ఉక్రేనియన్ శరణార్ధులకు ఇటలీ మాజీ-మాఫియా ఆస్తి
posted on Jul 12, 2022 @ 11:01AM
ఎవరయినా ధనికులు తమ అనంతరం ఆస్తిని అనుభవించడానికి వారసులకు రాసేస్తారు. ఇది సాధార ణంగా మనం చూస్తున్నది, వింటున్నది. ఇటలీలో ఇందుకు పూర్తి విరుద్ధంగా జరిగింది. ఉక్రెయిన్‌లో యుద్ధం ఆరంభమైనప్పటినుంచీ లక్షమంది శరణార్ధులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఇటలీ ప్రభుత్వం మీద పడింది. మున్ముందు మరింతమంది రావచ్చునని అంటున్నారు. అయితే వీరందరికి నివాసాలు, తిండి, నీరు సమకూర్చడానికి ప్రభుత్వం కొత్త ఆలోచన చేసింది. ఇటలీలో మాజీ మాఫీయా లకు చెందిన 40వేలకుపైగా నివాసాలను ప్రభుత్వం లాగేసుకుని శరణార్ధ కేంద్రాలుగా మార్చింది. మాఫియా డాన్‌ల వల్ల దేశానికి ప్రయోజనం లేకపోగా భారీ నష్టమే వుంటుంది. ఈ కారణంగా వారి ఆస్తులు, నివాసాలను అక్కడి ప్రభుత్వం తెలివిగా శరణార్ధులను ఆదుకోవడానికి ఉపయోగించడానికి తల పెట్టింది. ఇటీవలి కాలంలో ఇంతటి గొప్ప నిర్ణయం ఏ దేశ ప్రభుత్వమూ తీసుకున్న దాఖలాలు లేవు.
తెతియానా ఉక్రెయిన్ బుచా నుంచి యుద్ధ భయంతో పారిపోయింది. ఉక్రెయిన్‌లో యుద్ధం ఆరంభమైన వెంటనే ఆమే ఉత్తర మిలాన్ రెస్కాల్డినాలో శరణార్ధిగా తలదాచుకుంది. వచ్చిన కొత్తల్లో అక్కడా ఇక్కడా తలదాచుకుని, భయం భయంగానే వుంది. క్రమేపీ ఇటలీ ప్రభుత్వం రాన్‌ఘెటా అనే కలాబ్రియాన్ మాఫియా నివాసాన్ని ఆక్రమించి దాన్ని శరణార్ధ శిబిరంగా మార్చింది. దీంతో ఆమె ఇపుడు ప్రశాంతంగా ఆ నివాసంలో వుంటోంది. ఆమెను అక్కడి ప్రాంతీయ మేయర్ గిల్లెస్ ఆండ్రె లెలో ఎంతో గౌరవంగా ఆహ్వా నించి అన్ని సదుపాయాలు సమకూర్చారు. ఆమె కుటుంబం ఇపుడు ఆమెతోనే వున్నది, నిర్భయంగా.
ప్రభుత్వం 2020లో మాజీ మాఫీయాలకు సంబంధించిన 1.5 బిలియన్ డాలర్ల ఆస్తులను స్వాధీనం చేసుకుంది. సొర్బోలో మెజానీలో 144 పెద్ద పెద్ద నివాసాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని శరణార్ధులకు నీడ నిస్తోంది. ఇటువంటి గొప్ప నిర్ణయాలు ప్రపంచ దేశాల్లో కూడా పాటించితే ఎంత బావుంటుందో కదా!