కేసీఆర్ బంధువుకే మొదటి చాన్స్
posted on May 5, 2023 @ 5:00PM
తెలంగాణలో అప్పుడే ఎన్నికల వేడి పుంజుకుంటోంది. బీఆర్ఎస్ పార్టీ తమ తొలి అభ్యర్థి పేరును కూడా ప్రకటించింది. కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా బోయినపల్లి వినోద్ పేరును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. హుస్నాబాద్ లో నిర్వహించిన సభలో ఆయన ఈ ప్రకటన చేశారు. కుటుంబ రాజకీయాలను బీఆర్ఎస్ పెంచి పోషిస్తుంది అని ప్రతి పక్షాలు ఒవైపు విమర్శలు చేస్తున్నప్పటికీ కేటీఆర్ ఇవ్వాళ ప్రకటించిన అభ్యర్థి వినోద్ కేసీఆర్ కు సమీప బంధువు కావడం విశేషం. బోయినపల్లి వినోద్ కుమార్ బంధువులకు ఢిల్లీ పరిధిలో కొన్ని మద్యం లైసెన్స్ ల కోసం కవిత మధ్యవర్తిత్వం వహించిందని సీబీఐ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ ఎక్సైజ్ అధికారులతో కవిత, బోయినపల్లి వినోద్ కుమార్ లు పలు దఫాలు ఓ ఐదు నక్షత్రాల హోటల్ లో సమావేశమైనట్టు ఢిల్లీ బీజేపీ నేతలు ఆరోపించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీపై, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. నల్లధనం తెస్తామని చెప్పి తెల్లముఖం వేశారని విమర్శించారు. కరీంనగర్ ఎంపీ ఎవరని అడిగితే బండి సంజయ్ పేరు చెప్పాలంటే సిగ్గేస్తోందని అన్నారు. వినోద్ ను ఎంపీగా గెలిపించాలని.. బండి సంజయ్ ను ఇంటికి పంపించాలని అన్నారు