అన్నా డీఎంకేలో చీలిక వెనుక బీజేపీ
posted on Jul 12, 2022 @ 11:16AM
అన్నాడీఎంకేలో ఇరువురు నేతల మధ్య పూడ్చలేని అగాథం ఏర్పడడానికి వెనుక బీజేపీ ఉందా అన్న అనుమానాలను రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాల మధ్య విభేదాల కారణంగా పార్టీ నిట్టనిలువుగా చీలిపోయినట్లేనని అంటున్నారు. ఆ ఇరువురి మధ్యా విభేదాల కారణంగా అన్నాడీఎంకే పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందనీ, ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కనిపించడం లేదనీ అంటున్నారు. ఈ స్థితిలో రాష్ట్రంలో అధికార డీఎంకే కు దీటుగా నిలిచే పార్టీ కానీ, స్టాలిన్ కు దీటైన నాయకుడు కానీ లేని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. అయితే అన్నాడీఎంకే దయనీయ స్థితికి చేరడానికి కారణం బీజేపీయేనన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జయలలిత మరణానంతరం పార్టీకి దిశ, దశ లేని స్థితిలో కూడా పళనిస్వామి, పన్నీర్ సెల్వంలు సమన్వయంతో, సంయమనం పాటించి పార్టీని చీలిక ముప్పు నుంచి కాపాడారు. శశికళ పార్టీని చీలిక వైపుగా నడిపినా ఈ ఇరువురి వల్లా ఆ పరిస్థితి తలెత్తలేదని, అయితే ఇప్పుడు మాత్రం పార్టీ విపక్షంలో ఉన్న నేపథ్యంలో ఇరువురూ విభేదాలతో విడిపోయే పరిస్థితి రావడం వెనుక ఉన్నది కచ్చితంగా బీజేపీయేననీ చెబుతున్నారు.
ముఖ్యంగా పన్నీర్ సెల్వం ను పార్టీ నుంచి బహిష్కరించడమంటే జయలలిత విధేయులను పార్టీకి దూరం చేసే వ్యూహానికి తెరతీయడమేనని అంటున్నారు. అమ్మ (జయలలిత)కు వీరవిధేయుడైన పన్నీర్ సెల్వంకు పార్టీలో మంచి పలుకుబడే ఉంది. సంయమనం పాటించడం, పార్టీ ప్రయోజనాల కోసం తగ్గి ఉండటంతో పార్టీలో ఆయన పట్ల సానుభూతి కూడా ఉంది. ఇప్పుడు ఆయనను పార్టీ నుంచి బహిష్కరించడంతో ఆయన వర్గీయులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఆ కారణంగానే పన్నీర్ సెల్వం బహిష్కరణకు గురి కాగానే వారంతా పార్టీ కార్యాలయాన్ని ఆక్రమించుకున్నారు. దీంతో అన్నాడీఎంకేలో చీలిక అధికారకంగా ధృవపడినట్లైంది. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీలు పొత్తు పెట్టుకుని పోటీ చేసిన సంగతి విదితమే. ఎన్నికలలో ఓటమి తరువాత అన్నాడీఎంకేలో చీలిక రాజకీయాలకు బీజేపీ తెరతీసిందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
తమిళ నాట ఏదో ఒక ప్రాంతీయ పార్టీ పంచన నిలవడం వినా బీజేపీకి ఇప్పటి వరకూ ఒక ఉనికి, ఒక స్థానం లేదన్న సంగతి విదితమే. అయితే జయలలిత మరణం తరువాత నుంచీ అన్నాడీఎంకేలో సంభవించిన ప్రతి పరిణామం వెనుకూ కమలం హస్తం ఉంది. శశికళను పార్టీకి దూరం చేయడం దగ్గర నుంచీ.. పళని స్వామి, పన్నీర్ సెల్వం మధ్య సయోధ్య వరకూ ప్రతి విషయంలోనూ బీజేపీ జోక్యం ఉందన్నది బహిరంగ రహస్యమే. ఇప్పుడు అన్నాడీఎంకేలో గ్రూపు విభేదాలు తారస్థాయికి చేరి పార్టీ చీలిపోయే పరిస్థితి ఉత్పన్నమైనా బీజేపీ మౌనం వహించడాన్ని పరిశీలకులు ఎత్తి చూపుతున్నారు.
గతంలో ఇదే పరిస్థితి ఎదురైనప్పుడు అడగకపోయినా జోక్యం చేసుకున్న బీజేపీ ఇప్పుడు మిత్రపక్షంగా ఉండి కూడా చోద్యం చూస్తూ కూర్చోవడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. ఒక వైపు ప్రధాన ప్రతిపక్షం గ్రూపు తగాదాలతో కుదేలై.. కొట్టుకు చస్తున్న పరిస్థితిలో ఉంటే.. మరో వైపు బీజేపీ రాష్ట్రంలో తానే ప్రధాన పక్షం అన్న రీతిలో వ్యవహరిస్తున్నది.
మాజీ ఐపీఎస్ అధికారి, అన్నాడీఎంకే నుంచి బీజేపీలో చేరిన అన్నామలైను తమిళనాడు బీజేపీ చీఫ్ గా నియమించి అన్నాడీఎంకే క్యాడర్ ను కమలం గూటికి ఆకర్షించే ఆపరేషన్ కు తెరలేపింది. త్వరలో రాష్ట్రంలో అన్నాడీఎంకే బీజేపీ ఆక్రమించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని పరిశీలకులు అంటున్నారు.