తిరుమల శ్రీవారి సేవలో ఫైనన్స్ కమిషన్ చైర్మన్ పనగారియా
posted on Apr 18, 2025 @ 10:46AM
16వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అరవింద్ పనగారియా శుక్రవారం (ఏప్రిల్ 18) ఉదయం అభిషేక సేవలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 16వ ఫైనాన్స్ కమిషన్ బృందం ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. పనగారియా నేతృత్వంలోని 16వ ఫైనాన్స్ కమిషన్ బృందం ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ పర్యటనకు బయలు దేరడానికి ముందు ఆయనతో భేటీ అయ్యింది. ఆ సందర్భంగా చంద్రబాబు వారికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
ఒక ముఖ్యమంత్రి స్వయంగా ఆర్ధిక అంశాలపై ప్రజంటేషన్ ఇవ్వడం తమను అబ్బుర పరిచిందని ఆ సందర్భంగా పనగారియా ప్రశంసించారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ పై కూడా ప్రశంసలు గుప్పించారు. వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. ఈ విధానాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇక తిరుమల శ్రీవారిని శుక్రవారం (ఏప్రిల్ 18) దర్శించుకున్నవారిలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ తదితర ప్రముఖులు ఉన్నారు.