తెలంగాణ మునిసి‘పోల్స్’ షెడ్యూల్ ఎప్పుడో తెలుసా?
తెలంగాణలో మునిసిల్ ఎన్నికలకు రేవంత్ సర్కార్ దాదాపుగా ముహూర్తం ఖరారు చేసింది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా పరిషత్, జడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలు ఇప్పట్ల కాదని విస్పష్టంగా చెప్పేశారు. మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల తరువాత జడ్పీఎన్నికలు ఉంటాయని కుండబద్దలు కొట్టేశారు. ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికల్లో లభించిన విజయానికి కొనసాగింపు సాధ్యమైనంత త్వరగా మునిసిపోల్స్ నిర్వహించేయాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది. పరిషత్ ఎన్నికల కంటే ముందే ముమునిసిపోల్స్ పూర్తి చేయడానికి రేవంత్ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అదే సమయంలో ఎన్నికల ఏర్పాట్లను కూడా వేగవంవంతం చేసింది.
ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటరు జాబితాల తయారీ , ప్రచురణకు సంబంధించి షెడ్యూల్‌ను విడుదల చేసింది. కొత్తగా ఖరారు చేసిన వార్డుల ప్రకారం ఓటర్ల జాబితాలను జనవరి పదో తేదీలోపు ఖరారు చేసి ప్రకటించేదిశగా అడుగులు వేస్తున్నది. పాలక వర్గాల పదవీ కాలం ముగిసిన మునిసిపాలిటీలు, కార్పొరేషన్ లలో వార్డుల వారీగా ఓటరు జాబితాలను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ అధికారులను ఆదేశించింది. అసెంబ్లీ నియోజకవర్గాల ఓటరు జాబితా ఆధారంగా ఈ విభజన ప్రక్రియ కొనసాగనుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ, అభ్యంతరాల స్వీకరణ ,తుది జాబితా ప్రచురణ జనవరి పదో తేదీకి పూర్తి కానున్నది.
ముందుగా ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించి, స్థానిక ప్రజల నుంచి సలహాలు, సూచనలు ,అభ్యంతరాలను స్వీకరిచిన తరువాత, మార్పులు చేర్పులు చేసి నిర్దేశిత గడువులోగా తుది ఓటరు జాబితాను వార్డుల వారీగా ప్రదర్శిస్తారు. వార్డుల విభజన , రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ కూడా దీనికి సమాంతరంగా సాగుతోంది. ముఖ్యంగా పెరిగిన జనాభాకు అనుగుణంగా వార్డుల పునర్విభజన చేపట్టి, ఆ తర్వాతే ఓటర్లను ఆయా వార్డులకు కేటాయించనున్నారు. ఇక పాత విధానంలోనే రిజర్వేషన్ల అమలు ఉండనుంది.