ఏపీలో ఉద్యోగుల ఉద్యమ బాట
posted on Dec 13, 2022 @ 12:14PM
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ తీరు పట్ల అన్ని వర్గాలలోనూ తీవ్ర అసహనం, ఆగ్రహం పెచ్చరిల్లుతున్నాయి. ప్రభుత్వ విధానాల కారణంగా రాష్ట్రంలో ఆర్థిక పరిస్తితి రోజు రోజుకూ దిగజారుతోంది. చివరికి ఉద్యోగులు, పెన్షనర్లకు సమయానికి వేతనాలు ఇవ్వలేక ప్రభుత్వం చేతులెత్తేసింది. అన్నింటికీ మించి ఇప్పటికే తీసుకున్న అప్పులకు వడ్డీలు చెల్లించడానికి నిధుల కోసం అన్వేషణలోనే ప్రభుత్వం పుణ్యకాలాన్ని గడిపేస్తోంది. ఇక పాలనపై దృష్టి ఎక్కడ సారిస్తుందన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలన్న ఉద్దేశమే లేనట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. దీంతో కాంట్రాక్టర్లు కొత్త పనులు చేయడానికి ముందుకు రావడం లేదు. చేస్తున్న పనులలో వేగం తగ్గించేశారు. దీంతో కొత్త పనులు మొదలు కావడం లేదు. ఇప్పటికే ఆరంభమైన పనులు పూర్తయ్యే పరిస్థితే కనిపించడం లేదు. ఇక గోదావరి పెన్నా నధుల అనుసంధానం పనులైతే పూర్తిగా నిలిచిపోయాయి. వేల కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు నిలిచిపోవడానికి చేసిన పనులకు ప్రబుత్వం బిల్లులు క్లియర్ చేయకపోవడమే కారణం.
ఇక వేదాద్రి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పనుల సంగతైతే మరీ దారుణం. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ పథకం రూపకల్పన జరిగింది. టెండర్లు కూడా పిలిచారు. అయితే వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత రివర్స్ టెండరింగ్ అంటూ మళ్లీ టెండర్లు పిలిచి, అదే సంస్థకు పనులు అప్పగించింది. అయితే పనులు ప్రారంభం కాలేదు.ప్రస్తుతం ఏపీలో వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టు పనులు ప్రభుత్వ నిర్వాకం కారణంగా నిలిచిపోయాయి. ప్రజాప్రతినిథులు, ప్రభుత్వ సలహాదారుల వేతనాలు సక్రమంగా చెల్లిస్తున్న ప్రభుత్వం కాంట్రాక్టులు దక్కించుకుని అప్పులు చేసి మరీ పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు చెల్లించడం లేదు. అడిగినా సమాధానం ఇచ్చే నాథుడు కనిపించడం లేదు.
అలాగే వేతన జీవులకూ ప్రభుత్వ దయాదాక్షిణ్యాల మేరకే వేతనాల చెల్లింపు జరుగుతోంది. నెల నెలా మొదటి తేదీన అందాల్సిన వేతనం ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. అంతే కాదు ఏ శాఖకు ఏ తేదీన వేతనాలు పడతాయో తెలియని పరిస్థితి. ఇక ఉపాధ్యాయుల పరిస్థితి అయితే మరీ దయనీయం. పీఆర్సీ కోసం పట్టుబట్టారన్న కోపాన్ని వేతనాల విషయంలో తీర్చుకుంటోందా అన్నట్లుగా జగన్ సర్కార్ వ్యవహార శైలి ఉంటోంది. నవంబర్ జీతాలు ఇప్పటికీ చాలా జిల్లాలలో టీచర్లకు అందలేదు. ఎప్పుడు అందుతాయో కూడా తెలియని పరిస్థితి.వేతన జీవులకు సకాలంలో వేతనాలు అందకుంటే ఉండే ఇబ్బందులను ప్రభుత్వం అసలు పరిగణనలోనికే తీసుకోవడం లేదు. ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు పదవీ విరమణ రోజునే వారికి రావలసిన ప్రయోజనాలన్నీ అందజేసి, పెన్షన్ పేపర్లు కూడా సిద్ధం చేసి గౌరవంగా సాగనంపేవారు.
ఇప్పుడా పరిస్థితి పూర్తిగా రివర్స్ అయ్యింది. తమ హక్కుల కోసం గొంతెత్తితే అరెస్టులూ, నిర్బంధాలు. నెలంతా పని చేసి వేతనం అడిగేందుకు వీలులేని పరిస్థితి. జీవితమంతా కొలువు చేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగులు పెన్షన్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఉద్యోగులు ఉద్యమ బాటకు కార్యాచరణ రూపొందించుకుంటున్నారని అంటున్నారు.