ఈటల ఎఫెక్ట్.. రసమయికి మళ్లీ బిస్కెట్.. పాట కట్టి తిట్టినా అందలం అందుకేనా?
posted on Jul 14, 2021 @ 2:01PM
తెలంగాణ సాంస్కృతిక సారథి ఛైర్మన్‌గా రసమయి బాలకిషన్. ఇన్నాళ్లూ ఆ పోస్ట్‌లో ఆయనే ఉన్నారు. మరో మూడేళ్ల పాటూ ఆయనే ఉంటారు. ఇందులో అంత ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏముంది అనిపించవచ్చు. పైపైన చూస్తే అలానే ఉంటుంది. కేసీఆర్ మాస్టర్ మైండ్ గురించి తెలిసిన వారు ఔరా అనక మానరు. మేటర్ అలాంటిది మరి. రసమయి పదవి కంటిన్యూ అవడం వెనుక.. ఈటల ఎఫెక్ట్.. కేసీఆర్ వ్యూహం దాగుందంటున్నారు. అదెలాగంటే.....
ఎమ్మెల్యే రసమయి బాలకిషన్.. వందకు వంద శాతం ఈటల రాజేందర్ మనిషి అని అంటారు. కేసీఆర్ ప్రోత్సాహంతో పాటు ఈటల అండాదండాతోనే ఆయన ఈ స్థాయికి ఎదిగారని చెబుతారు. గతంలో మేం గులాబీ జెండాకు బానిసలం కాదు.. ఓనర్లమంటూ ఈటల రాజేందర్ రెబెల్ కామెంట్స్ చేసిన మర్నాడే రసమయి ఈటల ఇంటికి వెళ్లి మరీ కలిసొచ్చారు. నేనుసైతం నీ వెంటేనని మద్దతు తెలిపారని అంటారు. అంత అనుబంధం వారిద్దరి మధ్య.
ఇక ఈటల ఎపిసోడ్ తర్వాత వార్తల్లోకి వచ్చిన మంత్రి జగదీశ్‌రెడ్డి ఉదంతంలోనూ రసమయి యాక్టివ్ పార్టిసిపేషన్ బయటకు వచ్చింది. కర్నాటకలోని హంపిలో మంత్రి జగదీశ్‌రెడ్డి కుమారుడి బర్త్‌డే సందర్భంగా గ్రాండ్ పార్టీ జరిగింది. అందులో, ఈటల వ్యవహారం ప్రధానంగా చర్చకొచ్చిందట. కేసీఆర్ నాయకత్వం, కేటీఆర్ ఓవరాక్షన్‌పైన టీఆర్ఎస్ ముఖ్యనేతలు చెవులు కొరుక్కున్నారట. కాస్త, మందెక్కువైందో లేక, మనోడు స్వతహాగా మంచి కళాకారుడు కావడమో.. కారణం ఏదైనాగానీ.. కేసీఆర్, కేటీఆర్‌ను విమర్శిస్తూ అప్పటికప్పుడు పాట కట్టి.. గొంతెత్తి పాడారట రసమయి బాలకిషన్. ఆ సంగతి చాలారోజుల తర్వాత ఇటీవల బయటకు వచ్చింది. దీంతో.. ఈటల తర్వాత నెక్ట్స్ వేటు మంత్రి జగదీశ్‌రెడ్డిపైనే నంటూ ప్రచారం జరిగింది. అయితే, అలా తనను విమర్శించిన వారందరిపైనా వేటు వేసుకుంటూ పోతే.. టీఆర్ఎస్‌లో తన కుటుంబం మినహా ఎవరూ మిగలరనే విషయం గులాబీ బాస్‌కు తెలియంది కాదు. అందుకే, మంత్రి జగదీష్‌పై యాక్షన్ సంగతి ప్రస్తుతానికైతే పక్కన పెట్టేశారని అంటారు.
ఇక రసమయి బాలకిషన్. కేసీఆర్‌ను, కేటీఆర్‌ను పాటపాడి మరీ తిట్టాడని తెలుసు. ఆయన ఈటల మనిషి అనీ తెలుసు. అయినా.. పక్కన పెట్టేయకుండా.. మరోసారి తెలంగాణ సాంస్కృతిక సారథి ఛైర్మన్ చేయడం వెనుక కారణం ఏమై ఉంటుందా? అనే అనుమానం రాకమానదు. అక్కడే ఉంది కేసీఆర్ తెలివి. కేసీఆర్ ముందున్న మెయిన్ టార్గెట్ హుజురాబాద్‌లో ఈటలను ఓడించడం. ఇప్పటికిప్పుడు రసమయిపై వేటు వేస్తే గులాబీ బాస్‌కు కలిగే ప్రయోజనం ఏమీ ఉండకపోగా.. రసమయి ఎంచక్కా పోయి ఈటలతో చేతులు కలిపి.. ఆయన కోసం.. గజ్జ కట్టి.. పాట పాడి.. బీజేపీని గెలిపించే ప్రయత్నం చేస్తారు. అదే, రసమయికి మరోసారి ఆ పదవేదో పారేస్తే.. మా కేసీఆర్ మంచోడు.. అంతగా తిట్టినా.. తిరిగి తనకే ఆ పదవి కట్టబెట్టాడంటూ.. కట్టప్పలా ప్రగతిభవన్ కోసం కష్టపడి పని చేస్తాడని భావించి ఉంటారు కేసీఆర్. అందుకే, హుజురాబాద్ ఉప ఎన్నికల ముందుర.. కీలకమైన ఈ సమయంలో.. రసమయిని నొప్పించక.. ఆయనెళ్లి ఈటలతో చేతులు కలపకుండా చేసేలా.. మళ్లీ సాంస్కృతిక సారథి ఛైర్మన్ పదవి బాలకిషన్‌కే కట్టబెట్టారని అంటున్నారు. మరి, పదవి తీసుకున్న రసమయి కేసీఆర్ కోసమే పని చేస్తారనే గ్యారంటీ ఉందా? తన పెద్దదిక్కు ఈటలకు లోపాయికారిగానైన సాయం చేయకుండా ఉంటారా? ఇప్పటికిప్పుడు కాకపోయినా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికైనా రసమయిపై వేటు పడకుండా ఉంటుందా? ఏమో, రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే...