వేసవి కాలంలో ఈ మూడు పండ్లు తప్పక తినాలి!

వేసవి కాలం అంటేనే భయం వేస్తుంది.  మనుషుల్ని ఎంతగా హింసించాలో అంతా హింసిస్తుంది ఈ వేసవి. ఉక్కపోత, వడదెబ్బ, అధిక వేడి, శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం. ఇలా చాలానే ఉంటాయి. వీటి వల్ల ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఇలాంటప్పుడు చల్లగా ఏమైనా తినాలని అనిపిస్తుంది. శరీర అలసట తగ్గి సేదతీరాలని అనిపిస్తుంది. దీనికోసం ఈ వేసవిలో లభ్యమయ్యే పండ్లు చక్కని ఆప్షన్. అధిక ధర లేకుండా అందుబాటులో ఉండే మూడు రకాల పండ్లను తెచ్చుకుంటే వేసవి తాపం అనే మాటే ఉండదు. ఓ కూల్డ్రింక్ బాటల్ కొనే బదులు ఈ పండ్లు కొన్నారంటే గొప్ప ఆరోగ్యమే కాదు, వేసవిని తరిమి కొట్టవచ్చు.. 

వేసవిలో, శరీరం చాలా త్వరగా డీహైడ్రేట్ అవుతుంది. దీని వల్ల శరీరంలో శక్తి స్థాయి గణనీయంగా పడిపోతుంది. శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే పండ్లు, అందరికీ అందుబాటులో ఉండే పండ్లు ఇవే..

పుచ్చకాయ

పుచ్చకాయను పిచ్చిగా ఇష్టపడేవారు ఉన్నారు. అధికశాతం నీటితో నిండిన ఈ పండు వేసవిలో ఎంతో మంది ఫెవరేట్ లిస్ట్ లో మొదటి స్థానంలో ఉంటుంది. పుచ్చకాయలు ఆరోగ్యకరమైనవి మాత్రమే కాదు చవగ్గానే దొరుకుతాయి.  ఉందులో విటమిన్ ఎ, మరియు సి పుష్కలంగా ఉంటాయి.  విటమిన్ ఎ రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది, కళ్లకు మేలు చేస్తుంది. ఇక విటమిన్ సి రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. విటమిన్ B6, పొటాషియం పుచ్చకాయలో అధికంగా ఉంటాయి. విటమిన్ B6 రోగనిరోధక శక్తిని ప్రోత్సహిస్తుంది, పొటాషియం శరీరంలో నీటిశాతం తగ్గకుండా చేస్తూంది. గుండెను ఆరోగ్యంగా ఉంచడమే కాక కండరాల తిమ్మిరిని కూడా నివారిస్తుంది.

మామిడికాయలు

వేసవి అంటేనే మామిడి పండ్లు గుర్తొస్తాయి. మామిడి పండ్లలో అధిక క్యాలరీలు ఉన్నప్పటికీ పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. పండ్లలో రారాజు అని పిలిచే మామిడిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అది మాత్రమే కాదు మామిడిలో 20కి పైగా ఖనిజాలు, విటమిన్లు ఉంటాయి. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఆకలిని నియంత్రించి కడుపు నిండుగా ఉంచుతుంది. మామిడిలో విటమిన్ ఎ, సి, పొటాషియం పుష్కలంగా ఉన్నాయి. మామిడిపండ్లు బోలెడు వ్యాధులను దూరం చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచదంలోనూ.. జలుబు ఫ్లూ వంటి జబ్బులను నివారించడంలోనూ సహాయపడతాయి. విటమిన్ సి ఎక్కువగా ఉన్న పండ్లు చర్మానికి కూడా మేలు చేస్తాయి.

నారింజ..

నారింజలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది,  అంతేకాదు పొటాషియం మినరల్స్ కూడా ఉంటాయి, ఇవి కండరాల నొప్పిని తిమ్మిరిని తగ్గించడంలో సహాయపడతాయి. నారింజ బలమైన రోగనిరోధక శక్తిని కలిగిస్తుంది. అంటు వ్యాధులతో పోరాడేలా శరీర సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది.

వేసవిలో చెమట ఎక్కువగా పడుతుంది. ఈ కారణంగా చెమట ద్వారా పొటాషియం  ఎక్కువ కోల్పోతాము. దీని ఫలితంగా కండరాల తిమ్మిరి, లేదా కండరాల పనితీరు దెబ్బతినడం జరుగుతుంది.  నారింజలో పొటాషియం అధికంగా ఉంటుంది కాబట్టి కండరాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ముఖ్యంగా వేసవి కాలంలో నారింజ తీసుకోవడం ఉత్తమం. నారింజలో 80% నీరు ఉంటుంది, ఇది శరీరానికి పోషణను అందిస్తూ ఆర్ద్రీకరణకు సహాయపడుతుంది. బయటికి వెళ్లేటప్పుడు నారింజ పండ్లను వెంట ఉంచుకుంటే మరీ మంచిది.  మామిడి, పుచ్చకాయతో పోలిస్తే వీటిని తీసుకెళ్లడం, తినడం కూడా పెద్ద పనికాదు. 

                                  ◆నిశ్శబ్ద.