టమాటాలు తింటే కేన్సర్ మాయం!
posted on Feb 20, 2019 @ 12:43PM
అదే పనిగా టమాటాలు తింటూ ఉంటే కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉందని చెబుతుంటారు. అలాగని టమాటాలను పూర్తిగా పక్కన పెట్టేస్తే, వాటి రుచికి దూరం కాక తప్పదు. పైగా టమాటాలో సమృద్ధిగా ఉండే విటమిన్ ఏ, సి వంటి పోషకాలకి కూడా శరీరం దూరమైపోతుంది. టమాటాని మనం పూర్తిగా దూరం చేసుకోకూడదని హెచ్చరించేలా ఇప్పుడు మరో పరిశోధన వెలుగులోకి వచ్చింది.
కేన్సర్ వల్ల కలిగే మరణాలలో, పదో శాతం మరణాలకి జీర్ణాశయ కేన్సరే కారణంగా ఉంటోంది. కడుపులో కేన్సర్ మొదలైనప్పటికీ... అదేదో సాధారణ కడుపునొప్పో, అజీర్ణ సమస్యో, అల్సరో అనుకోవడం చేత కేన్సర్ ముదిరిపోయేదాకా దాన్ని ప్రజలు నిర్లక్ష్యం చేస్తుంటారు. కాబట్టి మిగతా కన్సర్లకంటే ఇది చాలా ప్రమాదకరంగా మారుతోంది.
జీర్ణాశయ కేన్సర్లకి దారితీసే చాలా పరిస్థితులు మన స్వయంకృతాపరధాలే! ఊరగాయలు, ఉప్పు ఎక్కువగా ఉన్న పదార్థాలు, వేపుళ్లు, మాంసం... ఎక్కువగా తినడం వల్ల కేన్సర్ రావచ్చు. పొగతాగడం, మద్యపానం అలవాట్లు కూడా ఈ కేన్సర్‌కు దారితీస్తాయి. మన కడుపులో ఉండే Helicobacter pylori అనే సూక్ష్మక్రిమి వల్ల కూడా ఈ కేన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. ఇక జన్యుపరంగా వచ్చే ప్రమాదమూ లేకపోలేదు.
మెడిటేరియన్ (మధ్యధరా) ప్రాంతంలో ఉండేవారిలో ఈ తరహా కేన్సర్ చాలా తక్కువగా ఉంటోందన్న వాదన చాలా రోజుల నుంచీ ఉన్నదే! పొగతాగకపోవడం, తాజా కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం వంటి అలవాట్లే ఇందుకు కారణం అనుకునేవారు. ఇప్పుడు దానికి మరో రహస్యం కూడా తోడైది. ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్ వంటి దేశాల్లోని ప్రజలు టమాటాలను ఎక్కువగా తినడం వల్ల వారిలో జీర్ణాశయ కేన్సర్ వచ్చే ప్రమాదం తక్కువని తేల్చారు.
ఇటలీలోని National Cancer Institute of Naples సంస్థ జీర్ణాశయ కేన్సర్ మీద టమాటాల ప్రభావం తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఇందుకోసం దక్షిణ ఇటలీలో ఎక్కువగా కనిపించే San Marzano, Corbarino అనే జాతి టమాటాల నుంచి తీసిన రసాయనాలను జీర్ణాశయ కేన్సర్ రోగులకు అందించి చూశారు. ఈ రసాయనాలు రోగి శరీరంలోకి చేరినప్పుడు వారి శరీరంలోని కేన్సర్ కణాలు చనిపోతున్నాయనీ, వాటి అభివృద్ధి కూడా ఆగిపోతోందనీ గమనించారు. ఇదే తరహా ఉపయోగం మిగతా టమాటాల వల్ల ఉంటుందో లేదో తేల్చాల్సి ఉంది.
మితంగా తింటే ఏ ఆహారమైనా మనకు ఔషధంగానే ఉపయోగపడుతుందని ఈ పరిశోధన మరోసారి రుజువుచేస్తోంది. కాబట్టి భయాలన్నీ పక్కనపెట్టి టమాటాలని కూడా అప్పుడప్పుడూ ఓ పట్టుపడితే సరి!
- నిర్జర.