టెన్నిస్‌తో ఆయుష్షు పెరుగుతుంది.. ఫుట్‌బాల్‌తో పెరగదు!


ఆటలు ఆడే మనుషులు ఆరోగ్యంగానూ, దృఢంగానూ ఉంటారన్న విషయం తెలిసిందే! ఆడే తీరుని బట్టి కొన్ని రకాల ఆటల్లో ఎక్కువ శక్తి ఖర్చవుతుందనీ, కొన్నింటిలో అంతగా కొవ్వు కరగదనీ వింటుంటాము. కానీ ఆటకీ ఆయుష్షుకీ సంబంధం ఉందంటే వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉంటుంది కదా! అలాంటి సంబంధం ఏమన్నా ఉందేమో అని తెలుసుకునేందుకు సాక్షాత్తూ ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు రంగంలోకి దిగారు.

 

14 ఏళ్ల పరిశోధన

ఈ ప్రయోగం కోసం ఇంగ్లండు, స్కాట్లాండుకు చెందిన 80 వేలమందికి పైగా వ్యక్తులను... వారి జీవనశైలి గురించి ప్రశ్నించారు. 1994 నుంచి 2008 వరకు సాగిన ఈ ప్రశ్నలలో వారు ఎలాంటి ఆటలు ఆడతారు, ఎలాంటి వ్యాయామం చేస్తారు, ఎంతసేపు చేస్తారు, పొగతాగడం లాంటి అలవాట్లు ఉన్నాయా, విద్యార్హతలు ఏమిటి... వంటి ప్రశ్నలెన్నో సంధించారు. పలు దఫాలుగా సాగిన ఈ ప్రశ్నావళి ద్వారా వచ్చిన సమాచారాన్నంతా ఒకచోటకి చేర్చి పరిశీలించారు.

 

సంబంధం ఉంది

ఈ పధ్నాలుగేళ్ల కాలంలో... పరిశోధనలో పాల్గొన్న 80 వేల మందిలో, ఓ ఎనిమిదివేల మంది చనిపోయారు. వీరిలో దాదాపు రెండువేల మంది గుండెపోటుతోనే చనిపోయారు. అయితే వీరు ఆడిన ఆటకీ ఆయుష్షుకీ సంబంధం ఉండటం పరిశోధకులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. మిగతావారితో పోలిస్తే... రాకెట్‌తో ఆడే టెన్నిస్‌ వంటి క్రీడలు అలవాటు ఉన్నవారు గుండెపోటుతో చనిపోయే అవకాశం 57 శాతం తక్కువగా ఉందని తేలింది. ఇక ఈత కొట్టేవారు 41 శాతం తక్కువగానూ, ఏరోబిక్స్‌ చేసేవారు 36 శాతం తక్కువగానూ గుండెపోటుకి లోనవుతున్నట్లు గమనించారు. కేవలం గుండెపోటే కాదు, ఇతరత్రా కారణాలతో మృత్యువుబారిన పడటం కూడా వీరిలో తక్కువగానే నమోదయ్యింది. ఆశ్చర్యం ఏమిటంటే ఫుట్‌బాల్‌, రగ్బీ వంటి ఆటలు ఆడేవారిలో ఆయుష్షుకీ ఆటకీ మధ్య ఎలాంటి సంబంధమూ కనిపించలేదు!

 

కారణం లేకపోలేదు

వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా క్రీడలకు అనుగుణంగా ఆయుష్షులో మార్పులు ఉండటానికి వెనుక స్పష్టమైన కారణం ఉందంటున్నారు పరిశోధకులు. టెన్నిస్, స్విమ్మింగ్‌, సైక్లింగ్, ఏరోబిక్స్‌ వంటి క్రీడలకు వయసుతో సంబంధం ఉండదు. ఒకసారి ఈ క్రీడలకు అలవాటు పడినవారు వాటిని నిరంతరం కొనసాగించే అవకాశం ఉంటుంది. పైగా టెన్నిస్‌, ఏరోబిక్స్ వంటి క్రీడలకు కొన్ని క్లబ్బులు ఉండటం... వాటిలో చేరినవారు మిగతావారి ప్రోత్సాహంతో సుదీర్ఘకాలం క్రీడను అంటిపెట్టుకుని ఉండటం కూడా ఓ కారణం. దీనికి విరుద్ధంగా యుక్తవయస్సులో ఫుట్‌బాల్, క్రికెట్‌ వంటి క్రీడలు ఆడేవారు... జట్టు నుంచి దూరం కాగానే ఆట నుంచి పూర్తిగా తప్పుకుంటారు. టీవీల్లో ఆటలను చూస్తూ ఆనందపడతారే కానీ తాము కూడా ఎలాగొలా ఆటని కొనసాగించేందుకు ప్రయత్నించరు. అలా నడివయసులోనే తమకు నచ్చిన క్రీడల నుంచి దూరం కావడంతో... వ్యాయామానికి సంబంధించిన ఫలితాలు వారికి అందవు.

 

మరేం చేయడం!

పైపైన చదివితే ఈ పరిశోధన ఫుట్‌బాల్‌, క్రికెట్‌ అభిమానులకు కాస్త నిరాశనే కలిగిస్తుంది. అయితే దీని వెనుక ఉన్న సూచనను అందుకుంటే వారి ఆయుష్షు కూడా మెరుగుపడుతుందని అంటున్నారు పరిశోధకులు. యుక్తవయసులో ఫుట్‌బాల్ వంటి ఆటలు ఆడినవారు... ఆ ఆటని ఆడటం కుదరకపోతే నిస్తబ్దుగా మారిపోవద్దని హెచ్చరిస్తున్నారు. అందుకు బదులుగా నిరంతరంగా సాగే సైక్లింగ్‌ వంటి వ్యాయామాన్ని ఎంచుకోమంటున్నారు.

 

- నిర్జర.