ఇంతై ..ఇంతింతై..కేసీఆర్ ప్రధాని 369!
posted on Oct 9, 2022 @ 10:56AM
చిన్న మేడ ఇంట్లో మేడెక్కి కొండని చూసి అక్కడున్న ఇల్లు కోరుకున్నాడు చిన్నెంకడు, మాయాదర్పంలో సావిత్రికి నాగేశ్రావు ఆపడ్డాడు, కొండెక్కిన సైనికుడికి ఆకాశం కనిపించింది, చిరూకి విలన్ కనిపించాడు.. తన నివాసంలో పేద్ద కుర్చీలో కూర్చున్న బీఆర్ ఎస్ అధినేతకు కిటికీలోంచే ధిల్లీ కుర్సీ అగుపడింది.. అంతే ఒక్క ఉదుటన లేచి అమాంతం అద్దం ముందు నుంచున్నారు.. అమాంతం భవిష్యత్ దర్శనమయింది..తాను ప్రధాని, తనవాళ్లంతా అన్ని రాష్ట్రాల్లోనూ చక్కం తిప్పేయగల సీఎంలు, ఐఏఎస్‌లూ అయి దర్శనమిచ్చారు!
లక్ష్యం మంచిదేరా అబ్బాయ్.. కాకుంటే లక్షణంగా ఉన్నోడివి కోరి కష్టాలెందుకు అంటుంది పెద్దవ్వ. కల లక్ష్యంగా మారింతర్వాత కేసీఆర్ కుర్చీకే అంటిపెట్టుకుంటారా? ఎన్నాళ్లీ కుర్చీలో కూర్చుంటాం..కొడితే కుంభస్థలాన్నే కొట్టాలన్న డైలాగ్ ఆయ మనసు ను మరింత గిల్లింది. రాష్ట్రాన్ని ఆల్‌రెడీ లైట్‌గా తీసుకున్నందువల్ల కాళ్లకు బల పాలు వదిలేసి ఏకంగా చక్రాలు కట్టేసుకుని సూప ర్ ఫాస్ట ఎక్స్‌ప్రెస్ మించి వేగంగా పరుగుపెట్టడం ఆరంభించారు. ఈ వేగంలో టీడీపీ చంద్రబాబు, లోకేష్, బీజేపీ బండి, ఈటెల, కాంగ్రెస్ భట్టి,రేవంత్ అంతా వెనక్కి పరిగెడుతున్నట్టే కనపడుతున్నారు. సుదూరం నుంచి ఆదిలో ఆయన ప్రేమించిన ఎన్టీఆర్ పాటే.. ముందులే మంచి కాలం.. వినపడుతోంది. ఇక ఎవర్ని పట్టించుకుంటారు బీఆర్ ఎస్ అధినేతగా కేసీఆర్. ఇపుడు రాష్ట్ర ప్రజలకు ఆసలా మాటకు వస్తే యావత్ తెలుగు ప్రజలకు ప్రధాని 369 సినిమా చూపాలన్నదే ఆయన తాపత్రయం.ఆయన కాల యంత్రం మీటరేసింది ఇప్పుడే అనిపించారు. కానీ అది స్టార్ట్ అయి శానా కాలమైంది! కాకుంటే ఆయన భవిష్యద్దర్శిని ఏకంగా అంతర్జాతీయ నాయకులనే భయపెట్టేంతగా ఆయన రూపు, పార్టీ పతాకం వైశాల్యం పెంచి చూపింది!
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర సమతి(టీఆర్ఎస్)ని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చేశారు. తెలంగాణ మోడల్ ను దేశమంతటా విస్తరించడమే లక్ష్యంగా ప్రకటించేశారు. కేసీఆర్ భరాసపై సామాజిక మాధ్య మంలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతోంది. బీఆర్ఎస్ తరువాత ఆయన లక్ష్యం ప్రపంచ రాష్ట్ర సమితి (డబ్ల్యుఆర్ఎస్) అంటూ ఓ నెటిజన్ వ్యంగ్యాస్త్రం సంధించాడు. భవిష్యదర్శిని అంటూ 2030 నాటికి కేసీఆర్ డబ్ల్యుఆర్ఎస్ ప్రకటన వేడుకగా జరుగుతుం దంటూ సెటైర్లు గుప్పించాడు.
ఈరోజున ప్రపంచం అంతా గొప్ప హడావుడిగా ఉంది. ఈరోజు ఉదయమే భారత రాష్ట్ర సమితి పార్టీ ఒక గొప్ప తీర్మానం చేసింది. భారత ప్రధాని మరియు భారాస సిధ్ధాంత కర్త కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి ఆలోచన ప్రకారం బీఆర్ ఎస్ పార్టీని అంతర్జాతీ య రాజకీయ పార్టీగా మార్చటం జరిగింది. ఈమేరకు భారాస సర్వసభ్యసమావేశంలో నిర్ణయించారు. హైదరాబాద్ నగరంలోని ప్రధానమంత్రి నివాసం ప్రగతి భవన్లో బ్లహ్మాండమైన భారాస సర్వసభ్యసమావేశం జరిగింది. సభాద్య క్షులు చంద్రశేఖర రావు గారు అద్భుతమైన ప్రారంభోపన్యాసం చేసారు. ప్రపంచపరిస్థితులు ఏమీ బాగోలేవు. అస్తమానం ఏవేవో దేశాలు గిల్లికజ్జాలతో ప్రపంచశాంతిని భంగపరుస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసారు.
ఇలా ఐతే ప్రపంచం త్వరలోనే నాశనం అవుతుంది. అమెరికా చైనా రష్యా లాంటి పెద్దదేశాలూ బుధ్ధిలేకుండా ప్రవర్తించటం ఏమి టని ఆ దేశాలను చంద్రశేఖర రావు గారు నిలదీశారు. యుధ్ధాలను నివారించవలసిన ఐక్యరాజ్య సమితి ఆచరణలో సంపూర్ణం గా విఫలం ఐనదని అది ఇంక కాలంచేసిందని నేనే ప్రకటిస్తున్నాను అన్నారు. బాగా ఆలోచించి తాను ఒక మంచి నిర్ణయం తీసు కున్నాననీ దాని ప్రకారం భారాసను అంతర్జాతీయ పార్టీగా మార్చటం యావ త్తు ప్రపంచానికీ అతిముఖ్యమైన అవసరం ఆనీ అన్నారు.
భారాస ఏర్పాటు చేసినప్పుడు కూడా ఎందరో ఏవేవే అన్నారనీ తుదకు భారాస ద్వారానే ఆంధ్రప్రదేశ్ తెలంగాణా మధ్యన,అలాగే చాలా రాష్ట్రాల మధ్య వివాదాలూ సానుకూలంగా పరిష్కరించబడ్డాయనీ అదేవిధంగా ప్రరాస ద్వారా దేశాల మధ్య వివాదాలు కూడా బ్రహ్మాండంగా పరిష్కారం చేసెయ్యవచ్చును అనీ ఆసత్తా తమ సొత్తు ఆనీ అన్నారు. క్రమంగా అన్ని ముఖ్యదేశాలలోనూ మన పార్టీని అధికారంలో నిలబెట్టటం ద్వారా యుధ్ధాలను నివారించి ప్రపంచంలో శాంతినీ సుస్థిరతనూ నెలకొల్పవచ్చు అనీ చంద్రశేఖర రావు గారు వక్కాణించారు.అందుకే ఇక ఆలస్యం చేయకుండా వెంటనే భారాస పార్టీని ప్రపంచ రాజ్య సమితిగా మార్చుతూ సభవారు తీర్మానం చేయాలని ఆదేశపూర్వకంగా సూచించారు.
తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారు తీర్మానాన్ని ప్రతిపాదించారు.ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి కల్వకుంట్ల కవిత గారు ఆ తీర్మానాన్ని బలపరిచారు.మహారాష్ట్ర గవర్నర్ సంతోష్ రావు గారూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి హరీష్ రావు గారూ కూడా ఆ తీర్మానాన్ని బలపరచారు.అనంతరం సభాద్యక్షులు ప్రధానమంత్రి శ్రీ కల్వకుర్తి చంద్రశేఖర రావు గారు భారాస పార్టీని అంతర్జాతీయ రాజకీయ పార్టీగా ప్రకటిస్తూ తీర్మానాన్ని సభవారు ఏకగ్రీవంగా ఆమోదించారని ప్రకటించారు. దాని కొత్త పేరు ప్రపంచ రాజ్య సమితి అని వెల్లడించారు.
త్వరలోనే జరుగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తమపార్టీ అభ్యర్థి నిలబడబోతున్నాడని ప్రకటించారు. అమెరికా దేశంలో భారతీయులు ఎంతో సంఖ్యాబలం కలిగి ఉన్నారనీ, వారిలో తెలుగు వారు అందునా మన తెలంగాణా వారు అత్యధికులు అనీ అన్నారు. వారంతా కలిసికట్టుగా ప్రచారం చేస్తే మన పార్టీ వాడు అమెరికా అద్యక్షుడు కావటం తథ్యం. దానిని ఆపే మొనగాడు పుట్టలేదు - పుట్టబోడు అనీ కరతాళధ్వానాల మధ్యన సగర్వంగా అన్నారు.
ఈవార్త వెలువడిన వెంటనే అమెరికాలో భారతీయుల సంబురాలు అంబరాన్నంటాయి. ఆస్ట్రేలియా నుండీ మరికొన్ని దేశాల నుండీ కూడా తమ దేశాల్లోనూ ప్రరాస తప్పకుండా అధికారం చేపట్టాలని కోరుతూ తీర్మానం చేశాయి. తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చును. మాది ఫ్రీ కంట్రీ అని అమెరికా అద్యక్షులు వ్యాఖ్యానించారు. రష్యా ఈవిషయంలో స్పందించటానికి ఆసక్తి చూపలేదు. చైనా మాత్రం ఇదంతా ఒక తమాషా అని కొట్టిపారేసింది. ఆస్ట్రేలియా స్పందన ఇంకా తెలియరాలేదు. వారూ స్వాగతిస్తున్నారనే వినబడుతోంది.
ఐక్యరాజ్య సమితి కాలంచేసింది అనటాన్ని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ తప్పు పట్టారు. ఐతే ఐక్యరాజ్య రాజ్యసమితిలో భారత ప్రతినిధి భారతప్రధాని వ్యాఖ్యలను సమర్ధించారు. ప్రపంచానికి భారతదేశం నాయకత్వం వహించే సమయం ఆసన్నం అయినదనీ చంద్రశేఖర రావు తప్ప నేడు ప్రపంచశాంతి సుస్థిరతలను నెలకొల్పగల మహానాయకుడు ఎవరూ ముల్లోకాల్లోనూ లేరని భారతప్రతినిధి ఉద్ఘాటించారు.