ఉపవాసంతో కేన్సర్ మాయం
posted on Dec 14, 2016 @ 9:30AM
‘లంకణము పరమౌషధం’ అంటుంటారు పెద్దలు. కాకపోతే ఇదేదో జ్వరం, అజీర్ణం, కఫంలాంటి చిన్నాచితకా వ్యాధులకి సంబంధించిన సూత్రం అనుకునేవారం. కానీ ఏకంగా కేన్సర్‌లాంటి ప్రాణాంతక వ్యాధులలోనూ ఉపవాసం ఉపశమనాన్ని కలిగిస్తుందంటే ఆశ్చర్యం కలుగక మానదు. కానీ నమ్మక తప్పదు!
ALL అనగా
బ్లడ్ కేన్సర్ అన్న పేరు వింటేనే చాలు ఒళ్లు జలదరిస్తుంది. మనుషుల్ని బయపెట్టి, బాధపెటట్టి కొంచెంకొంచెంగా మృత్యువుకి చేరువచేసే ఈ తరహా కేన్సర్ పగవాడికి కూడా రావద్దు భగవంతుడా అనిపిస్తుంది. లుకేమియా అనేది ఆ బ్లడ్ కేన్సర్‌లో ఒక రకం. అందులో Acute lymphoblastic leukemia అనే తరహా వ్యాధి పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.
తెల్లరక్తకణాలని మార్చేసి
ALL బారిన పడ్డ రోగులలో తెల్లరక్తకణాలు దెబ్బతింటాయి. దీని వలన మనిషిలో రోగనిరోధకశక్తి తగ్గిపోతుంది. తరచూ ఏదో ఒక ఇన్ఫెక్షన్ బారినపడే ప్రమాదం పెరిగిపోతుంది. ఉపయోగం లేని తెల్లరక్తకణాలు విచ్చలవిడిగా పెరిగిపోవడం వల్ల ఎర్రరక్తకణాలు, ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గిపోతుంది. దీంతో రక్తహీనత, నీరసం, రక్తస్రావం, జ్వరంలాంటి ఇబ్బందులు తలెత్తుతాయి.
పిల్లలలో అధికం
ALL బ్లడ్ కేన్సర్ పిల్లలలో ఎక్కువ. లుకేమియా బారిన పడ్డ ప్రతి నలుగురు పిల్లలలోనూ ముగ్గురిలో ALL తరహా లుకేమియానే కనిపిస్తుంటుంది. అదృష్టవశాత్తూ 95 శాతం మందిలో కీమోథెరపీ మొదలుపెట్టిన నెలరోజులలోపే ఈ వ్యాధి తగ్గుముఖం పడుతుంది. అయితే వీరిలో దాదాపు 20 శాతం సందర్భాలలో వ్యాధి మళ్లీ తిరగబెట్టే ప్రమాదం ఉంది. కానీ ఉపవాసం ద్వారా ALLని సమూలంగా నాశనం చేసే అవకాశం ఉందేమో పరిశీలించేందుకు కొన్ని ఎలుకల మీద ప్రయోగం చేశారు పరిశోధకులు.
ఫలితం కనిపించింది
ప్రయోగంలో భాగంగా ఎలుకలలో ALL కేన్సర్ కణాలను ఎక్కించారు. ఆ తరువాత ఒకరోజు ఉపవాసం మరుసటి రోజు ఆహారం... ఇలా ఎలుకలతో ఉపవాసం చేయించారు. ఒక ఏడు వారాలు గడిచేసరికి ఉపవాసం చేసిన ఎలుకలలోని కేన్సర్ కణాలు కూడా ఆరోగ్యవంతమైన కణాలలాగా ప్రవర్తించడం మొదలుపెట్టాయి. ఈ ఎలుకల మూలుగు (bone marrow)లో కానీ ప్లీహం (spleen)లో కానీ లుకేమియాని కలిగించే కణాలే కనిపించలేదు.
ప్రయోగం తరువాత కొద్దిరోజులకే ఉపవాసం చేయించని ఎలుకలు చనిపోగా, ఉపవాసంతో కేన్సర్‌ను జయించిన ఎలుకలు సుదీర్ఘకాలం జీవించాయి. మన ఆకలిని నియంత్రించి, రక్తప్రసరణ మీద ప్రభావం చూపే leptin అనే హార్మోను మీద ప్రభావం చూపడం వల్లే ఉపవాసం సత్ఫలితాలనిచ్చింది అంటున్నారు పరిశోధకులు. అయితే పెద్దలకు సోకే AML అనే తరహా లుకేమియాలో ఇలాంటి ప్రభావం కనిపించకపోవడం గమనార్హం. ఏది ఏమైనా ఉపవాసం వల్ల కేన్సర్ సైతం నయమవుతుందని తేలిపోయింది. ఉపవాసం వల్ల ఇంకెన్ని రోగాలలో ఉపశమనం లభిస్తుందో తేలడమే తరువాయి. పెద్దలు చెప్పే ఇలాంటి ఆరోగ్య సూత్రాల వెనుక ఎంత ఉపయోగం ఉందో తెలిపే ఇలాంటి పరిశోధనలు ప్రాచీన వైద్యం పట్ల సరికొత్త విశ్వాసాన్ని అందిస్తున్నాయి.
- నిర్జర.