ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి యాదాద్రిలో...
posted on Mar 11, 2024 @ 12:25PM
యాదాద్రి నిర్మాణం బిఆర్ఎస్ హాయంలో జరిగింది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే యాదాద్రిలో నేటి నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలను రేవంత్ రెడ్డి ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు.
శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా యాదాద్రి చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలిరోజు ప్రధాన ఆలయంలో సీఎం దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ప్రభత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు, అమ్మవారికి ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, ప్రజాప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి యాదాద్రికి వెళ్లడంతో ప్రొటోకాల్ సమస్యలు రాకుండా ఆలయ ఆఫీసర్లు, పోలీసులు ముందే అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో కొండపైకి ఇతర వాహనాలను అనుమతించలేదు. ఉదయం 11 గంటల తర్వాత భక్తులకు దర్శనానికి అనుమతించడం జరిగింది.
తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి 11రోజుల పాటు జరగనున్నాయి. మహాదివ్య పుణ్యక్షేత్రమైన యాదాద్రి పంచనారసింహుల ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అధికార యంత్రం అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో మరో తిరుమల క్షేత్రంగా విరాజిల్లుతున్న యాదాద్రీశుల వైభవం నలుదిశల్లోని భక్తజనులను అలరింపజేసేలా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు రంగం సిద్ధం చేశారు. క్షేత్రాభివృద్ధిలో భాగంగా ఆలయ ఉద్ఘాటన జరిగిన తర్వాత రెండోసారి జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది.