ఎల్ నినో.. జూన్ రెండో వారంలోనూ ఎండలే?
posted on Jun 6, 2023 @ 12:13PM
ఇప్పటికే ఎండలు మండి పోతున్నాయి. ప ఎదిమిది గంటలు దాటిందంటే గడపదాటి అడుగు బయటకు పెట్టాలంటే జనం జంకుతున్నారు. సాధారణంగా జూన్ మొదటి వారంలో వాతావరణం చల్లబడుతుంది. తొలకరి జల్లులు కురుస్తాయి. ఏరువాక మొదలౌతుంది.
రైతులు వ్యవసాయ పనులలో బిజీ అవుతారు. కానీ ఈ ఏడో ఆ పరిస్థితి లేదు. జూన్ రెండో వారినికి కానీ తొలకరి పలకరించే అవకాశం లేదని వాతావరణ శాఖ చెప్పేసింది. ఇందుకు ఎల్ నినో పరిస్థితులే కారణమని పేర్కొంది. అంటే జూన్ రెండో వారం వరకూ ఎండలు మండిపోతాయన్న మాట. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో జనం ఎండ, ఉక్కపోతతో సతమతమౌతున్నారు. రోహిణీ కార్తె ముగిసినా ఎండల తీవ్రత తగ్గలేదు.
పైపెచ్చు రోజురోజుకూ పెరుగుతోంది. వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారిపై ఎండ ప్రభావం పడుతోంది. అయితే, వృద్దులు, చిన్న పిల్లలు, ఇతర దీర్ఘకాల వ్యాదులతో బాధపడుతున్న వారిపై ఎండల ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుంది.
రానున్న నాలుగు రోజుల్లో ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు అధికంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడమే కాకుండా వడగాల్పుల తీవ్రత కూడా పెరుగుతుందని పేర్కొని ఎల్లో కాషన్ జారీ చేసింది.