టిడిపి మాజీ మంత్రి శ్రీపతి రాజేశ్వరరావు కన్నుమూత
posted on Apr 28, 2013 @ 12:14PM
మాజీ మంత్రి, అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘాల వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీపతి రాజేశ్వర రావు ఈ రోజు కన్నుమూశారు. గత కొంతకాలంగా మూత్రపిండాల వ్యాధితో రాజేశ్వర రావు బాధపడుతున్నారు. ఈ ఉదయం ఆయన నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రభుత్వంలో శ్రీపతి రాజేశ్వర రావు మంత్రిగా పని చేశారు. ఎన్టీఆర్‌కు ఆయన విపరీతమయిన అభిమాని. ఆయన అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘాన్ని స్థాపించారు. దానికి ఆయనే అధ్యక్షుడిగా ఉన్నారు. అరవై ఏళ్ల క్రితమే ఆయన అభిమాన సంఘాన్ని ఏర్పాటు చేసిన ఆయన ఎన్టీఆర్ పార్టీ పెట్టాక అందులో చేరి మూడుసార్లు శాసనసభ్యులుగా గెలుపొంది, రెండుసార్లు మంత్రిగా పని చేశారు. పార్టీ పెట్టక ముందు నుండే ఎన్టీఆర్‌తో ఆయనకు మంచి అనుబంధం ఉంది. ఎన్టీఆర్ యువసేన పెట్టి ఆయన దగ్గరయ్యారు. ఎన్టీఆర్ మీద అభిమానంతో శరీరంపై ఆయన ఎన్టీఆర్ బొమ్మను పచ్చ పొడిపించుకున్నారు. నిజాయితీ గల నేతగా ఆయన పేరుంది. ఆయన అంత్యక్రియలు రేపు బన్సీలాల్ పేట స్మశానవాటికలో నిర్వహిస్తారు.