టీఆర్ఎస్ లోకి ఎర్రబెల్లి.. టీడీఎల్పీ నేతగా రేవంత్
posted on Feb 11, 2016 @ 9:34AM
తెలంగాణ టీడీపీకి దెబ్బమీద దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే గ్రేటర్ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న టీడీపీ.. ఇప్పుడు వరుస వలసలతో విలవిల్లాడుతుంది. గతంలో కొంత మంది నేతలు టీడీపీ నుండి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. గ్రేటర్ ఎన్నికల ఓటమి అనంతరం ఇప్పుడు మరికొంద మంది టీఆర్ఎస్ గూటికి చేరుతున్నారు. అయితే ఇప్పుడు పెద్ద షాకే తగిలింది టీడీపీ పార్టీకి. తెలుగు దేశం పార్టీలో కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తూ.. ఆపార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న పాలకుర్తి (వరంగల్ జిల్లా) ఎమ్మెల్యే, టిడిపి శాసనసభ పక్షనేత ఎర్రబెల్లి దయాకరరావు టీఆర్ఎస్ లో చేరి ఆపార్టీకి తేరుకోలేని షాకిచ్చారు. ఎర్రబెల్లితో పాటు మరో ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ కూడా టీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో టిడిపి బతకే అవ కాశం లేదని అందువల్లే పార్టీని వీడుతు న్నామని.. కెసిఆర్ నేతృత్వంలోనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని వారు అన్నారు.
మరోవైపు టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు వారి చేరికపై స్పందించి.. ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర రావు, ప్రకాష్ గౌడ్, వివేకానంద గౌడ్‌లను టిడిపి నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు వీరిని సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. కాగా ఇప్పటి వరకూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డిని టీడీఎల్పీనేతగా నియమించారు.