పండ్ల రసాలు తాగేటప్పుడు ఈ విషయాలు తెలుసుకోకపోతే నష్టపోతారు..!
posted on Dec 7, 2024 @ 9:30AM
పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివని చెబుతారు. ముఖ్యంగా ఆరోగ్యం బాగాలేనప్పుడు పండ్లు లేదా పండ్ల రసం ఇస్తుంటే చాలా తొందరగా కోలుకుంటారనే విషయం అందరికీ తెలిసిందే. మంచి ఆరోగ్యం కోసం పండ్లు, పండ్ల రసాలు తీసుకోమని వైద్యులు కూడా చెబుతారు. చాలా మంది పండ్ల రసాలు తాగాలని అనిపిస్తే సింపుల్ గా ఫ్రూట్ జ్యూస్ షాప్ కు వెళ్లి తాగేస్తుంటారు. మరికొందరు ఓపికగా ఇంట్లోనే జ్యూస్ చేసుకుంటారు. అయితే జ్యూస్ తాగే ప్రతి ఒక్కరూ కొన్ని విషయాలు తెలుసుకోవాలి.
పండ్ల రసం చాలా వరకు బయట తాగడం చాలామంది అలవాటు. అయితే పండ్ల రసం తాగే దుకాణం శుభ్రతగా ఉందా లేదా గమనించాలి. శుభ్రత లేని చోట పండ్ల రసాలు తాగితే అది అనారోగ్యానికి కారణం అవుతుంది. కేవలం ఆ దుకాణం మాత్రమే కాదు.. చుట్టు ప్రక్కల పరిసరాలు కూడా శుభ్రతగా లేకుంటే ఆ దుకాణాలలో జ్యూస్ లు తాగడం మంచిది కాదు.
జ్యూస్ తాగేముందు అక్కడే అప్పటికప్పుడు తాజాగా తయారు చేసిన జ్యూస్ ను మాత్రమే తాగడం మంచిది. ముందే జ్యూస్ జార్ లేదా గిన్నెలలో నిల్వ ఉంచిన జ్యూస్ ను అస్సలు తాగకూడదు. అలాంటి జ్యూస్ లో బ్యాక్టీరియా పెరుగుతుంది. అందుకే ఎప్పుడూ తాజా పండ్ల జ్యూస్ ను మాత్రమే రికమెండ్ చేయాలి.
పండ్ల జ్యూస్ లు అమ్మే షాపులలో కొన్నిసార్లు ముందే పండ్లను కట్ చేసి ఉంటారు. అలాంటి పండ్ల నుండి జ్యూస్ ను తయారు చేయించుకోకూడదు. తాజాగా కట్ చేసిన పండ్ల నుండే జ్యూస్ ను చేయించుకోవాలి. ముందే కట్ చేసిన పండ్లలో కొన్ని సార్లు చెడి పోయిన పండ్లను కొంత భాగం కట్ చేసి పెట్టుకుని ఉంటారు. ఇది బ్యాక్టీరియాను కలిగి ఉంటుంది.
పండ్ల రసం తయారు చేసేవారు జ్యూస్ మరింత రుచిగా, తాజాగా ఉండటం కోసం జ్యూస్ లో ఏదైనా రసాయనాలు లేదా పౌడర్ లేదా లిక్విడ్స్ మిక్స్ చేస్తుంటారు. కొన్నిసార్లు రంగు కూడా జోడిస్తూ ఉంటారు. అలాంటి చోట జ్యూస్ అస్సలు తాగకూడదు.
వాడిపోయిన, పాతబడిన కాయలతో ఫ్రూట్ జ్యూస్ లు తయారు చేసి అమ్ముతుంటారు. అలాంటివి నివారించాలి. వీటిలో నీటి శాతం ఏమీ ఉండదు. పై పెచ్చు కార్బోహేడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. వీటిలో పోషకాలు ఏమీ ఉండవు. ఇవి ఆరోగ్యానికి కూడా మంచివి కావు.
*రూపశ్రీ.