భూ పోరులో అలిసి ఒరిగిన రైతు
posted on Sep 4, 2022 @ 11:58AM
తన రెండకరాల భూమిని రక్షించుకోవడానికి ఒకటి రెండు కాదు ఏకంగా అయిదేళ్లు పోరా డాడు ఆ రైతు. న్యాయస్థానం కూడా అది అతనిదేనన్నది. కానీ తహసీల్దార్ కార్యాలయం మాత్రం నిరాకరించింది. గత అయిదేళ్లుగా కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నాడు,అధికారులను బతిమా లుతూనే ఉన్నాడు. ఆఖరికి కలె క్టర్, ఆర్డీఓలనీ పట్టించుకోని ఆ తహసీల్దార్ కార్యాలయం దగ్గర దీక్షచేస్తూ అలసి ప్రాణం విడిచాడు.
చిత్తూరు జిల్లా జీడీనెల్లూరు నియోజకవర్గంలోని పెనుమూరులో శనివారం ఈ విషాద ఘటన జరిగింది. పెనుమూరు మండలం రామకృష్ణాపురం గ్రామ పంచాయతీలోని 918-4 సర్వే నంబరులోని 2.52 ఎకరాల ఫారెస్టు భూమి... ఇదే గ్రామానికి చెందిన రత్నం బోయెడు (70) పూర్వీకుల స్వాధీనంలో ఉండేది. ఈ భూమిపై రత్నం బోయెడుకు హక్కు కల్పిస్తూ.. 1973లో ప్రభుత్వం ఏక్‌సాల్ పట్టా ఇచ్చింది. ఈ భూమిలో రత్నం పండ్ల చెట్లు సాగుచేస్తూ చిన్నపాటి రేకుల షెడ్డు వేసుకుని అక్కడే నివ సిస్తున్నాడు. ఈ భూమి రోడ్డుకు దగ్గరగా ఉండటం.. రత్నంతో తిమ్మిరాజు కండ్రిగ గ్రామస్థులకు గొడవలు ఉండటంతో ఆ భూమిని స్వాధీనం చేసుకోవడానికి చాలా ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు. 1981లో భూమిలోని చెట్లను, షెడ్డును ధ్వంసం చేశారు. ఆ భూమిలో ఇళ్లు వేసుకోడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. దీనిపై రత్నం కోర్టుకు వెళ్లడంతో.. అతడికి పర్మినెంట్ ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది. కోర్టు ఉత్తర్వులను అధికారులకు చూపి, భూమిపై తనకు పూర్తి హక్కులు కల్పించి, గ్రామస్థుల ఆక్రమణలను అడ్డుకోవాలని కోరినా ఏ ఒక్క అధికారీ పట్టించుకోలేదు. తహసీల్దార్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ కార్యా లయం వరకూ తిరుగుతూ అర్జీలు ఇస్తూనే ఉన్నాడు.
మరోవైపు ఆ భూమిలో గ్రామస్థులు ఇళ్లు కూడా వేసుకున్నారు. తన భూమి నుంచి వారిని ఖాళీ చేయించాలని, గ్రామస్థులకు సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని రత్నం మళ్లీ కోర్టుకు వెళ్లారు. మరోవైపు 2002 ఆగస్టు 22న తన భూమిలో ఉన్న ఇళ్లను జేసీబీతో కూల్చివేసేందుకు రైతు ప్రయత్నించగా.. వీఆర్వో వెళ్లి అడ్డుకున్నాడు. ‘కోర్టులో కేసు వేశావుగా. అక్కడే తేల్చుకో’ అని చెప్పి రైతు ప్రయత్నాలకు అడ్డం తగిలారు. అధికారుల అండతో రెచ్చిపోయిన గ్రామస్థులు అక్కడ మరో నాలుగు ఇళ్లు వేసుకోవడమేగాకుండా.. 30వ తేదీన వినాయకుడి విగ్రహం కూడా పెట్టి ఉత్సవాలు ప్రారంభిం చారు. మరోవైపు అధికారులు కూడా ఆ భూమి ఆక్రమణకు సిద్ధమయ్యారు. ఆ స్థలంలోనే సచివాలయాన్ని నిర్మించారు. రైతు భరోసా కేంద్రం నిర్మాణానికి కూడా సన్నద్ధమయ్యారు.
తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ శుక్రవారం నుంచి తహ సీల్దార్ కార్యాలయం ముందు దీక్షకు దిగాడు. శుక్రవారం రాత్రి అక్కడే పడుకున్నాడు. శనివారం ఉదయం కాలకృత్యాలు తీర్చు కుని కార్యాలయం ముందే కూర్చున్న రైతు రత్నంను అధికారులు పిలిపించారు. ఆందోళన విరమించి వెళ్లిపోవాలని హెచ్చరించ గా.. న్యాయం జరిగే వరకూ ఇక్కడే ఉంటానని, ఇళ్లు కూలుస్తుంటే తనను అడ్డుకున్న అధికారులు.. వినాయకుడి విగ్రహం పెట్టి, వాళ్లు కొత్తగా ఇళ్లు వేసుకుంటుంటే ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించాడు. వారిని ప్రశ్నిస్తూనే ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు. రెవెన్యూ సిబ్బంది పక్కనే ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి రత్నంను తీసుకెళ్లగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు చెప్పారు.
న్యాయం చేసేవరకూ కదలంరత్నం కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వడ్డెర సంఘం, టీడీపీ, జనసేన నాయకులు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. న్యాయం చేసేవరకు మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి తీసుకెళ్లబోమని ఆయన బిడ్డలు తెగేసి చెప్పారు. జేసీ వెంకటేశ్వర్ ఆదేశాలతో చిత్తూరు ఆర్డీవో రేణుక తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని రత్నం కుటుంబసభ్యులతో చర్చలు జరుపుతున్నారు. కలెక్టర్ హరినారాయణన్ కూడా వారితో మాట్లాడారు.