రిజైన్ మోడీ హాష్ ట్యాగ్ బ్లాక్.. పొరపాటు జరిగిందన్న ఫేస్ బుక్
posted on Apr 29, 2021 @ 12:07PM
దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. కరోనా సోకి చికిత్స అందక జనాలు చనిపోతున్నారు. ఆక్సిజన్ కొరతతో పిట్టల్లా రాలిపోతున్నారు. దేశంలో నెలకొన్న పరిస్థితులపై జనాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కరోనా కట్టడిలో కేంద్ర సర్కార్ విఫలమైందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. దీంతో #ResignModi అంటూ హాష్ ట్యాగ్ వైరల్ గా మారింది. ట్విట్టర్ లో ట్రెండింగ్ లో నిలిచింది.
అయితే #ResignModi హాష్ ట్యాగ్ లన్నింటినీ ఫేస్ బుక్ తాత్కాలికంగా బ్లాక్ చేసింది. దానిపై విమర్శలు రావడంతో ఫేస్ బుక్ స్పందించింది. పొరపాటున జరిగిందంటూ ప్రకటించింది. ఆ హాష్ ట్యాగ్ లతో కూడిన పోస్టులను బ్లాక్ చేయాలంటూ భారత ప్రభుత్వం తమనేమీ అడగలేదని స్పష్టం చేసింది. కొన్ని పోస్టులు తమ కమ్యూనిటీ ప్రమాణాలకు లోబడి లేవని, అందుకే వాటిని బ్లాక్ చేశామని తెలిపింది. రిజైన్ మోదీ హ్యాష్‌ట్యాగ్ పొరపాటున బ్లాక్ అయిందని, అది బ్లాక్ అవడానికి కారణం ప్రభుత్వ ఆదేశాలు కాదని ఫేస్‌బుక్ పేర్కొంది. పీరియాడికల్‌గా హ్యాష్‌ట్యాగ్‌లను బ్లాక్ చేస్తామని, దీనికి చాలా కారణాలు ఉంటాయని తెలిపింది. కొన్నిటిని మానవ ప్రమేయంతో బ్లాక్ చేస్తామని, చాలావాటిని ఆటోమేటెడ్ ఇంటర్నల్ గైడ్‌లైన్స్ ఆధారంగా బ్లాక్ చేస్తామని వివరించింది. లేబుల్‌కు సంబంధించిన కంటెంట్ వల్ల ఈ పొరపాటు జరిగిందని, స్వయంగా ఆ హ్యాష్‌ట్యాగ్ అందుకు కారణం కాదని పేర్కొంది.
కరోనా నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందంటూ కొందరు విమర్శిస్తున్నారు. తీవ్రమైన ఆక్సిజన్ కొరత, బెడ్ల కొరత వంటి వాటి నేపథ్యంలోనే వారు ప్రధాని నరేంద్ర మోదీ రాజీనామా చేయాలంటూ హాష్ ట్యాగ్ ద్వారా డిమాండ్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో #ResignModi హ్యాష్ ట్యాగ్ బ్లాక్ కావడం చర్చగా మారింది. కేంద్ర సర్కార్ ఆదేశాల వల్లే ఫేస్ బుక్ అలా చేసిందనే ఆరోపణలు వచ్చాయి. అయితే కేవలం భారత్ లో మాత్రమే వాటిని నిషేధించింది. దాదాపు 3 గంటల పాటు ఆ పోస్టులను బ్లాక్ చేసింది. ఆ తర్వాత పోస్టులను పునరుద్ధరించింది. అయితే బ్లాక్ చేసిన ఆ కొద్ది సేపూ విదేశాల్లో ఆ పోస్టులు యథావిధిగా కనిపించాయి.
గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. ట్విట్టర్ కూడా పలువురి ట్వీట్లను తొలగించింది. అమెరికా ఎన్నికల సమయంలో డొనాల్డ్ ట్రంప్ ఖాతాను కొన్ని రోజుల పాటు ఫేస్ బుక్, ట్విట్టర్ , ఇన్టాగ్రామ్ బ్లాక్ చేశాయి. ఇండియాలోనూ రైతుల ఉద్యమంపై కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ పెట్టిన పోస్టులను బ్లాక్ చేశారు. మోడీ సర్కార్ ఆదేశాల వల్లే అలా జరిగిందని కొన్ని పత్రికలు వార్తలు రాశాయి. రైతుల ఉద్యమం చాటున సంఘ విద్రోహ శక్తులు చేరారనే ఆరోపణలు రావడం వల్లే కేంద్రం అలా చేసిందనే ప్రచారం జరిగింది. ఇప్పుడు కూడా ఉప్పెనలా విరుచుకుపడుతున్న కొవిడ్ మహ్మమారి విషయంలో ప్రజలను గందరగోళంలో పడేసేలా ఉంటున్న పోస్టులను బ్లాక్ చేయాలని సోషల్ మీడియా మాద్యమాలను కేంద్ర సర్కార్ కోరి ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే విపక్షాలు మాత్రం #ResignModi హాష్ ట్యాగ్ ను బ్లాక్ చేయడంపై మండిపడుతున్నాయి. ప్రజా వ్యతిరేకతను దాచాలని మోడీ సర్కార్ ప్రయత్నాలు చేస్తుందని ఆరోపిస్తున్నారు.
#రిజైన్‌మోడీ హాష్ ట్యాగ్ వివాదంపై కేంద్రం కూడా క్లారిటీ ఇచ్చింది. బ్లాక్ చేయాలని ఫేస్‌బుక్‌ను కోరలేదని స్పష్టం చేసింది. ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’ పత్రికలో ప్రచురితమైన కథనాలు దురుద్దేశంతో కూడినవని మండిపడింది. ఫేస్‌బుక్ ఓ హ్యాష్‌ట్యాగ్‌ను తొలగించడాన్ని ప్రజల అసమ్మతిని అణచివేసేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన చర్యలుగా పేర్కొంటూ ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’ ప్రచురించిన కథనం యథార్థాల విషయంలో తప్పుదోవపట్టించడం, దురుద్దేశపూరితమని పేర్కొంది. ఈ హ్యాష్‌ట్యాగ్‌ను తొలగించాలని కోరుతూ ఎటువంటి ఆదేశాలను ప్రభుత్వం ఇవ్వలేదని, ఈ విషయాన్ని ఫేస్‌బుక్ కూడా స్పష్టంగా చెప్పిందని తెలిపింది. ఈ హ్యాష్‌ట్యాగ్‌ను పొరపాటున బ్లాక్ చేసినట్లు ఫేస్‌బుక్ ప్రకటించిందని గుర్తు చేసింది.
2021 మార్చి 5న కూడా వాల్‌స్ట్రీట్ జర్నల్ ఓ బూటకపు వార్తను ప్రచురించిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఫేస్‌బుక్, ట్విటర్, వాట్సాప్ ఉద్యోగులకు జైలు శిక్ష విధిస్తామని భారత ప్రభుత్వం బెదిరిస్తోందని ఓ బూటకపు వార్తను ప్రచురించిందని తెలిపింది. ఇది పూర్తిగా బూటకపు, కల్పిత వార్త అని అధికారికంగా ఆ పత్రికకు తెలియజేసినట్లు పేర్కొంది.