Read more!

ఉద్యోగం నచ్చట్లేదా? ఆరోగ్యం గోవిందా!

 

మీరు చేస్తున్న ఉద్యోగం సంతోషంగానే ఉందా? అని ఎవరినన్నా అడిగామనుకోండి- ‘ఆ! ఏదో అలా నడిచిపోతోంది,’ అన్న సమాధానమే ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఇంకొందరైతే ఆ ప్రశ్న వినిపించడమే ఆలస్యం... తమ ఉద్యోగంలో ఉన్న కష్టాలన్నింటినీ ఏకరువు పెట్టేందుకు సిద్ధపడిపోతుంటారు. చేసే ఉద్యోగంలో మనం ఎంత తృప్తిగా ఉన్నామన్నది మన మానసిక స్థితి మీద ప్రభావం చూపుతుందన్న విషయం తెలిసిందే! కానీ ఇప్పుడు అది మన ఆరోగ్యాల మీద కూడా ప్రభావం చూపుతుందన్న విషయం ఓ పరిశోధనలో రుజువైంది.

 

వేలమంది మీద!

అమెరికాలోని ఓహియో విశ్వవిద్యాలయానికి చెందిన జొనాధన్‌ దిల్రాం, హ్యూ జెంగ్‌ అనే పరిశోధకులు ఒక అధ్యయనాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా 1979లో 6,432 మంది అమెరికన్లకు సంబంధించిన వివరాలను సేకరించారు. వీరంతా కూడా అప్పుడు యుక్తవయస్కులే! వారందరినీ కూడా తమ ఉద్యోగానికి 1-4 పాయింట్ల లోపు ఎన్ని పాయింట్లని కేటాయించగలరో చెప్పమన్నారు. ఉద్యోగం ఏమాత్రం నచ్చకపోతే 1 పాయింటు, బాగా నచ్చితే 4 పాయింట్లు కేటాయించారు అభ్యర్థులు.

 

పరిశోధన మొదలు

అభ్యర్థులందరి నుంచీ తరచూ సేకరిస్తూ వచ్చిన సమాచారం ఆధారంగా, పరిశోధకులు వారిని నాలుగు భాగాలుగా విభజించారు. ప్రతిసారీ తాము చేస్తున్న ఉద్యోగం నచ్చట్లేదు అని చెప్పినవారు 45 శాతం ఉంటే, తమ ఉద్యోగం చాలా బాగుంది అని తరచూ చెప్పేవారి సంఖ్య 15 శాతంగా తేలింది. ఇక మొదట్లో ఉద్యోగం నచ్చినా రాన్రానూ విరక్తి చెందినవారు 23 శాతంగా ఉంటే, మొదట్లో తమ ఉద్యోగం ఏమాత్రం బాగోలేదని చెప్పి తరువాత తృప్తిపడిపోయినవారు 17 శాతం మంది. పరిశోధకులు ఇలా వేర్వేరు విభాగాలలో ఉన్నవారి ఆరోగ్యాలను కూడా నిశితంగా పరిశీలించారు. 40 ఏళ్లు దాటిన తరువాత వారిలో ఏర్పడే అనారోగ్య సమస్యలకీ, ఉద్యోగంలో వారు పొందుతున్న తృప్తికీ మధ్య ఏదన్నా సంబంధం ఉందేమో అని గమనించారు.

 

సంబంధం ఉంది!

మొదటి నుంచీ కూడా తాము చేస్తున్న ఉద్యోగం నచ్చట్లేదు అని చెప్పినవారు, 40 ఏళ్లు దాటిన తరువాత ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నట్లు తేలింది. నిద్ర సరిగా పట్టకపోవడం, క్రుంగుబాటుకి లోనవ్వడం, తరచూ ఆందోళనకు గురవ్వడం.... లాంటి మానసిక సమస్యలు ఎన్నింటినో ఎదుర్కొన్నట్లు బయటపడింది. మొదట్లో ఉద్యోగం బాగోలేదని చెప్పి తరువాత కాలంలో కొంచెం తృప్తిపడిన వారి పరిస్థితి మాత్రం మెరుగ్గా ఉంది. ఇక ఉద్యోగంలో ఏ రోజూ తృప్తి లభించలేదు అని భావించినవారిలో పైన పేర్కొన్న సమస్యలతో పాటుగా వెన్నునొప్పి వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు సైతం కనిపించాయి.

 

మరి నివారణ!

సాధారణంగా ఒక మనిషి తన రోజులో మూడో వంతు (8 గంటలు) ఉద్యోగం చేయడంలోనే గడిపేస్తాడు. అంతంతసేపు జీవితాన్ని గడిపే సమయంలో విపరీతమైన ఒత్తిడి, అసంతృప్తి తప్పకుండా అతని ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అవన్నీ కూడా 40 ఏళ్లు దాటిన తరువాత బయటపడటం మొదలుపెడటాయి. స్థిరంగా ఉండే ఉద్యోగం అయితే అంతగా అసంతృప్తి, ఆందోళన ఉండకపోవచ్చునని చెబుతున్నారు నిపుణులు. ఇందుకోసం జీతం కాస్త తక్కువైనా, ప్రశాంతంగా సాగిపోయే ఉద్యోగాన్నే ఎన్నుకోవాలని సూచిస్తున్నారు.

 

- నిర్జర.