గడల శ్రీనివాసరావు రూటే సెపరేటు.. పార్టీ ఏదని కాదు.. పోటీ చేశానా లేదా అనేదే ముఖ్యం!
posted on Feb 5, 2024 @ 1:53PM
తెలంగాణ ప్రజారోగ్య శాఖ మాజీ డైరెక్రర్ డాక్టర్ గడల శ్రీనివాస్ రావు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్పిన అవసరం లేదు. బాధ్యత గలిగిన పదవిలో ఉండి ఆయన చేసిన విన్యాసాలు అందిరీ తెలిసినవే. రాజకీయాల్లో ప్రవేశించి పాపులర్ అయిపోవాలన్న తహతహతో.. ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ గా తన హోదాను, బాధ్యతనూ మరికి ఫక్తు బీఆర్ఎస్ కార్యకర్తగా ఆయన వ్యవహరించిన తీరు అప్పట్లో పత్రికల్లో పతాక శీర్షికల్లో ప్రముఖంగా వచ్చింది. బీఆర్‌ఎస్ అభ్యర్థిగా కొత్తగూడెం శాసనసభ సీటు ఆశించి ఆయన భంగపడ్డారన్న సంగతి బహిరంగ రహస్యమే. ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ గా ఆయన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్లు మొక్కి వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్న సంగతి కూడా తెలిసిందే. ఇక కరోనాకు మందులు, వ్యాక్సిన్ల అవసరం లేదనీ, ఏసుక్రీస్తును నమ్ముకుంటే చాలనీ ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లె పెను సంచలనం సృష్టించాయి. వివాదంగా మారింది.
వాస్తవానికి హెల్త్ డైరెక్టర్ గా ఆయన ఉన్నంత కాలం వివాదాలు ఆయన వెంట పడతాయో.. వివాదాల వెంట ఆయన పడతారా అన్నట్లుగా ఆయన వ్యవహార తీరు ఉండేది. శ్రీనివాస్ రావు ఏసుక్రీస్తు దయతోనే దేశంలో కరోనా కేసులు తగ్గాయనీ, కరోనా నుంచి విముక్తి చెందామనీ ఆయన చేసిన వ్యాఖ్యలు, అంతటితో ఊరుకోకుండా.. క్రైస్తవం వల్లే దేశం అభివృద్ధి చెందిందంటూ చేసిన ఉద్బోధ ఎంత వివాదాస్పదమయ్యాయో తెలిసిందే. ఆఫ్కోర్స్ అది ఆయన వ్యక్తి గత విశ్వాసం కావచ్చు. కానీ, ఆయన ఒక అధికారిగా ఉండి చేసిన వ్యాఖ్య అలాగే క్రైస్తవ మత ప్రచారానికి నడుంబిగించాలంటూ ఇచ్చిన పిలుపుపై పెద్ద ఎత్తున విమర్శలూ వచ్చాయి. అలాగే అంతకు ముందు ఆయన బహిరంగంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్లు మొక్కి, వివాదాస్పద అధికారిగా పతాక శీర్షికలకు ఎక్కారు. అలా కాళ్లు మొక్కడంపై వచ్చిన విమర్శలకు ఆయన కేసీఆర్ తన తండ్రిలాంటి వారు, ఆయన కాళ్లు మొక్కడం తప్పెలా అవుతుందంటూ సమర్ధించుకున్నారు. ఆ వెంటనే ఎన్నికల ముందు రాష్ట్రంలో ఆదర్శవంతమైన ఎమ్మెల్యే అంటూ ఎవరైనా ఉంటే అది మంత్రి హరీష్ రావేనని మరో వివాదాస్పద వ్యాఖ్య చేశారు. దీంతో ప్రభుత్వోద్యోగా, బీఆర్ఎస్ కార్యకర్తా అంటూ అప్పట్లో సామాజిక మాధ్యమంలో నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేశారు. అయితే అప్పట్లో ఆయన కొత్త గూడెం నుంచి ఎన్నికల బరిలో దిగాలన్న ఆకాంక్షతో అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ తో అంటకాగి అప్రతిష్ట పాలయ్యారు.
రాష్ట్రంలో ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం రాగానే ఆయనకు స్థాన భ్రంశం కలిగింది అది వేరే విషయం. అటువంటి డాక్టర్ గడల శ్రీనివాస్ రావు.. తాజాగా తనకు ఖమ్మం లేదా సికిందరాబాద్ లోక్ సభ స్థానం కేటాయించాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఆయన పోటీ చేస్తానని చేసుకున్న దరఖాస్తు బీఆర్ఎస్ పార్టీకి కాదు. తన తండ్రి వంటి వారు అని చెప్పుకున్న కేసీఆర్ గద్దె దిగగానే గడల శ్రీనివాసరావుకు ఆయన చేదైపోయారు. అందుకే ఇప్పుడు ఆయన కాంగ్రెస్ కు దగ్గరవ్వడానికి తన వంతు ప్రయత్నాలు ప్రారంభించేశారు. ఎన్నికలలో పోటీకి అవకాశం ఇవ్వాలంటూ కాంగ్రెఃస్ పార్టీకి తన దరఖాస్తును అనుచరుల ద్వారా పంపించారు. అయితే ఇక్కడా ఆయన ఆశలు నెరవేరే అవకాశాలు ఇసుమంతైనా కనిపించడం లేదు. ఎందుకంటే ఆయన ఖమ్మం లేదా వరంగల్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని కోరుకుంటున్నారు. ఆ రెండింటిలో ఖమ్మం ఎంపీ స్థానం కోసం కాంగ్రెస్ లో చాలా చాలా గట్టి పోటీ ఉంది. ఆ స్థానం నుచి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని, సీనియర్ నాయకుడు వీహెచ్, మాజీ ఎంపీ రేణుకా చౌదరి రేసులో ఉన్నారు. వారు ముగ్గురినీ కాదని కాంగ్రెస్ ఈయనకు టికెట్ ఇవ్వడం దాదాపు అసాధ్యం. అయినా సర్వీసులో ఉంటూ అప్పటి అధికార బీఆర్ఎస్ తో అంటకాగడంతో అప్పట్లో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నశ్రీనివాసరావు ప్రస్తుతం సెలవులో ఉన్నారు. సెలవులో ఉన్న ఆయన ఇటీవల ఒక మీడియా సంస్థతో మాట్లాడారు. . తాను ప్రజాజీవితంలో ఉండాలని ఎల్లవేళలా కోరుకున్నానని, అందువల్ల ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించానని, కానీ గత ప్రభుత్వం తనకు అవకాశం ఇవ్వలేదన్నారు. ఈసారి కాంగ్రెస్ టికెట్ లభిస్తే ప్రజలకు సేవ చేస్తానని ఆయన అన్నారు. తనకు కాంగ్రెస్ టికెట్ లభిస్తే ఉద్యోగానికి రాజీనామా చేస్తాననీ లేకపోతే తిరిగి ఉద్యోగంలో చేరిపోతాననీ పాపం ఏ బేషజం లేకుండా చెప్పేసుకున్నారు.