ప్రపంచంలోనే అతి శక్తిమంతమైన క్రెడిట్ కార్డు ఏదో తెలుసా?
మీ దగ్గర ఆ క్రెడిట్ కార్డు ఉంటే ఏకంగా విమానాన్ని కూడా కొనుగోలు చేసేయొచ్చు. మారిన జీవనశైలి లో రోజువారీ నగదు లావాదేవీలకు కరెన్సీకి బదులుగా క్రెడిట్ కార్డుల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. షాపింగ్ చేసిన వెంటనే జేబులోని డబ్బు చెల్లించాల్సిన అవసరం లేకుండా.. తరువాత బిల్ రూపంలో చెల్లించే సౌకర్యం ఉండటంతో క్రిడిట్ కార్డులకు గిరాకీ బాగా పెరిగిపోయింది. అదే డిబిట్ కార్డు ద్వారా ఖర్చు చేస్తే ఆ సొమ్ము వెంటనే మీ బ్యాంక్ ఖాతాలోంచి తగ్గిపోతుంది. అదే క్రెడిట్ కార్డు అయితే.. వెంటనే మీ బ్యాంకు ఖాతాలో సొమ్ము ఖర్చై పోదు. క్రిడిట్ కార్డు ఉపయోగిస్తే.. సదరు సొమ్మును నిర్ణీత గడువులోగా తిరిగి చెల్లించే సావకాశం ఉంటుంది.
అయితే సాధారణంగా ప్రతి క్రెడిట్ కార్డుకు ఓ పరిమితి ఉంటుంది. ఆ పరిమితి ఆ కార్డు హోల్డర్ ఆదాయం, బ్యాంకు ఖాతా స్థితి, అతడి క్రెడిట్ హిస్టరీని బట్టి బ్యాంకులు నిర్ణయిస్తాయి. కానీ ఈ సాధారణ నియమాలకు పూర్తి భిన్నంగా , ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన క్రెడిట్ కార్డు ఉంది. దానికి ఎలాంటి ఖర్చు పరిమితి ఉండదు. అదే ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన క్రెడిట్ కార్డుగా పేరొందిన అమెరికన్ ఎక్స్‌ప్రెస్ సెంచూరియన్ కార్డ్. దీకికి అమెక్స్ బ్లాక్ కార్డ్' అని పిలుస్తారు. క్రెడిట్ కార్డ్ ప్రపంచంలో ఇది నిజంగా రాజులాంటిదే. ఈ కార్డు కలిగి ఉండటం సంపద, ప్రతిష్ఠ, ఆర్థిక స్థిరత్వానికి ప్రతీకగా భావిస్తారు.
ఈ కార్డు ప్రత్యేకత ఏమిటంటే, దీనికి ముందుగా నిర్ణయించిన ఖర్చు పరిమితి ఉండదు. సాధారణ కార్డుల్లా లిమిట్ అనే భావనే ఇందులో ఉండదు. మీరు ఈ కార్డుతో ఖరీదైన లగ్జరీ కార్లు కొనుగోలు చేయవచ్చు, విలువైన ఆభరణాలు లేదా వజ్రాలు తీసుకోవచ్చు, అంతేకాదు అవసరమైతే ప్రైవేట్ జెట్‌లను కూడా కొనుగోలు చేసేయవచ్చు. అంతేకాదు, ఈ కార్డు టైటానియం మెటల్‌తో తయారవ్వడం వల్ల, ఇది సాధారణ ప్లాస్టిక్ కార్డుల కంటే బరువుగా, ప్రీమియం రూపంలో ఉంటుంది.
అయితే ఈ అపరిమిత శక్తిని ఇచ్చే కార్డును పొందడం మాత్రం చాలా కష్టం. ఇది సాధారణంగా బ్యాంకులో దరఖాస్తు చేసి పొందే కార్డు కాదు. అమెక్స్ బ్లాక్ కార్డ్ పూర్తిగా ఆహ్వానం ద్వారా మాత్రమే లభిస్తుంది. ఎవరు ఈ కార్డుకు అర్హులు అనే విషయాన్ని అమెరికన్ ఎక్స్‌ప్రెస్ సంస్థ స్వయంగా నిర్ణయిస్తుంది. సెంచూరియన్ కార్డు 1999లో అధికారికంగా ప్రారంభమైంది. అయితే దీని గురించిన కథలు, వదంతులు 1980ల నుంచే వినిపిస్తున్నాయి. ఒకప్పుడు ఇది కేవలం దీనిని ఒక పుక్కిటి పురాణ కథలాగో, అభూత కల్పనలాగో భావించేవారు. అయితే బ్రూనై సుల్తాన్ లేదా అమెక్స్ సీఈఓ లాంటి కొద్దిమంది అతి సంపన్నుల వద్ద మాత్రమే ఈ కార్డు ఉందని చెప్పుకునేవారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన మరియు అరుదైన క్రెడిట్ కార్డులలో ఒకటిగా కొనసాగుతోంది. అంచనాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఈ కార్డు వినియోగదారుల సంఖ్య లక్షకు తక్కువగా ఉంటుంది. అమెరికాలో మాత్రమే దాదాపు 20,000 మంది ఈ కార్డును ఉపయోగిస్తున్నారని అంచనా. దీనిని బట్టే దీనిని పొందడం అంత వీజీ కాదని అర్ధం చేసుకోవచ్చు.
ఇలాంటి అరుదైన క్రెడిట్ కార్డు హోల్డర్ల సంఖ్య భారత దేశంలో అతి స్వల్పం మాత్రమే. అందుబాటులో ఉన్న నివేదికల మేరకు దేశంలో కేవలం వంద మంది మాత్రమే ఈ కార్డు హోల్డర్లు ఉన్నారు. ఈ కార్డును పొందేందుకు ఎలాంటి సాధారణ అప్లికేషన్ ప్రక్రియ ఉండదు. అయితే అమెరికన్ ఎక్స్‌ప్రెస్ వద్ద మీ ఖర్చుల చరిత్ర బలంగా ఉండాలి. సాధారణంగా అమెక్స్ ప్లాటినం కార్డు ద్వారా సంవత్సరానికి కనీసం 3.5 లక్షల నుంచి 5 లక్షల డాలర్ల వరకు ఖర్చు చేసి, ఆ మొత్తాన్ని సకాలంలో చెల్లించాల్సి ఉంటుంది. ఈ కార్డు పొందాలంటే.. మీ క్రెడిట్ స్కోరు అత్యుత్తమంగా ఉండాలి, మీ నికర ఆస్తి విలువ బాగా ఎక్కువగా ఉండాలి. అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌తో మీకు దీర్ఘకాలిక సంబంధం ఉండాలి. కొన్నిసార్లు అమెక్స్ వెబ్‌సైట్‌లో రిక్వెస్ట్ ఇన్వైట్ ఫారమ్‌ను పూరించే అవకాశం ఉన్నప్పటికీ, తుది నిర్ణయం మాత్రం పూర్తిగా అమెక్స్ చేతుల్లోనే ఉంటుంది. ఈ కార్డు బలం ఎటువంటి క్రెడిట్ పరిమితి లేకపోవడమే. అంటే చెల్లింపు చరిత్ర బాగున్నంత వరకు, ఈ కార్డు హోల్డర్లు వారి వారి అవసరాలకు అనుగుణంగా ఎంత ఖర్చు చేసినా అమెక్స్ అనుమతిస్తుంది. అయితే ఖర్చుల విధానం, ఆదాయం మరియు ఆర్థిక ప్రవర్తన ఆధారంగా, అమెక్స్ ప్రతి నెలా అంతర్గతంగా ఒక డైనమిక్ లిమిట్‌ను నిర్ణయిస్తుంది. అందుకే ప్రపంచంలోని అతి ధనవంతులు ఈ కార్డుతో ప్రైవేట్ జెట్‌లు, లగ్జరీ కార్లు, ఖరీదైన ఆభరణాలు మరియు విలాసవంతమైన ఇళ్లను కూడా కొనుగోలు చేసిన ఉదాహరణలు ఉన్నాయి. ఈ కారణంగానే అమెక్స్ బ్లాక్ కార్డు క్రెడిట్ కార్డుల ప్రపంచంలో ఒక లెజెండ్‌గా నిలిచింది.