ఆంధ్రప్రదేశ్ కు నాలుగో క్యాపిటల్...!
posted on Mar 13, 2021 @ 10:05AM
ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాజధానిగా ఉన్న అమరావతిని పక్కనపెట్టి కొత్తగా మూడు రాజధానుల మంత్రం ఎత్తుకున్న సంగతి తెల్సిందే. దీనిలో భాగంగా హైకోర్టును కర్నూల్ కు తరలించడం ద్వారా అక్కడ జ్యూడిషియల్ క్యాపిటల్ ఏర్పాటు చేయాలని, అలాగే సెక్రటేరియట్ ను విశాఖకు తరలించి అక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మరోపక్క ఇప్పటికే రాజధానిగా ఉన్న అమరావతిలో శాసనసభ ను కంటిన్యూ చేస్తూ శాసన రాజధాని అంటూ ఇక్కడ రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల కళ్ల నీళ్లు తుడిచే ప్రయత్నం జగన్ ప్రభుత్వం చేస్తోంది. ఈ నిర్ణయాలకు అనుగుణంగా అసెంబ్లీలో చట్టం పాస్ చేయించుకుని దానిపై గవర్నర్ కూడా సంతకం చేశారు. అయితే దీనికి వ్యతిరేకంగా రాజధానికి భూములిచ్చిన రైతులు కోర్టులను ఆశ్రయించగా ప్రస్తుతం ఈ వ్యవహారం ఇటు హైకోర్టులోనూ, అటు సుప్రీం కోర్టులోనూ విచారణలో ఉంది.
ఇది ఇలా ఉండగా రాజదాహాని తరలింపుకు వ్యతిరేకంగా కోర్టులలో కేసులు నడుస్తుండగానే జగన్ సర్కార్ మాత్రం సైలెంట్ గా అమరావతి నుండి ఒక్కొక్కటిగా ప్రభుత్వ కార్యాలయాల తరలించుకు పోతోంది. మొత్తంగా అక్కడ ఒక్క ప్రభుత్వ కార్యాలయం కూడా కనిపించకూడదన్నట్లుగా చూస్తోంది. వీటిని అయితే అటు విశాఖకు లేదంటే... పులివెందులకు తరలిస్తున్నట్లుగా ఉత్తర్వులు జారీ చేస్తోంది. ఇప్పటికే మెట్రో రైలు ఆఫీసుతో పాటు…అనేక కార్యాలయాలను విశాఖకు తరలిస్తూ.. ఆదేశాలిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా..వెటర్నరీ, బయోలాజికల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ను.సీఎం జగన్ సొంత నియోగాజకవర్గమైన కడప జిల్లా పులివెందులకు తరలిస్తూ జీవో ఇచ్చేసింది. దీనిపై పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ విజ్ఞప్తి చేశారని..అందుకే ఈ కార్యాలయాన్ని తరలిస్తున్నామని ప్రభుత్వం చెపుతోంది. అయితే వైసిపి సర్కార్ హయాంలోనే మోపిదేవి వెంకట రమణ పశుసంవర్ధక మంత్రిగా ఉన్నపుడు ఈ కార్యాలయాన్ని కంకిపాడులో ఏర్పాటు చేసందుకు అనుమతిస్తూ గతేడాది ఒక మెమో ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే కె పార్థసారధి కూడా దీనిని ఇక్కడే నిర్మించాలని ప్రయత్నించారు. దీంతో కంకిపాడులో భవనాల నిర్మాణానికి స్థలాన్ని కూడా సిద్ధం చేసి..రూ. రెండు లక్షలు వెచ్చించిన అధికారులు ఆ ప్రాంతాన్ని చదును చేశారు. ఈ స్థలంలో గత డిసెంబరులో జరగాల్సిన శంకుస్థాపన కార్యక్రమం మాత్రం చివరి నిమిషంలో వాయిదా పడింది. తాజాగా ఇక్కడ పనులన్నీ నిలిపివేసి…హఠాత్తుగా దీనిని పులివెందుకు తరలిస్తున్నారు. ఈ సంస్థ కోసం పులివెందులలో 30 వేల చదరపు గజాల్లో నిర్మాణాలు చేపట్టాలని అలాగే.. దానికి సంబంధించిన ఉద్యోగులకు పులివెందులలోనే క్వార్టర్స్ కూడా ఇవ్వాలని తాజా ఆదేశాల్లో పేర్కొన్నారు.
ప్రస్తుతం అమరావతి ప్రాంతంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలను ఇటు విశాఖతో పాటు అటు పులివెందులకూ తరలిస్తుండటంతో ప్రజలలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. విశాఖ మొదటి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయితే.. రెండోది పులివెందుల అని… కొంత మంది కాదు కాదు పులివెందుల నాలుగో క్యాపిటల్ అని అనుకుంటున్నారు. దీంతో ఏపీకి మూడు కాదు నాలుగు క్యాపిటల్స్ అని మరికొంతమంది జనాలు సెటైర్లు వేసున్నారు.మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించకపోయినా.. కార్యాలయాలు అయితే విశాఖకు లేదంటే పులివెందులకు తరలింపు జరుగుతోందని అంటున్నారు. అంతేకాకుండా త్వరలో మరికొన్ని సంస్థలను కూడా పులివెందులకు తరలించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. మరోపక్క ఏపీలో పారిశ్రామికవేత్తలు ఎవరైనా పెట్టుబడులతో వస్తే వారికి కూడా పులివెందులను మాత్రమే చూపిస్తున్నారు. తిరుపతిలో ఉన్న డిక్సన్ అనే సంస్థ కూడా విస్తరణ లోచన చేయగా.. పులివెందులలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పించారు. అలాగే జగన్ సర్కార్ ప్రకటించిన రెండు, మూడు రకాల పెట్టుబడులు కూడా పులివెందులలోనే ఉన్నాయి. అయితే మిగిలిన చోట్ల మాత్రం ప్రభుత్వపరంగా ఎటువటిని పెట్టుబడి ప్రతిపాదనలు కూడా లేవు.