పింఛన్ సొమ్ముకు దొంగనోట్లా.. ఎన్ఐఏ చేత విచారణకు ఆర్ఆర్ఆర్ డిమాండ్
posted on Jan 3, 2023 @ 10:39AM
పింఛన్ లబ్ధిదారులకు దొంగనోట్ల పంపిణీపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఐ) చేత విచారణ జరిపించాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు డిమాండ్ చేశారు. వృద్ధాప్య పింఛనుదారులు పంపిణీ చేసిన దొంగ నోట్ల వ్యవహారంతో ప్రభుత్వ పెద్దలకు నిజంగానే సంబంధం లేకపోతే ముఖ్యమంత్రి రవ్వంత చొరవ తీసుకొని ఎన్ఐఏ విచారణ కోసం లేఖ రాయాలన్నారు.
సోమవారం(జనవరి 2) రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. దొంగ నోట్ల పంపిణీతో పింఛన్ ప్రపంచం నిర్గాంత పోయింది. తమకిచ్చిన డబ్బులలో ఏమైనా దొంగ నోట్లు ఉన్నాయా? అని వృద్ధులు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవలసిన అనివార్య పరిస్థితి నెలకొందన్నారు. పింఛన్ సొమ్ముగా దొంగనోట్ల పంపిణీపై ఎన్ఐఏ దర్యాప్తు కోరుతూ తన వంతుగా లేఖ రాయనున్నట్లు చెప్పారు. వాలంటీర్లు దొంగ నోట్లు ఇస్తున్నారా?, లేకపోతే వారితో ఎవరైనా ఇప్పిస్తున్నారా? అన్న అనుమానం వ్యక్తం చేశారు. వృద్ధాప్య పింఛన్ లబ్ధిదారులకు ఇచ్చే నగదులో దొంగ నోట్లు ఎవరు కలిపారన్నది నిగ్గు తేలాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన తర్వాత మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు.
అసలు దొంగ నోట్లు పంపిణీ చేసింది ఎవరు?, దీని వెనక ఏదైనా ముఠా ప్రమేయం ఉందా??, నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డుల ప్రకారం… దొంగ నోట్ల పంపిణీలో మన రాష్ట్రం మూడవ స్థానంలో ఉన్నట్టు తేలిందన్నారు. అసలు పింఛన్ లబ్ధిదారులకు బ్యాంకు అకౌంట్ ద్వారా డబ్బులను పంపిణీ చేయకుండా, నేరుగా నగదు పంపిణీ చేయడం వెనుక జగన్మోహన్ రెడ్డికి రాజకీయ దురుద్దేశం ఉందని రఘు రామకృష్ణంరాజు అన్నారు. ప్రతి నెల 1800 కోట్ల రూపాయల నగదును బ్యాంకు నుంచి డ్రా చేసి వాలంటీర్ల ద్వారా రాష్ట్రంలోని పింఛన్ లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు. ఇందులో ఐదు శాతం దొంగ నోట్లు కలిపి పంపిణీ చేసిన 80 కోట్ల రూపాయల దొంగ నోట్లు మార్కెట్ చలామణిలోకి వెళ్తాయన్నారు.
తెలంగాణలో పింఛన్ లబ్ధిదారులకు పోస్ట్ ఆఫీస్ ల ద్వారా నగదు పంపిణీ చేస్తున్నారు. బాధ్యతాయుతమైన ప్రభుత్వ అధికారి, లబ్ధిదారుల వద్ద వేలి ముద్రలు తీసుకొని, నగదును అందజేస్తున్నారు. దీనితో దొంగ నోట్ల పంపిణీకి అసలు ఆస్కారమే లేదు. కానీ రాష్ట్రంలో ఇంటింటికి ఉదయాన్నే వెళ్లి, వాలంటీర్లు పింఛన్ డబ్బులను పంపిణీ చేస్తున్నారు. ఉదయాన్నే పంపిణీ చేయడం వల్ల , వాలంటీర్లు ఇచ్చే నోట్లను లబ్ధిదారులు సరిగ్గా పరిశీలించే అవకాశం లేదు. పింఛన్ లబ్ధిదారులకు నగదు పంపిణీ వెనుక రాజకీయ స్వలాభంతోపాటు, దొంగ నోట్ల చలామణి కోసం వాలంటీర్లు ఈ విధానాన్ని అణువుగా మలుచుకునే అవకాశం ఉంది. దొంగ నోట్లు చలామణి కావద్దని ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పెద్ద నోట్లను రద్దు చేశారు. ప్రధానమంత్రి సదుద్దేశంతో తీసుకున్న ఈ నిర్ణయానికి తూట్లు పొడిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని రఘురామకృష్ణం రాజు అన్నారు.
అసలు మొదటి నుంచీ ఆంధ్రప్రదేశ్ లో వలంటీర్ల వ్యవహారం ఎప్పుడూ వివాదా స్పదంగానే ఉంది. ఎ తాజాగా ఓ వాలంటీర్.. తన పరిధిలో ఉన్న వారికి పించన్లను పంపిణీ చేశాడు. కానీ అవి దొంగ నోట్లుగా తేలవడం సంచలనం సృష్టిస్తోంది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం నర్సయపాలెం ఎస్సి పాలెంలో వాలంటీర్ ఉదయమే వచ్చి పెన్షన్లు ఇచ్చాడు. ఆ నగదును కొంత మంది తమ బంధువులకు పంపేందుకు కమిషన్ తీసుకుని డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసే దుకాణం వద్దకు వెళ్లి.. ఆ నోట్లు ఇచ్చారు. అయితే వాటిని నకిలీ నోట్లుగా దుకాణం యజమాని గుర్తించారు. దీంతో పింఛన్ దారులు అవాక్కయ్యారు.
వెంటనే వాలంటీర్‌ని నిలదీయడంతో అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు అక్కడికి చేరుకొని ఆ నగదును వెనిక్కి తీసుకొని విచారిస్తున్నారు. మొత్తం రూ.19 వేలు దొంగ నోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. వాలంటీర్ల చేతికి ప్రభుత్వ ధనం పంపిణీకి ఇవ్వడమే చట్ట విరుద్ధం. అయినప్పటికీ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం చట్ట విరుద్ధ విధానాలను యథేచ్ఛగా కొనసాగిస్తోంది. మొత్తానికి పింఛన్లలో దొంగనోట్ల వ్యవహారం సంచలనం రేపుతోంది.అసలు దోషులను పట్టుకోవాలంటే ఎన్ఐఏ విచారణ ఒక్కటే మార్గమని రఘురామ కృష్ణంరాజు వంటి వారు డిమాండ్ చేస్తున్నారు.