ఉగాది పచ్చడిలో అశోక మొక్క చిగుళ్లు!
posted on Mar 17, 2018 @ 12:07PM
కొన్ని ఆచారాలను చెక్కుచెదరకుండా శతాబ్దాల తరబడి పాటిస్తూ ఉంటాము. మరికొన్ని ఆచారాలు మాత్రం కాలానుగుణంగా మరుగున పడిపోతుంటాయి. అశోక వృక్షపు ప్రాధాన్యత తగ్గిపోవడం వాటిలో ఒకటి. ఒకప్పుడు వసంత రుతువు వచ్చిందంటే చాలు... హోళీ పండుగ సందర్భంగా, ఉగాది సమయంలోనూ అశోక వృక్షం లేనిదే పనిజరిగేది కాదు. మన్మధుని అయిదు బాణాలలో అశోక పూలు కూడా ఒకటని చెబుతారు. అలాగే ఉగాది పచ్చడిలో అశోక వృక్షపు చిగుళ్లు కూడా వేసుకోవాలని శాస్త్రంలో కనిపిస్తుంది.
అశోక వృక్షం భారత ఉపఖండంలోనే అవిర్భవించిందన్నది శాస్త్రవేత్తల మాట. అందుకే దీనిని Saraca Indica అనే శాస్త్రీయ నామంతో పిల్చుకుంటారు. భారతదేశానికి చెందిన SARACA జాతి వృక్షమని దీని అర్థం. ఇందుకు అనుగుణంగానే మన దేశ చరిత్రలో, పురాణాలలో అశోక వృక్షం పెనవేసుకుపోయి కనిపిస్తుంది. బుద్ధుడు జన్మించినది, హనుమంతుడు సీతమ్మ జాడ కనుగొన్నదీ అశోక వృక్షం దిగువునే అని చెబుతారు.
అశోక వృక్షం ఏడాది పొడవునా పచ్చగా ఉంటుంది. ఎన్నో ఆరోగ్య సమస్యలను ఔషధంగా పనిచేస్తుంది. అందుకనే దానికి అశోకము అన్న పేరు వచ్చి ఉండవచ్చు. గత ఏడాది బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కు చెందిన పరిశోధకులు అశోక వృక్షంలో క్యాన్సర్ను నివారించే రసాయనాలు ఉన్నాయని కనుగొన్నారు. కానీ ఇలాంటి ఆధునిక పరిశోధనలు జరగక పూర్వమే... మన పెద్దలు అశోక వృక్షంలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని తెలుసుకొన్నారు. వాటిలో కొన్ని...
* అశోక వృక్షం స్త్రీలకు గొప్ప వరం. స్త్రీలలో రుతుక్రమం, గర్భధారణకి సంబంధించి అనేక సమస్యలకి అశోక బెరడు, పువ్వులతో చేసిన మందులని సూచిస్తుంటారు. అధిక రక్తస్రావం, సంతానం కలగకపోవడం, రుతుస్రావం సమయంలో కడుపులో నొప్పి, రుతుస్రావం తరువాత కండరాల నొప్పులు... వంటి అనేక సమస్యలకు అశోక వృక్షం అధిక ఫలితాన్నిస్తుందట. గర్భవతులు ఈ మందుల జోలికి పోతే మాత్రం గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉంది..
* అశోకపూలని కాస్త నీటితో కలిపి రుబ్బి.... ఓ పావు గ్లాసుని తీసుకుంటే విరేచనాలు తగ్గుముఖం పడుతాయని ప్రాచీన వైద్యం చెబుతోంది.
* అశోక వృక్షం నుంచి తయారుచేసిన లేపనాలతో చర్మరోగాలు తగ్గిపోతాయనీ, చర్మం మృదువుగా మారుతుందనీ అంటారు. అశోక వృక్షపు బెరడుతో చేసిన కషాయంతో రక్తం శుద్ధి అవుతుంది కాబట్టి... ఎలాంటి మొటిమలూ, మచ్చలూ లేకుండా చర్మం యవ్వనంగా కనిపిస్తుంది.
* అశోకవృక్షపు గింజలని పొడి చేసుకుని తింటే.. కిడ్నీ, మూత్రాశయంలో ఉన్న రాళ్లు త్వరగా బయటకి వచ్చేస్తాయనీ... అవి మూత్రం ద్వారా వచ్చే సమయంలో నొప్పి కూడా తెలియదనీ చెబుతారు.
* పైల్స్ నుంచి ఉపశమన్నా కలిగించే మందులు చాలా అరుదు. కానీ అశోక వృక్షపు పూలు, బెరడు నుంచి తీసిన కషాయంతో పైల్స్ నుంచి రక్తం స్రవించడం, నొప్పి తగ్గుతాయట. అంతర్గతంగా ఉండి బాధపెడుతున్న పైల్స్ కూడా అశోకంతో అదుపులోకి వస్తాయన్నది అనుభవజ్ఞుల నమ్మకం.
* మధుమేహంతో బాధపడేవారు అశోక వృక్షపు పూలని ఎండపెట్టి పొడిచేసుకుని తింటే మంచిదని సూచిస్తున్నారు.
* అశోక వృక్షపు బెరడుకి యాంటీఫంగల్, యాంటీబ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకని బెరడుతో చేసిన చూర్ణం లేదా కషాయం- క్షయ, కడుపులో నులిపురుగులు, మూత్రకోశ వ్యాధులు వంటి అనేక సమస్యలకి ఔషధంగా పనిచేస్తుంది.
ఇన్ని ఔషధ గుణాలున్న అశోక చిగుళ్లని ఉగాది పచ్చడిలో వాడటంలో ఆశ్చర్యం లేదు కదా! అయితే రానురానూ ఈ పద్ధతిని మానుకోవడానికి ఒక కారణం కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో అశోక వృక్షం పేరుతో మనం చూస్తున్న చాలా చెట్లు నిజానికి అశోక చెట్లు కావు. వీటిని FALSE ASHOKA అని పిలుస్తారు. ఇవి అశోక వృక్షంలాగానే ఉంటాయి. కానీ సన్నగా, పొడుగ్గా, దట్టమైన ఆకులతో ఎదుగుతాయి. నిజమైన అశోకవృక్షం కాస్త విశాలంగా ఎర్రటిపూలతో కనిపిస్తే... FALSE ASHOKA ఆకుపచ్చని పూలతో ఉంటుంది. FALSE ASHOKA ఆకులు, పూలు విషప్రాయం కావచ్చు. వృక్షాల గురించి అంత అవగాహన లేని వ్యక్తులకు, అందునా... ఇప్పటి తరం వారికి ఏది నిజమైన అశోక చెట్టు, ఏది FALSE ASHOKA అని గుర్తించడం కష్టం కావచ్చు. ఇలాంటి సమస్యను నివారించేందుకే పెద్దలు క్రమేపీ ఉగాది పచ్చడి నుంచి అశోక చిగుళ్లని తొలగించి ఉంటారు.
- నిర్జర.