గాజువాకలో గుడ్డు మంత్రికి ఎదురీతే!?
posted on Mar 18, 2024 @ 3:20PM
గాజువాక నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో జోష్ కనిపిస్తున్నది. ఎప్పుడైతే జనసేనాని పవన్ కల్యాణ్ గాజువాక నుంచి పోటీ చేయరని తేలిపోయిందో.. ఆ క్షణం నుంచీ తెలుగుదేశం పార్టీ గాజువాక సీటును తమ ఖాతాలో వేసేసుకుంది. కచ్చితంగా గెలిచే స్థానాలలో గాజువాక మొదటి వరుసలో ఉంటుందని తెలుగుదేశం శ్రేణులు ఢంకా బజాయించి చెబుతున్నాయి.
2019 ఎన్నికలలో ఈ స్థానం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలైన పల్లా శ్రీనివాసరావు, గత ఐదేళ్లుగా నియోజకవర్గ సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తూ నియోజకవర్గ ప్రజల తలలో నాలుకగా మారారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా వెనుకడుగు వేయకుండా పార్టీ క్యాడర్ కు అండగా నిలిచారు. నియోజకవర్గ సమస్యలపైనే కాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వంటి అంశాలకు వ్యతిరేకంగా క్రియాశీలంగా వ్యవహరించారు. ఆందోళనా కార్యక్రమాలకు నాయకత్వం వహించారు. దీంతో నియోజకవర్గ ప్రజలలో ఆయన పట్ల సానుకూలత వ్యక్తం అవుతోంది. నియోజకవర్గ సమస్యలపై పల్లా శ్రీనివాసరావు పోరాటాలు, నియోజకవర్గ ప్రజలకు ఆయన అండగా నిలిచిన తీరు ప్రజలలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చాయి. ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆయన గళమెత్తిన తీరు నియోజకవర్గ ఓటర్లకు ఆయనను దగ్గర చేసింది. మరీ ముఖ్యంగా నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు ఆయన తిరుగులేని నేతగా మారారు.
అందుకు భిన్నంగా అధికార పార్టీ వైసీపీ గాజువాకలో తీవ్ర విభేదాలు ఉన్నాయి. అంతర్గత విభేదాల కారణంగా వైసీపీలో గ్రూపుల పోరు తీవ్రస్థాయిలో ఉంది. మరీ ముఖ్యంగా నియోజవకర్గం నుంచి వైసీపీ అభ్యర్థి విషయంలో పలు మార్పులు, చేర్పులూ జరిగాయి. అలా జరిగిన ప్రతి సారీ పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి పీక్స్ కి వెళ్లింది. తొలుత గాజువాక వైసీపీ అభ్యర్థిగా వి. రామచంద్రరావు అలియాస్ చందును జగన్ నిర్ణయించారు. ఆయన అభ్యర్థిత్వానికి వ్యతిరేకంగా నియోజకవర్గ వైసీపీలో పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తమైంది. అసంతృప్తులను బుజ్జగించుకుని చందు నియోజకవర్గంతో తన ప్రచారం ప్రారంభించారో లేదో అంతలోనూ చందూను కాదని జగన్ మంత్రి అమర్నాథ్ ను అభ్యర్థిగా ప్రకటించారు.
అయితే మంత్రి అమర్నాథ్ అభ్యర్థిత్వం పట్ల నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. నియోజకవర్గానికి చెందిన పలువురు వైసీపీ కీలక నేతలు అమర్నాథ్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. అమర్నాథ్ కు సహకరించే ప్రశ్నే లేదని తెగేసి చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో గాజువాక నుంచి అమర్నాథ్ విజయం నల్లేరు మీద బండి నడక ఎంత మాత్రం కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో గాజువాక నుంచి తెలుగుదేశం విజయం పక్కా అని విశ్లేషిస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం ఎలా అయితే చంద్రబాబుకు కంచుకోటగా ఉందో గాజువాక కూడా అలాగే తెలుగుదేశం కంచుకోట అని పార్టీ శ్రేణులు ధీమాగా ఉన్నాయి.