పాలలో కలిపి ఈ ఆహారాలు తీసుకుంటే విషంతో సమానం..

ఆహారమే ఆరోగ్యం. మంచి ఆహారం తీసుకుంటే ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది. శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది. శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచి ప్రమాదకరమైన జబ్బులను సైతం తట్టుకునేలా చేస్తుంది. కానీ ఆరోగ్యం అనుకుంటూనే చాలామంది ఆహారం విషయంలో తప్పులు చేస్తారు. ఈ తప్పులు కాస్తా పెద్ద ముప్పులకు దారితీస్తాయి. చాలామంది సాధారణమేలే అనుకుంటూనే పాలతో కొన్ని పదార్థాలు మిక్స్ చేయడం లేదా పాలతో పాటు తినడం చేస్తుంటారు. అవి పాలతో పాటు తీసుకోగానే విషంతో సమానమైన నష్టాన్ని శరీరానికి కలిగిస్తాయి. ఆయుర్వేదం ఈ విషయాన్ని తెలిపింది కూడా.  ఈ ఆహారాలు కొన్ని అప్పటికప్పుడు వాటి ప్రభావం చూపకపోయినా అవి స్లో పాయిజన్ లా శరీరాన్ని, శరీరంలో అవయవాలను నిర్వీర్యం చేస్తాయి. పాలతో తినకూడని ఆ  ఆహారాలేంటో తెలుసుకుంటే..

పాలు.. చేపలు..

పాలు, చేపలు కలిపి వండటం, పాల ఉత్పత్తులైన పనీర్, పెరుగు, చీజ్ వంటి వాటితో కలిపి చేప వంటకాలను తయారుచేయడం అస్సలు చేయకండి. చేపలు, పాలు, పాల ఉత్పత్తులతో కలిస్తే ఆహారం విషపూరితం అవుతుంది. ఇది ఫుడ్ పాయిజనింగ్ కు దారితీస్తుంది. జీర్ణాశయాన్ని దారుణంగా దెబ్బతీస్తుంది. మరీ ముఖ్యంగా ఈ కాంబినేషన్ తింటే చర్మ సంబంధ సమస్యలు వస్తాయి.


పాలు.. పుల్లని పండ్లు..

పుల్లని పండ్లను సిట్రస్ పండ్లు అని కూడా అంటారు. సిట్రస్ పండ్లలో విటమిన్-సి ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా పాలలో కాసింత నిమ్మరసం పడితే పాలు విరిగిపోవడం గమనించే ఉంటారు. అలాగే పనీర్ తయారీకి చాలామంది పాలలో నిమ్మరసం పోసి తయారుచేస్తుంటారు. అయితే పనీర్ ను మళ్లీ వేయించడం లేదా ఉడికించడం చేస్తారు కాబ్టటి అది తిన్నా పర్వాలేదు. కానీ పాలు-సిట్రస్ పండ్ల కాంబినేషన్ చాలా ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. కడుపులో  గందరగోళం ఏర్పరుస్తుంది. జీర్ణాశయాన్ని దెబ్బతీస్తుంది.

పాలు.. బ్రెడ్డు..

చాలామంది ఇష్టంగా తినే కాంబినేషన్ ఇది. ఉదయాన్నే కొందరు దీన్ని అలవాటుగా తింటే.. ఆరోగ్యం బాలేనప్పుడు పాలు-బ్రెడ్డు తింటుంటారు. అయితే బ్రెడ్డులో కూడా ఈస్ట్ బ్రెడ్డును పాలతో తినడం మంచిది కాదు. ఇది కడుపులో అసౌర్యం కలిగిస్తుంది. జీర్ణాశయాన్ని బలహీనంగా మారుస్తుంది. జీర్ణాశయ గోడలను మెల్లగా శిథిలం చేస్తుంది.

పాలు.. అరటిపండ్లు..

పాలు, అరటిపండ్లు చాలా మందికి ఇష్టమైన కాంబో. గ్లాసుడు పాలు, ఓ అరటిపండు తింటే దాదాపు రెండు గంటల సేపు ఆకలి అనే మాట మాట్లాడరు. ఈ కాంబినేషన్ వల్ల పుడ్ పాయిజనింగ్ వంటి ప్రమాదాలు ఏర్పడకపోయినా గొంతులో కఫానికి దారితీస్తుంది. ఇది శ్వాస సంబంధ సమస్యలకు, రోజంతా చికాకుగా ఉండటానికి కారణం అవుతుంది.

పాలు.. పుచ్చకాయ, కర్బూజ..

పుచ్చకాయ, కర్బూజ వంటి పండ్లలో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. ఈ పండ్లను పొరపాటున పాలతో తీసుకోకూడదు. చాలామంది ఈ పండ్లకు పాలు కలిపి మిల్క్ షేక్ తయారుచేసుకుని తాగడానికి ఇష్టపడుతుంటారు. కానీ ఇవి తీసుకోవడం వల్ల జీర్ణసంబంధ సమస్యలు ఏర్పడతాయి. అంత ఈజీగా వదలవు.

కేవలం పైన చెప్పుకున్నవే కాకుండా పాలతో పాటూ ఉప్పు, కారం, మాంసాహారం, ఆకు కూరలు వంటివి తీసుకోకూడదు.

                                                         *నిశ్శబ్ద.