గద్దె రామ్మోహన్ వర్సెస్ కేశినేని నాని
posted on May 23, 2013 @ 10:35AM
విజయవాడ లోక్ సభ టికెట్ ను దక్కించుకునేందుకు తెలుగుదేశం పార్టీలో పోరు రాజుకుంది. ప్రజారాజ్యం నుండి టీడీపీలో చేరిన ట్రావెల్స్ అధినేత కేశినేని నానికి టికెట్ ఇస్తారన్న అనుమానంతో మాజీ ఎంపీ గద్దె రామ్మోహన్ రావు టికెట్ కోసం స్వరం పెంచారు. దీంతో విజయవాడ టీడీపీలో కొత్త పోరు మొదలయింది. మొన్నటిదాకా వల్లభనేని వంశీ – దేవినేని ఉమామహేశ్వరరావు పంచాయితీ, తరువాత కొడాలి నాని పంచాయితి నెలకొంది. అవి సద్దు మణిగాక ఇప్పుడు గద్దె పంచాయితీ ప్రారంభమయింది. “రాజకీయాల్లో డబ్బు ప్రధానం. అయితే డబ్బే రాజకీయం కాదు. ఎప్పటి నుండో పార్టీలో ఉండి డబ్బులు ఖర్చు పెడుతున్నాం. ఇప్పుడు వచ్చినవారు డబ్బులు పెడతారని టికెట్ ఇస్తే ఇన్నాళ్లు ఖర్చుపెట్టిన వారి పరిస్థితి ఏంటి ? అని ఆయన చంద్రబాబును ఉద్దేశించి ప్రశ్నించారు. ఎంపీ సీటు కావాలనడం నా డిమాండ్. డబ్బులు ఖర్చుపెట్టమంటే మేమూ పెడతాం అని ఆయన అన్నారు. విజయవాడ ఎంపీ సీటు విషయంలో నాని – గద్దెల మధ్య ఇప్పుడు తీవ్రపోటీ నెలకొంది.