సంక్షేమం పేర దోపిడీ.. బ్రదర్ అనిల్ వ్యాఖ్యల సారాంశమిదేనా?
posted on Dec 16, 2022 @ 11:34AM
ఏపీ ప్రజలు ఈ రాష్ట్రంలో ఎందుకు పుట్టామా అని బాధపడుతున్నారా?.. జగన్ పాలనలో నానా కష్టాలూపడుతున్నారా? సంక్షేమం పేరుతో రూపాయి ఇచ్చి వంద రూపాయలు లాగేసుకుంటున్న తీరుతో జనం విసిగిపోయారా? అంటే ఔననే అంటున్నారు ముఖ్యమంత్రి జగన్ కు స్వయానా బావ అయిన బ్రదర్ అనీల్ కుమార్. బ్రదర్ అనీల్ కుమార్ జగన్ సోదరి షర్మిల భర్త. క్రిస్మస్ ముందస్తు వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన ఏపీకి వచ్చారు.
ఈ సందర్బంగా విశాఖపట్నంలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్కడా జగన్పేరు ఎత్తకుండానే బ్రదర్ అనీల్ కుమార్ ఏపీ సీఎం, తనకు స్వయానా బావ మరిది అయిన జగన్ పై విమర్శలు గుప్పించారు. విపక్షం తెలుగుదేశం ఇంత కాలంగా ఏ విషయంలో అయితే జగన్ పై విమర్శలు గుప్పిస్తోందో అరిగ్గా అవే లైన్స్ లో బ్రదర్ అనీల్ కుమార్ మాట్లాడటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. క్రిస్మస్ ముందస్తు వేడుకకు సంబంధించిన ఆ కార్యక్రమంలో బ్రదర్ అనీల్ చేసిన ప్రసంగం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకోవడం విశేషం.
అయితే బ్రదర్ అనీల్ ప్రసంగం వెనుక ఇటీవల తన భార్య షర్మిలను తెలంగాణ ప్రభుత్వం అరెస్టు చేయడం, వాహనంలో ఉండగానే టోవింగ్ చేసి పీఎస్ కు తరలించడం పై ఏపీ సీఎం, షర్మిల సోదరుడు జగన్ స్పందించకపోవడమే కారణమై ఉంటుందా అన్న చర్చ రాజకీయ వర్గాలలో జోరందుకుంది.
షర్మిల ఏపీని పట్టించుకోకుండా తెలంగాణలో తన సొంత పార్టీ వ్యవహారాలలో తలమునకలై ఉన్న సంగతి విదితమే. అయితే గత చాలా కాలంగా జగన్, షర్మిల మధ్య పొసగడం లేదన్న వార్తలు వినవస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే షర్మిల వైఎస్ వివేకా హత్య కేసులో హస్తిన వెళ్లి వాంగ్మూలం ఇచ్చి రావడం. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందంటూ.. సీబీఐకి ఫిర్యాదు చేయడం.. ఆ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ వైఎస్ వివేకా హత్య కేసు విషయంలో జగన్ కు ఇరుకున పెట్టే విధంగా చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ గమనిస్తే అన్నా చెళ్లెళ్ల మధ్య సంబంధాలు బాగా చెడ్డాయనీ అర్ధమౌతుంది. ఆ నేపథ్యంలోనే తెలంగాణలో షర్మిల అరెస్టుపై జగన్ స్పందించలేదని అంటున్నారు. అయితే బ్రదర్ అనీల్ కుమార్ విశాఖలో జగన్ సర్కార్ పై పరోక్షంగా చేసిన విమర్శలు గమనిస్తే.. నిప్పుకు కప్పిన నివురు కరిగిపోతున్నదా అనిపించక మానదు.
తన ప్రసంగంలో ఆయన స్వార్థం కోసం ప్రభుత్వాలు ఇచ్చే పథకాలపై ఆధారపడవద్దని ఆయన ఏపీ జనాలకు హితవు చెప్పారు. అంతే కాదు.. ఏపీలో పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎందుకు పుట్టామా అని ప్రజలు బాధపడేలా ఉందన్నారు. ఏపీలో పాలన దారుణంగా ఉందనీ, జనం జీవనం దుర్భరంగా మారిపోయిందనీ అనిల్ అన్నారు. స్వయానా తనకు బావ అయిన బ్రదర్ అనీల్ కుమార్ ఏపీ గడ్డపై చేసిన ఈ వ్యాఖ్యలు జగన్ కు ఇబ్బందికరం అన్న విషయంలో సందేహం అవసరం లేదు. షర్మిల, జగన్ ల మధ్య ఉన్న విభేదాలు, వివాదాల కారణంగానే బ్రదర్ అనిల్ ఈ వ్యాఖ్యలు చేశారనిపరిశీలకులు అంటున్నారు.
అయితే జగన్ టార్గెట్ గా బ్రదర్ అనీల్ కుమార్ వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటి సారి కాదు. గతంలో కూడా ఆయన సొంతంగా ఏపీలో పార్టీ పెట్టేందుకు కొన్ని ప్రయత్నాలు సాగించారు. ఆ సందర్బంగా పలు ప్రసంగాలలో రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి రావాలని చెప్పారు. అయితే ఏపీలో బ్రదర్ అనిల్ పార్టీ విషయం ఆ తరువాత ఎప్పుడూ తెరమీదకు రాలేదు అది వేరే విషయం. మొత్తంగా ఏపీ సర్కార్ పై బ్రదర్ అనీల్ వ్యాఖ్యలు రాజకీయ హీట్ ను పెంచేయడం మాత్రం ఖాయం. సొంత బావమరిది పాలనపై బ్రదర్ అనిల్ చేసిన వ్యాఖ్యలు విపక్షాలకు ఆయుధాలుగా మారతాయి. క్రిస్మస్ ముందస్తు సన్నాహాల కోసం బ్రదర్ అనిల్ రాష్ట్రంలో ఎక్కడక్కడ అయితే పర్యటిస్తారో అక్కడల్లా వైసీపీకి గడ్డు పరిస్థితులు ఏర్పడటం ఖాయమన్న అభిప్రాయం రాజకీయ వర్గాలలో వ్యక్తం అవుతోంది. మొత్తం మీద ఏపీలో పాలన, పరిస్థితులు, సంక్షేమ పథకాలు వంటి అంశాలపై బ్రదర్ అనిల్ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.