డును అందజేశారు.   

పోక్సో కేసులో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై నాన్ బెయిలబుల్ వారెంట్

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై విజయవాడలోని పోక్సో కోర్టు  నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. గోరంట్ల మాధవ్ పై గతంలో పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే. అత్యాచారానికి గురైన బాలిక వివరాలను బహిర్గతం చేశారంటూ మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదుపై గోరంట్ల మాధవ్ పై పోక్సో కేసు నమోదైంది. ఈ కేసులో కోర్టు ఇప్పటికే పలుమార్లు నోటీసులు ఇచ్చినా గోరంట్ల మాధవ్ కోర్టుకు హాజరు కాకపోవడంతో ఇప్పుడు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఇలా ఉండగా తనపై జారీ అయిన నాన్ బెయిలబుల్ వారెంట్ ను రీకాల్ చేయాలని కోరుతూ గోరంట్ల మాధవ్ సోమవారం (జనవరి 19) కోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం.  

ఎక్స్ సేవలకు అంతరాయం

 ప్రముఖ సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' సేవలకు అంతరాయం కలిగింది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ యాజమాన్యంలో ఉన్న ఎక్స్ మరోసారి  మొరాయించింది. శుక్రవారం (జనవరి 16) సాయంత్రం  ఎక్స్ సేవలు నిలిచిపోవడంతో  ప్ర ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా ఎక్స్  సేవలు కొద్ది సేపు నిలిచిపోయాయి. కంటెంట్ డెలివరీ, భద్రతా సేవలు అందించే క్లౌడ్‌ఫ్లేర్ సంస్థలో తలెత్తిన సాంకేతిక సమస్యలే ఈ అంతరాయానికి కారణమై ఉండవచ్చని ప్రాథమిక సమాచారం. అయితే, ఈ అంతరాయంపై ఎక్స్ యాజమాన్యం గానీ, ఎలాన్ మస్క్ గానీ  అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇలా ఉండగా వారం వ్యవధిలో ఎక్స్ సేవలకు అంతరాయం కలగడం ఇది రెండో సారి.   

గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ కు ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం శంకుస్థాపన

ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం (జనవరి 17)  కాకినాడలో  పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా వారు  రాష్ట్ర పారిశ్రామిక రంగానికి దిక్సూచిగా చెబుతున్న ప్రతిష్ఠాత్మక  గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ కు శంకుస్థాపన చేస్తారు. గ్రీన్‌కో గ్రూప్‌కు చెందిన ఏఎం గ్రీన్ సంస్థ  13 వేల కోట్ల రూపాయల వ్యయంతో  ఈ ప్రాజెక్టును చేపడుతోంది. కాకినాడలో సుమారు 495 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంట్‌ను నిర్మించనున్నారు. ఏడాదికి  మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి సామర్థ్యంతో ప్రారంభం కానున్న ఈ పరిశ్రమను, భవిష్యత్తులో 1.5 మిలియన్ టన్నులకు పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు.   ఎటువంటి కర్బన ఉద్గారాలు లేకుండా అత్యాధునిక గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత సాంకేతికతతో ఇక్కడ ఇంధన ఉత్పత్తి జరుగుతుంది. పర్యావరణ హితంగా రూపుదిద్దుకుంటున్న ఈ భారీ ప్రాజెక్టు ద్వారా  ప్రత్యక్షంగా, పరోక్షంగా పాతిక  వందల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.   

ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చే వాహనాల దారి మళ్లింపు

సంక్రాంతి పండగను పురస్కరించుకుని ఆంధ్ర ప్రదేశ్ వెళ్లిన వారు తిరిగి వచ్చే క్రమంలో విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీ రద్దీ ఏర్పడింది. ఏపీ నుంచి    పండగ పూర్తి చేసుకొని   హైదరాబాద్ నగరానికి భారీగా వాహనాలు వస్తున్నాయి. శని, ఆది (జనవరి 17, 18) వారాలలో ఈ రద్దీ మరింత అధికంగా ఉంటుందన్న అంచనాలు ఓ పక్క,  జాతీయ రహదారిపై  పై చిట్యాల, పెద్ద కాపర్తి వద్ద ప్లై ఓవర్ నిర్మాణ పనులు మరో పక్క ఉండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే  నల్గొండ జిల్లా పోలీసు శాఖ ట్రాఫిక్ మళ్లింపు చేపట్టింది. ఈ మేరకు నల్గొండ జిల్లా ఎస్పీ ట్రాఫిక్ మళ్లింపు వివరాలను ప్రకటించారు.  గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు గుంటూరు, మిర్యాలగూడ, హాలియా, కొండమల్లేపల్లి, చింతపల్లి, మాల్ మీదుగా హైదరాబాద్ కు వెళ్లాల్సి ఉంటుంది. ఇక మాచర్ల నుంచి హైదరాబాద్ వచ్చే వాహనాలను  మాచర్ల నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు  మాచర్ల , నాగార్జునసాగర్ , పెద్దవూర , కొండపల్లేపల్లి, చింతపల్లి, మాల్ మీదుగా హైదరాబాద్ చేరుకునేలా ట్రాఫిక్ ను మళ్లిస్తారు.  అదే విధంగా నల్లగొండ నుంచి  హైదరాబాద్   వెళ్లే వాహనాలను నల్లగొండ , మార్రిగూడ బై పాస్ , మునుగోడు, నారా యణపూర్, చౌటుప్పల్  మీదుగా హైదరాబాద్ కు చేరుకోవలసి ఉంటుంది.  ఇక విజయవాడ నుంచివి  హైదరాబాద్ వెళ్లే వాహనాలను కోదాడ, హుజూర్ నగర్, మిర్యాలగూడ, హాలియా, చింతపల్లి, మాల్ మీదుగా హైదరాబాద్ కు మళ్లిస్తారు.  

చదువు ఒక్కటే పేదిరికాన్ని పోగొడుతుంది : సీఎం రేవంత్‌

  మాదాపూర్ శిల్పకళా వేదికలో కొలువుల పండుగ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. గ్రూప్-3లో అర్హత సాధించిన వారికి ముఖ్యమంత్రి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతు తాము రెండేళ్లలో 70 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని సీఎం తెలిపారు. ప్ర‌భుత్వ టీచ‌ర్లు, గ్రూప్ 1,2,3 వంటి ఉద్యోగాల‌ను ఒక బాధ్య‌త‌తో ఎలాంటి త‌ప్పులు లేకుండా భ‌ర్తీ చేశామని రేవంత్‌రెడ్డి వెల్లడించారు.  గ‌త బీఆర్‌ఎస్ ప్ర‌భుత్వం ప‌రీక్ష‌ల‌ను స‌రిగా నిర్వ‌హించ‌లేదు.. ప్ర‌శ్నా ప‌త్రాల‌ను ప‌ల్లీ బ‌ఠానీల్లా అమ్మితే వారికి చీమ‌కుట్టిన‌ట్లైనా లేదని తెలిపారు. టీజీపీఎస్సీ ని స‌మూలంగా ప్ర‌క్షాళ‌న చేశాం....యూపీఎస్సీ ని స్వ‌యంగా ప‌రిశీలించి టీజీపీఎస్సీ ని ఏర్పాటు చేశామని సీఎం స్ఫష్టం చేశారు. నియామ‌క‌ప‌త్రాలు ఇవ్వొద్ద‌ని కుట్ర‌లు చేసినా కోర్టుల ముందు కొట్లాడి భ‌ర్తీ చేశామన్నారు.  ఎల్బీ స్టేడియం, శిల్పారామం, సాగునీటి పారుదల శాఖ కార్యాల‌యం, అంబేద్క‌ర్ విగ్ర‌హం సాక్షి గా నియామ‌క ప‌త్రాల‌ను అంద‌జేశామని ఆయన తెలిపారు. తెలంగాణ నిరుద్యోగుల ప‌ట్ల గ‌త ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించింది.. పుట్టిన బిడ్డ ప్ర‌యోజ‌కుడు అయితే త‌ల్లిదండ్రుల ఆనందం అంతా ఇంతా కాదని.. కూలీ ప‌ని చేసి మ‌రీ త‌ల్లిదండ్రులు చ‌ద‌వించి పోటీ ప‌రీక్ష‌ల‌కు త‌యారు చేశారని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఉస్మానియా, కాక‌తీయ యూనివ‌ర్సిటీల్లో విద్యార్థులు ఉద్య‌మ‌కారుల‌య్యారు. విద్యార్థులు అవ‌స‌ర‌మైన సంద‌ర్భంలో ప్రాణ‌త్యాగాలు చేసి తెలంగాణ‌ను సాధించారని చెప్పారు. 10 ఏళ్ల‌లో రెండు సార్లు సీఎం అయిన వ్య‌క్తులు రాజ‌కీయ‌, కుటుంబ‌, పార్టీ ప్ర‌యోజనాల కోస‌మే ప‌నిచేశారు. ప్ర‌భుత్వ ఉద్యోగాల భ‌ర్తీ పైన ఆలోచ‌న చేయ‌లేదని విమర్శించారు. విద్య ఒక్క‌టే జీవితాల్లో మార్పు, వెలుగులు తీసుకువ‌స్తుంది.. పేద‌ల మోహంలో త‌ల్లిదండ్రుల‌ను చూసుకుని  ప్ర‌భుత్వ ఉద్యోగులు సేవలు ల‌క్ష్యంగా అందించాలని సీఎం రేవంత్ తెలిపారు.

మంగళగిరి ప్రీమియర్ లీగ్‌లో సందడి చేసిన మంత్రి లోకేష్

  తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరి బైపాస్ రోడ్డులోని నారా లోకేష్ క్రీడా ప్రాంగణం(బోగి ఎస్టేట్స్)లో  నిర్వహిస్తున్న మంగళగిరి ప్రీమియర్ లీగ్ సీజన్-4 క్రికెట్ పోటీల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సందడి చేశారు. ముందుగా బోగి ఎస్టేట్స్ కు చేరుకున్న మంత్రి లోకేష్ కు స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎంపీఎల్-4లో భాగంగా 27వ రోజు, మూడో రౌండ్ ఆఖరి మ్యాచ్ లో వల్లభనేని వెంకట్రావ్ యూత్, విక్కీ 11 జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు.  ఈ సందర్భంగా మంత్రి లోకేష్ టాస్ వేశారు. కొద్దిసేపు క్రికెట్ ఆడి క్రీడాకారులను మంత్రి ఉత్సాహపరిచారు. వల్లభనేని వెంకట్రావ్ యూత్ జట్టు టాస్ నెగ్గి బ్యాటింగ్ ను ఎంచుకుంది. అనంతరం ఇరు జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ ను మంత్రి లోకేష్ వీక్షించారు. అనంతరం అందరితో కలిసి ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్‌ నందం అబద్దయ్య,  ఏపీఎంఎస్ఐడీసీ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావుతో పాటు పలువురు స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పెద్దఎత్తున స్థానిక ప్రజానీకం పాల్గొన్నారు.