మధుమేహానికి వేపుళ్లంటే ఇష్టమట!

 

కాలం మారిపోతోంది. కాలంతో పాటుగా మన ఆహారంలోని రుచులూ, అభిరుచులూ మారిపోతున్నాయి. దురదృష్టవశాత్తూ ఇలాంటి మార్పులన్నీ మన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోకుండా కేవలం జిహ్వచాపల్యం ఆధారంగానే ఉంటున్నాయి. పండ్లూ కూరగాయలకు బదులుగా వేపుళ్లూ, బేకరీ పదార్థాలూ తీసుకోవడం ఎక్కువైంది. ఇక మాంసం తినేవారైతే గ్రిల్డ్‌ చికెన్‌ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ మార్పులు ఖచ్చితంగా మన అనారోగ్యానికి కారణం అవుతున్నాయంటూ ఇప్పుడు ఒక పరిశోధన స్పష్టం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరినీ పలకరించేందుకు సిద్ధంగా ఉన్న మధుమేహపు మహమ్మారికి వేపుళ్లంటే ఇష్టమని తెలియచేస్తోంది.

 

నీరు- నిప్పు

మన వంటలో నీటికి ఉన్న ప్రాధాన్యత తగ్గిపోయి నిప్పుకి ప్రాముఖ్యత పెరిగిపోయింది. అంటే ఆహారాన్ని ఉడికించకుండా వేయించడమో, కాల్చడమో ఎక్కువయ్యింది. ఇలాంటి ఆహారంలో Advanced Glycation End Products (AGEP) అనే పదార్థాలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఈ పదార్థాలు మన శరీరంలోని ఇన్సులిన్‌ వాడకాన్ని దెబ్బతీస్తాయట. ఇన్సులిన్‌ వాడకం సరిగా లేకపోవడంతో, మన శరీరంలో చక్కెర నిల్వలు పేరుకుపోయే ప్రమాదం ఉంది. ఇలా అధికంగా పేరుకుపోయిన చక్కెర నిల్వల వల్ల గుండె, కిడ్నీలు, కళ్లు వంటి కీలక అవయవాలు దెబ్బతినిపోతాయి. పైగా AGEPల కారణంగా శరీరంలోని కణాలు కూడా వాపుకి (inflammation) లోనై గుండెపోటు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

 

పరిశోధనతో తేలిపోయింది

AGEPల కారణంగా మన శరీరంలో ఇన్సులిన్‌ వాడకంలో లోపాలు, కణాల వాపు ఏర్పడతాయన్న విషయాన్ని శాస్త్రీయంగా రుజువు చేసేందుకు న్యూయార్కుకి చెందిన కొందరు వైద్యులు ఒక పరిశోధనను నిర్వహించారు. ఇందుకోసం ఒక వందమంది అభ్యర్థలను ఎన్నుకొన్నారు. వీరంతా కూడా ఊబకాయం, అధికరక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులు ఉన్నవారే. అందరూ 50 ఏళ్లు పైబడినవారే. ఈ వంద మందిలో 49 మందిని ఎప్పటిలాగే ఆహారాన్ని తీసుకోమంటూ సూచించారు. మరో 51 మందిని మాత్రం తమ ఆహారాన్ని వండుకునే విధానంలో మార్పులు చేయమని చెప్పారు. వేయించడం, కాల్చడం కాకుండా ఉడికించడం, నానబెట్టడం వంటి పద్ధతుల ద్వారా ఆహారాన్ని వండుకోమని సలహా ఇచ్చారు.

 

ఫలితం ఊహించినదే!

ఒక ఏడాదిపాటు జరిగిన పరిశోధన తరువాత తేలిందేమిటంటే వేపుళ్ల బదులు ఉడికించిన పదార్థాలు తిన్నవారిలో ఇన్సులిన్‌ పనితీరు మెరుగుపడింది. పైగా కణాల వాపు కూడా తగ్గిపోయింది. దీంతో మధుమేహం ఉన్నవారూ, ఆ వ్యాధి ఎప్పటికీ రాకూడని కోరుకునేవారూ వేపుడు పదార్థాలకు దూరంగా ఉండాలన్న విషయం స్పష్టమైంది. అంతేకాదు! శాకాహారంలో AGEPలు స్వతహాగానే చాలా తక్కువ స్థాయిలో ఉంటాయనీ, కాబట్టి మధుమేహానికి దూరంగా ఉండాలంటే ఇలాంటి ఆహారాన్నే తీసుకోవాలని చెబుతున్నారు.

 

- నిర్జర.